విమానయాన భద్రతా లోపాలు నిర్లక్ష్యమా.. సాంకేతిక లోపమా?

సిడ్నీ నుంచి సింగపూర్ వెళ్తున్న బ్రిటిష్ ఎయిర్వేస్ బోయింగ్ 787–9 డ్రీమ్‌లైనర్ విమానంలో తలెత్తిన సాంకేతిక లోపం ఎయిర్ లైన్స్ ప్రయాణికులను కలవరపాటుకు గురి చేసింది.;

Update: 2025-09-09 07:31 GMT

సిడ్నీ నుంచి సింగపూర్ వెళ్తున్న బ్రిటిష్ ఎయిర్వేస్ బోయింగ్ 787–9 డ్రీమ్‌లైనర్ విమానంలో తలెత్తిన సాంకేతిక లోపం ఎయిర్ లైన్స్ ప్రయాణికులను కలవరపాటుకు గురి చేసింది. మరోసారి విమానయాన భద్రతా ప్రమాణాలపై చర్చను తెరపైకి తెచ్చింది. ప్రయాణికుల ప్రాణాలను కాపాడే క్రమంలో సిబ్బంది సమయస్పూర్తి ప్రశంసనీయమైనా, అంతర్జాతీయ ప్రమాణాలతో నడిచే విమాన సంస్థలో ఇలాంటి ఘటన ఎందుకు చోటుచేసుకుంటుందన్నది ప్రధాన ప్రశ్న.

ఆందోళన

సాధారణంగా డ్రీమ్‌లైనర్ వంటి ఆధునిక విమానాలు అత్యాధునిక సాంకేతిక వ్యవస్థలతో రూపొందించబడ్డాయి. అయినప్పటికీ ప్రయాణం మధ్యలో క్యాబిన్‌లో పొగ, ఇంధన వాసన వ్యాపించడం నిర్లక్ష్యానికి సంకేతమా? లేక అప్రమత్తతతోనైనా తప్పించుకోలేని సాంకేతిక లోపమా? అనేది స్పష్టంగా తెలియాల్సి ఉంది.

భద్రతలో లోపాలు... భయాందోళనలు?

క్యాబిన్‌లో లైట్లు ఆరిపోయానని, వాసనను గుర్తించామని, పొగ కనిపించిందని ప్రయాణికులు చెప్పడం సాధారణ లోపం కాదనే విషయాన్ని సూచిస్తోంది. విమానం గగనతలంలో ఉన్న సమయంలోనే ఇలాంటి పరిస్థితులు తలెత్తడం, శిక్షణ పొందిన సిబ్బందే కాకుండా, ప్రతి ప్రయాణికుడిని కూడా భయాందోళనకు గురి చేస్తున్నాయి. ఇది భద్రతా ప్రమాణాల్లో ఎక్కడైనా లోపం ఉందా అనే అనుమానాలను రేకేత్తిస్తున్నది.

సమయస్ఫూర్తి ప్రశంసనీయం

అత్యవసర పరిస్థితిని గుర్తించి సిబ్బంది “మే డే” హెచ్చరిక జారీ చేయడం, విమానాన్ని సురక్షితంగా సిడ్నీకి మళ్లించడం సిబ్బంది శిక్షణా ప్రమాణాలకే నిదర్శనం. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడం సిబ్బంది ప్రొఫెషనలిజం వల్లేనని అనడంలో సందేహం లేదు.

విచారణతోనే నమ్మకం

ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు. స్పష్టమైన విచారణతోనే ప్రయాణికుల్లో నమ్మకం పెరుగుతుంది. లోపం చిన్నదైనా, పెద్దదైనా దాని కారణాలను బహిరంగంగా వెల్లడించడం సంస్థ బాధ్యత. లేదంటే "సాంకేతిక సమస్య" అనే పేరుతో అన్ని ఘటనలను మూసివేస్తే నమ్మకాన్ని కోల్పోక తప్పడదు.

భవిష్యత్తుకో పాఠం

ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న విమాన ప్రయాణాల దృష్ట్యా, భద్రతా ప్రమాణాలను కచ్చితంగా పాటించడం తప్పనిసరి. ఈ ఘటన ఒక హెచ్చరికలా భావించి, సంస్థలు తమ నిర్వహణ, తనిఖీ వ్యవస్థలను మరింత కఠినతరం చేయాలి. ప్రయాణికులు ఎప్పటికీ "సురక్షిత ప్రయాణం" అనే నమ్మకాన్ని కోల్పోకూడదు.

Tags:    

Similar News