బీజేపీ లీడరే అయినా డోంట్ కేర్.. గాలి జనార్దనరెడ్డికి కూటమి షాక్!

అయితే తనకు కేటాయించిన భూములు వెనక్కి తీసుకోడానికి ప్రభుత్వం ప్రయత్నించడాన్ని సవాల్ చేస్తూ గాలి జనార్దనరెడ్డి హైకోర్టును ఆశ్రయించారు.

Update: 2026-07-10 14:30 GMT

కర్ణాటకకు చెందిన బీజేపీ సీనియర్ నేత, గంగావతి ఎమ్మెల్యే గాలి జనార్దనరెడ్డికి కూటమి ప్రభుత్వం షాకిచ్చింది. జనార్దనరెడ్డికి చెందిన బ్రాహ్మణి స్టీల్స్ కు ఏపీ ప్రభుత్వం గతంలో కేటాయించిన 10,707 ఎకరాల భూమిని వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించింది. ఈ పరిణామం రాజకీయం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కడప జిల్లాల్లో స్టీల్ ప్లాంట్ నిర్మిస్తామని 18 ఏళ్ల క్రితం జనార్దనరెడ్డి భూములు తీసుకున్నారు. అయితే ఇప్పటివరకు స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి ఎటువంటి చర్యలు తీసుకోకపోగా, ఆ భూములను తనఖాపెట్టి రుణాలు తీసుకున్నారని ప్రభుత్వం చెబుతోంది. దీంతో ప్రజల ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా చూడాలనే ఉద్దేశంతో బ్రాహ్మణి స్టీల్ ఆధీనంలో ఉన్న భూములను తిరిగి స్వాధీనం చేసుకున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.

ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా బ్రాహ్మణి స్టీల్స్ నిర్మాణానికి గాలి జనార్దనరెడ్డి ముందుకువచ్చారు. అనంతపురం జిల్లాలో ఓబుళాపురం మైన్స్ తోపాటు కడపలో స్టీల్ ప్లాంట్, విమానాశ్రయం నిర్మిస్తామని ప్రభుత్వం నుంచి భారీగా భూములు తీసుకున్నారు. స్టీల్ ప్లాంటుకు 10,707 ఎకరాలు, విమానాశ్రయం కోసం అదనంగా మూడు ఎకరాలు తీసుకున్నారని అంటున్నారు. ఓబుళాపురం నుంచి ఇనుప ఖనిజం తవ్వినా, స్థానికంగా స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి మాత్రం జనార్దనరెడ్డి చొరవ తీసుకోలేదని ప్రభుత్వం ఆరోపిస్తోంది. ఈ కారణంతో 2013లో కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగానే భూములు వెనక్కి తీసుకోడానికి ప్రయత్నాలు ప్రారంభమయ్యాయని అంటున్నారు.

అయితే తనకు కేటాయించిన భూములు వెనక్కి తీసుకోడానికి ప్రభుత్వం ప్రయత్నించడాన్ని సవాల్ చేస్తూ గాలి జనార్దనరెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. కోర్టులో సుదీర్ఘంగా సాగిన వాదనల అనంతరం జనార్దన్ రెడ్డికి ఎదురుదెబ్బ తగిలిందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో బ్రాహ్మణి స్టీల్ ప్లాంట్, ఎయిర్ పోర్టు నిర్మాణానికి కేటాయించిన భూములను వెనక్కి తీసుకుంటూ ప్రభుత్వం ఆదేశాలు విడుదల చేసిందని చెబుతున్నారు. ప్రస్తుతం ఈ చర్య రాజకీయంగా విస్తృత చర్చనీయాంశంగా మారింది. జనార్దనరెడ్డి బీజేపీలో ఉన్నప్పటికీ వైఎస్ కుటుంబంతో అత్యంత సన్నిహిత సంబంధాలు కొనసాగించేవారు. వైఎస్ మరణాంతరం ఆయన కుమారుడు జగన్మోహనరెడ్డితోనూ అంతే అనుబంధం కొనసాగించారని చెబుతున్నారు.

గాలి జనార్దనరెడ్డికి ఇచ్చిన మైనింగ్ లీజుల కారణంగానే అప్పట్లో సీబీఐ కేసులు నమోదయ్యాయి. మాజీ సీఎం జగన్మోహనరెడ్డితోపాటు పలువురు ఐఏఎస్ అధికారులు విచారణలు ఎదుర్కొని అరెస్టు కావాల్సివచ్చిందని అంటున్నారు. ఇక ఆ సమయంలో తనకు వ్యతిరేకంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నారనే కారణంగా గాలి జనార్దనరెడ్డి తీవ్రవిమర్శలు చేసేవారు. అయితే అప్పట్లో విపక్ష నేతగా ఉన్న చంద్రబాబు ఓబుళాపురం మైన్స్, బ్రాహ్మణి స్టీల్స్ భూములపై రాజీలేని పోరాటం చేశారని గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు అవకాశం లభించడంతో నాటి విమర్శలతో జోరుచూపించిన బీజేపీ నేత గాలి జనార్దనరెడ్డికి 18 ఏళ్ల అనంతరం షాక్ ఇచ్చారని అంటున్నారు.

టీడీపీ, బీజేపీ మధ్య పొత్తు ఉన్నప్పటికీ కర్ణాటక నేత గాలి జనార్దనరెడ్డి విషయంలో సీఎం చంద్రబాబు గట్టి నిర్ణయమే తీసుకున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నుంచి బ్రాహ్మణి స్టీల్ కు కేటాయించిన భూములు వెనక్కి తీసుకునే ప్రక్రియ ప్రారంభించి ఎట్టకేలకు పూర్తి చేశారని అంటున్నారు. నిబంధనల ప్రకారం గాలి జనార్దనరెడ్డికి నోటీసులు పంపిన ప్రభుత్వం ఆయన నుంచి సమాధానం రాకపోవడంతో భూములు స్వాధీనం చేసుకుంటున్నట్లు తాజాగా ప్రకటించింది.

Tags:    

Similar News