బొత్సతో యుద్ధం.. రంగంలోకి స్టేట్ టీడీపీ

అయితే శుక్రవారం బొత్స ఆరోపణలు చేసేవరకు ఈ ఇష్యూ విజయనగరం రాజకీయాల వరకే పరిమితమైంది. మరీ ముఖ్యంగా బొత్స వర్సెస్ నాగార్జున అన్నట్లే సాగింది.;

Update: 2025-10-12 06:52 GMT

వైసీపీ సీనియర్ నేత, మండలిలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు బొత్స సత్యానారాయణ, విజయనగరం టీడీపీ అధ్యక్షుడు కిమిడి నాగార్జున మధ్య మొదలైన యుద్ధం నెక్ట్స్ లెవెల్ కు చేరుకుంటోంది. విజయనగరం అమ్మవారి ఉత్సవాల్లో తనను పట్టించుకోలేదని, తన హత్యకు కుట్ర జరిగిందని మండలి వైసీఎల్పీ నేత బొత్స ఆరోపణలతో రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు రంగంలోకి దిగారు. ఇంతవరకు బొత్స వర్సెస్ నాగార్జునగా సాగిన పొలిటికల్ ఫైట్ పల్లా ఎంట్రీతో మరింత ఆసక్తికరంగా మారింది.

విజయనగరం అమ్మవారి పండుగ సందర్భంగా బొత్సకు డీసీసీబీ అధ్యక్షుడు కిమిడి నాగార్జున షాక్ ఇచ్చారు. పండుగ సందర్భంగా విజయనగరం వచ్చిన బొత్స.. డీసీసీబీ భవనంపై నుంచి అమ్మవారి ఉత్సవాలు తిలకిస్తారని షెడ్యూల్ విడుదల చేయడంతో వివాదం మొదలైంది. డీసీసీబీ భవనంపై 30 ఏళ్లుగా బొత్స ఉత్సవాలు తిలకిస్తుంటే, ఈ ఏడాది అనుమతించకుండా అవమానించారని బొత్స, ఆయన అనుచరులు ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. అంతేకాకుండా తనను అంతమొందించే కుట్ర జరిగిందని ఆయన తీవ్ర ఆరోపణలు చేయడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

అయితే శుక్రవారం బొత్స ఆరోపణలు చేసేవరకు ఈ ఇష్యూ విజయనగరం రాజకీయాల వరకే పరిమితమైంది. మరీ ముఖ్యంగా బొత్స వర్సెస్ నాగార్జున అన్నట్లే సాగింది. బొత్స తరఫున ఆయన పరివారం మొత్తం ఈ వివాదంపై రచ్చ చేసేందుకు రెడీ అవగా, టీడీపీ నేత నాగార్జున ఒక్కరే వారిని ఎదుర్కొంటూ వచ్చారు. జిల్లా టీడీపీ నేతలు ఎవరూ ఈ ఇష్యూలో జోక్యం చేసుకోకపోవడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఇదే అదునుగా భావించిన బొత్స.. పరిస్థితిని తనకు సానుకూలంగా చేసుకునేలా తన హత్యకు కుట్ర పన్నారనే సంచలన ఆరోపణలు చేయడంతో వేడి మరింత రాజుకుంది.

ఇక బొత్సకు కౌంటరుగా రంగంలోకి దిగిన రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు.. ఇష్యూను జగన్ వైపు మళ్లించే ప్రయత్నం చేశారు. జగన్ ను హత్య చేయాల్సిన అవసరం జగన్ కు తప్ప మరెవరీ లేదన్నట్లు ఆయన విమర్శలు చేయడం విజయనగరం యుద్దం మరింత ఆసక్తికరంగా మారింది. మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసును ముడిపెడుతూ బొత్స ఆరోపణలను తిప్పికొట్టే ప్రయత్నం చేసిన రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు పల్లా విజయనగరం టీడీపీ అధ్యక్షుడు కిమిడి నాగార్జునకు పార్టీ అండగా ఉంటుందని సంకేతాలు పంపారు. దీంతో ఈ వివాదం మరింత ముదిరే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు తనకు జరిగిన అవమానంపై గవర్నరుకు ఫిర్యాదు చేసేందుకు బొత్స రెడీ అవుతున్నట్లు చెబుతున్నారు. దీంతో ఈ వివాదానికి ఇప్పుడప్పుడే ఫులుస్టాప్ పడే సూచనలు కనిపించడం లేదని విశ్లేషిస్తున్నారు.

Tags:    

Similar News