బొత్స కుమార్తె పొలిటికల్ ఎంట్రీ...టార్గెట్ అక్కడే !

బొత్స కుమార్తె అనూష చీపురుపల్లి నుంచి వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారు అని చెబుతున్నారు. బొత్స అక్కడ నుంచి అయిదు సార్లు పోటీ చేసి మూడు సార్లు గెలిచారు.;

Update: 2025-11-17 16:07 GMT

రాజకీయాల్లో వారసులు దిగడం చాలా కామన్ అయిపోయిన విషయం. తాము మూడు నాలుగు దశాబ్దాల పాటు ప్రజలలో ఉంటూ ఎంతో కష్టపడి సంపాదించుకున్న పలుకుబడిని అలా వదిలేయడం ఎవరికీ ఇష్టం ఉండదు, పైగా క్యాడర్ అనుచరులు అసలు ఊరుకోరు. దాంతో పాటు పార్టీ అధినాయకత్వాలు కూడా కొత్త విధానంలో ఆ కుటుంబంలోని వారినే యువ నాయకత్వాలుగా ప్రోత్సహిస్తున్న తీరు కనిపిస్తోంది. ఇక ఏపీ పాలిటిక్స్ చూస్తే 2029 ఎన్నికలు పూర్తిగా యంగ్ స్టర్స్ మధ్యనే సాగుతాయని అంటున్నారు.

వైసీపీలో వారంతా :

ఇక వైసీపీలో చూస్తే చాలా మంది సీనియర్ నేతలు వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడానికి పెద్దగా ఆసక్తిని చూపించడం లేదు అని అంటున్నారు. దానికి అనేక కారణాలు ఉన్నాయి. తాము వెన్ను దన్నుగా ఉంటూ తమ వారసులను లైన్ లోకి తీసుకుని రావాలని వ్యూహం కూడా ఇందులో ఉంది. మాజీ మంత్రి పేర్ని నాని తన కుమారుడు పేర్ని కిట్టూని ప్రోత్సహిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఆయనే పోటీ చేస్తారు కూడా. అలాగే భూమన కరుణాకరరెడ్డి కుమారుడు అభయ్ రెడ్డి కూడా ఫ్యూచర్ లీడర్ గా ఉన్నారు. ఇప్పుడు మరో సీనియర్ నేత బొత్స సత్యనారాయణ సైతం తన వారసుల వైపు చూస్తున్నారు అని అంటున్నారు.

అదే ఆలోచనతో :

బొత్సది దాదాపుగా నాలుగు దశాబ్దాలకు పైబడిన రాజకీయ జీవితం. ఆయన ఎన్నో సార్లు గెలిచి మంత్రి ఎంపీ అయ్యారు. ప్రస్తుతం లీడర్ ఆఫ్ అపోజిషన్ గా శాసనమండలిలో ఉంటున్నారు. బొత్సకు వచ్చే ఎన్నికల నాటికి ఏడు పదులకు చేరువ అవుతాయని అంటున్నారు. దాంతో పాటు ఆరోగ్య కారణాల రిత్యా కూడా ఆయన పోటీ నుంచి తప్పుకుని రిటైర్ కావాలని చూస్తున్నారు. ఆ ప్లేస్ లో తన వారసులను దించాలని చూస్తున్నారు బొత్సకు కుమారుడు కుమార్తె ఉన్నారు ఇద్దరూ వైద్య వృత్తిలో ఉన్నారు. కుమారుడు సందీప్ అయితే రాజకీయ వారసుడుగా పొలిటికల్ ఎంట్రీ ఇస్తారు అని ఇప్పటిదాకా అంతా అనుకున్నారు. కానీ బిగ్ ట్విస్ట్ అన్నట్లుగా ఇపుడు కుమార్తె ఎంట్రీ ఇచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. బొత్స కుమార్తె పేరు డాక్టర్ అనూష. ఆమె ప్రజా జీవితంలోకి ప్రవేశించాలని పూర్తి ఆసక్తిగా ఉన్నారు అని అంటున్నారు.

చీపురుపల్లి నుంచి :

బొత్స కుమార్తె అనూష చీపురుపల్లి నుంచి వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారు అని చెబుతున్నారు. బొత్స అక్కడ నుంచి అయిదు సార్లు పోటీ చేసి మూడు సార్లు గెలిచారు. గెలిచిన మూడు సార్లు మంత్రిగా పీసీసీ చీఫ్ గా కీలక పదవులలో ఉన్నారు. ఆయనకు చీపురుపల్లి కంచుకోట. పైగా అచ్చి వచ్చిన సీటు. గతంలో టీడీపీ జెండా ఎగరేసిన ఈ సీటుని తనకు అనుకూలంగా మార్చుకున్నారు బొత్స. గ్రౌండ్ లెవెల్ నుంచి నియోజకవర్గం దాకా బొత్సకు పెద్ద ఎత్తున అనుచర గణం ఉంది. దాంతో ఈ సీటు నుంచే డాక్టర్ అనూష పోటీ చేసేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు.

భారీ అడ్వాంటేజ్ :

ఈ నియోజకవర్గంలో బలమైన సామాజిక వర్గం అండ ఉంది. అంతే కాదు బొత్సకు పెద్ద ఎత్తున క్యాడర్ ఉంది. ఇక డాక్టర్ గా అనూషకు కూడా ప్రజలతో మంచి సంబంధాలు ఉన్నాయి. వై భారీ అడ్వాంటేజ్ గా మారుతాయని అంటున్నారు. దాంతో ఆమె ఇపుడు పూర్తి ఫోకస్ అక్కడ పెట్టారని అంటున్నారు. గ్రాస్ రూట్ లెవెల్ నుంచి నరుక్కుని వస్తున్నారు అని అంటున్నారు. రాజకీయ దిగ్గజం అయిన బొత్స సలహా సూచనల మేరకు అనూష నడచుకుంటోంది అని అంటున్నారు. ఆమె ప్రజలను నేరుగా కలవడం వారితో మమేకం కావడంతో పాటు వైద్య పరమైన కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ బాగా చేరువ అవుతున్నారు అని అంటున్నారు.

పూర్తి ఆసక్తికరంగా :

ఇక వైసీపీ అధినాయకత్వం కూడా బొత్స కుమార్తె పోటీ విషయంలో పచ్చ జెండా ఊపుతుందని అంటున్నారు. ఆయనకు పార్టీలో ఉన్న పలుకుబడి అలాంటిది అని అంటున్నారు. మొత్తానికి చూస్తే బొత్స కుమార్తె 2029 లో రాజకీయ అరంగేట్రం చేస్తే మాత్రం చీపురుపల్లిలో పోరు పూర్తి ఆసక్తికరంగా మారుతుంది అని అంటున్నారు. ఇక బొత్స సతీమణి ఝాన్సీ రాణి, తమ్ముడు బొత్స అప్పలనరసయ్యతో పాటు ఆయన బంధులు అంతా రాజకీయాల్లో ఉంటూ ఎన్నో పదవులు అందుకున్నారు. ఇపుడు కుమార్తె కూడా రాణిస్తుందని బొత్స వర్గం అంటోంది.

Tags:    

Similar News