జిల్లాల పునర్విభజన.. కృష్ణా జిల్లాకు ఆ పేరు పెట్టాల్సిందే..
ఇప్పటికే కృష్ణా జిల్లాకు చెందిన గన్నవరం, పెనమలూరు నియోజకవర్గాలను ఎన్టీఆర్ జిల్లాలో చేర్చాలని ప్రజలు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తుండగా, సెంట్రల్ ఎమ్మెల్యే ఉమా చేసిన కొత్త ప్రతిపాదన తీవ్ర చర్చకు దారితీస్తోంది.;
జిల్లాల పునర్విభజనపై కూటమి ప్రభుత్వం చేస్తున్న కసరత్తు కొలిక్కి వచ్చింది. రాష్ట్రంలో మరో మూడు కొత్త జిల్లాలు, ఐదు రెవెన్యూ డివిజన్లను కొత్తగా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ దశలో టీడీపీకి చెందిన విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమా కొత్త ప్రతిపాదన తెరపైకి తెచ్చారు. ఇప్పటికే కృష్ణా జిల్లాకు చెందిన గన్నవరం, పెనమలూరు నియోజకవర్గాలను ఎన్టీఆర్ జిల్లాలో చేర్చాలని ప్రజలు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తుండగా, సెంట్రల్ ఎమ్మెల్యే ఉమా చేసిన కొత్త ప్రతిపాదన తీవ్ర చర్చకు దారితీస్తోంది.
గత ప్రభుత్వంలో పార్లమెంటు నియోజకవర్గం ప్రాతిపదికగా కొత్త జిల్లాలను ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా ఉమ్మడి కృష్ణా జిల్లా రెండుగా ఏర్పడింది. మచిలీపట్నం కేంద్రంగా కృష్ణా జిల్లా యథావిధిగా కొనసాగుతుండగా, కొత్తగా విజయవాడ కేంద్రంగా ఎన్టీఆర్ జిల్లాను ఏర్పాటు చేశారు. పరిపాలనా సౌలభ్యం దృష్ట్యా ఈ నిర్ణయాన్ని అంతా స్వాగతించినా, విజయవాడ నగరానికి ఆనుకుని ఉన్న గన్నవరం, పెనమలూరు నియోజకవర్గాలను కృష్ణా జిల్లాలో కలపడంపైనే ఇప్పటికీ అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.
విజయవాడ నగరంలో అంతర్భాగంగా ఉన్న ఈ రెండు నియోజకవర్గాలను కృష్ణా జిల్లాలో కలపడం వల్ల నగరాభివృద్ధిపై ప్రభావం చూపుతోందని అంటున్నారు. నగరం చుట్టూ ఉన్న ఈ రెండు నియోజకవర్గాలు కార్పొరేషన్ సేవలు అందుకోలేకపోవడంతో ఆయా ప్రాంతాలను కలిసి గ్రేటర్ విజయవాడగా ఏర్పాటు చేయాలని డిమాండ్ వినిపిస్తోంది. సీఎం చంద్రబాబు సైతం మంత్రివర్గ ఉప సంఘంతో భేటీ అయిన సమయంలో పెనమలూరు నియోజకవర్గాన్ని ఎన్టీఆర్ జిల్లా పరిధిలోకి ఎందుకు తేలేదని కూడా ప్రశ్నించారు. దీంతో ఉమ్మడి కృష్ణా జిల్లాపై ప్రత్యేక చర్చ జరిగింది. అయితే ఈ విషయంపై స్థానిక శాసనసభ్యుడు బోడె ప్రసాద్ ఆసక్తి చూపకపోవడంతో పెనమలూరు నియోజకవర్గాన్ని కృష్ణా జిల్లాలోనే వదిలేశారు.
ఇక ఇదే జిల్లాకు పేరు మార్చాలంటూ విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమా కొత్త డిమాండ్ తెరపైకి తెచ్చారు. కృష్ణా జిల్లాకు కాపు నేత వంగవీటి మోహనరంగా పేరు పెట్టాలని ఆయన కోరుతున్నారు. విజయవాడ జింఖానా గ్రౌండ్స్ వేదికగా జరిగిన కాపునాడు స్వర్ణోత్సవంలో ఎమ్మెల్యే చేసిన డిమాండ్ పై విస్తృతంగా చర్చ జరిగింది. ఈ విషయంలో కాపు నేతలు అంతా పార్టీలకు అతీతంగా ముందుకు రావాలని బొండా ఉమ పిలుపునిచ్చారు. దివంగత మాజీ ఎమ్మెల్యే వంగవీటి రంగా మరణించి దాదాపు నాలుగు దశాబ్దాలు కావస్తున్నా, ఆయన ప్రభావంపై ఈ ప్రాంతంలో ఇప్పటికీ పెద్ద ఎత్తున చర్చ సాగుతుంటుంది. ఆయన అభిమానులు అన్నిపార్టీల్లోనూ పెద్దసంఖ్యలో ఉన్నారు. కాగా, వంగవీటి రంగా కుమారుడు రాధాకృష్ణ ప్రస్తుతం టీడీపీలోనే ఉన్నారు. తమ పార్టీ నాయకుడి తండ్రి పేరు విషయమై తమ పార్టీకే చెందిన శాసనసభ్యుడు ఉమ ప్రతిపాదించడంపై టీడీపీ అధిష్టానం ఎలా స్పందిస్తుందనేది ఉత్కంఠ రేపుతోంది.