కూలిన ఫ్లైట్ లో 1.25 లక్షల లీటర్ల ఇంధనం!
కోలుకోలేని షాక్ కు గురి చేసిన ఎయిరిండియా 171 (బోయింగ్ 787-8 డ్రీమ్ లైనర్) ఘోర విమాన ప్రమాదంలో 241 మంది ప్రాణాలు కోల్పోవటం తెలిసిందే.;

కోలుకోలేని షాక్ కు గురి చేసిన ఎయిరిండియా 171 (బోయింగ్ 787-8 డ్రీమ్ లైనర్) ఘోర విమాన ప్రమాదంలో 241 మంది ప్రాణాలు కోల్పోవటం తెలిసిందే. ఒకరు మినహా మిగిలిన వారి ప్రాణాలు పోయేలా చేసిన ఈ ప్రమాదానికి సంబంధించిన ఘోర విషాదం గురించి తెలిసిందే. ఈ విమాన ప్రమాదంపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా కీలక ప్రకటన చేశారు. అహ్మదాబాద్ లోని ఆసుపత్రికి వెళ్లిన ఆయన క్షతగాత్రుల్ని పరామర్శించారు. అనంతరం గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్.. కేంద్ర విమానయాన శాఖా మంత్రి రామ్మోహన్ నాయుడితో కలిసి మీడియాలో మాట్లాడారు.
ఎయిరిండియా 171 విమానం కూలిందని.. మొత్తం ప్రయాణికులు.. సిబ్బందిలో ఒకరు క్షేమంగా ఉన్నట్లు చెప్పిన అమిత్ షా.. ‘‘ప్రమాదం నుంచి క్షేమంగా బయటపడిన వ్యక్తిని కలిశాను. మరణించిన వారి వివరాలు తెలుసుకునేందుకు డీఎన్ఏ పరీక్షలు చేస్తున్నాం. ఆ పరీక్షలు ముగిసిన తర్వాతే మరణించిన వారి వివరాలు ప్రకటిస్తాం’’ అని పేర్కొన్నారు.
ఈ ఘోర ప్రమాదం గురించి తెలిసిన వెంటనే గుజరాత్ ప్రభుత్వం వేగంగా స్పందించిందన్న అమిత్ షా.. విమానంలో 1.25 లక్షల లీటర్ల ఇంధనం ఉందని ప్రకటించారు. ఈ కారణంగా విమానం పేలిన వెంటనే మంటలు భారీగా వ్యాపించాయన్న ఆయన.. భారీ మంటల కారణంగా ఎవరినీ కాపాడే పరిస్థితి లేకుండా పోయిందన్నారు. ఇంత భారీగా ఇంధనం ఉండటానికి కారణం ఈ విమానం 6817 కిలోమీటరల ప్రయాణం చేయాల్సి ఉంది. ఇంత భారీగా ఇంధనం ఉండటంతో విపరీతమైన వేడి తీవ్రత కూడా ప్రయాణికులు తప్పించుకునే అవకాశం లేకుండా చేసింది.
ఇదిలా ఉండగా.. ఈ విమానానికి ఫ్లైట్ కమాండ్ ఆఫ్ కెప్టెన్ గా వ్యవహరించిన వారే కాదు.. సహ పైలట్ కూడా అనుభవం ఉన్న వారే. సుమిత్ సభర్వాల్ ఫ్లైట్ కమాండ్ ఆఫ్ కెప్టెన్ గా వ్యవహరించారు. ఆయనకు 8200 గంటల ఫ్లైయింగ్ అనుభవం ఉంది. ఇక సహ పైలెట్ గా వ్యవహరించిన కుందర్ కు 1100 గంటల ఫ్లైయింగ్ అనుభవం ఉన్నవారు. మరోవైపు ప్రమాదానికి గురైన విమానం విషయానికి వస్తే పదకొండేళ్లకు పైనే ఈ లోహ విహంగం సేవలు అందిస్తోంది.