రసగుల్లా తెచ్చిన తంటా.. ఏకంగా పెళ్లి రద్దు.. అసలేం జరిగిందంటే?

ఈ మధ్యకాలంలో జరిగే కొన్ని పెళ్లిళ్లలో వింత వింత వాదనలు, గొడవలు చోటు చేసుకుంటున్నాయి.;

Update: 2025-12-04 09:47 GMT

ఈ మధ్యకాలంలో జరిగే కొన్ని పెళ్లిళ్లలో వింత వింత వాదనలు, గొడవలు చోటు చేసుకుంటున్నాయి. కొన్ని విషయాలు చూస్తే చాలా ఫన్నీగా అనిపిస్తున్నాయి. ముఖ్యంగా చిన్నచిన్న గొడవలకే పెళ్లిళ్లు ఆపుకునే వరకు వెళ్తున్న సంఘటనలు చూస్తే ఫన్నీగా అనిపిస్తున్నాయి. అయితే తాజాగా బోధ్ గయాలో జరిగిన ఒక వివాహం రసగుల్లాల వల్ల ఆగిపోయింది. పెళ్లిలో పెట్టే రసగుల్లాల వల్ల వరుడు తరఫు , వధువు తరఫు కుటుంబాల మధ్య పెద్ద ఘర్షణకు దారితీసి హింసాత్మక మలుపు తిరిగింది. అయితే ఈ రసగుల్లా వివాదం నవంబర్ 29న బోధ్ గయాలోని ఒక ప్రైవేటు హోటల్లో జరగగా.. ఆలస్యంగా సీసీ టీవీ ఫుటేజ్ ద్వారా బయటపడింది. అంతేకాదు ఈ గొడవ జరిగాక వివాహం కూడా రద్దు చేయబడింది.

అంతటితో ఆగకుండా వధువు తరఫు కుటుంబ సభ్యులు, వరుడు కుటుంబం పై వరకట్న కేసు నమోదు చేసి పెద్ద షాక్ ఇచ్చారు.. సీసీ టీవీ ఫుటేజ్ లో వైరల్ అవుతున్న వీడియో ప్రకారం చూసుకుంటే.. రెండువైపుల నుండి వచ్చిన అతిథులు దండలు మార్చుకున్న తర్వాత భోజనం చేస్తున్నారు. భోజనం చేసే సమయంలో స్వీట్లు ముఖ్యంగా రసగుల్లాలు విసరడంతో వాదన మొదలైంది అని వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. కొన్ని నిమిషాల్లోనే వారి మధ్య జరుగుతున్న గొడవ కొట్టుకునే వరకు వెళ్ళింది. రెండు వైపులా కుర్చీలు,ప్లేట్లు, గ్లాసులను ఒకరిపై ఒకరు విసిరేసుకున్నారు. ఈ వైరల్ క్లిప్పులో ప్రజలు ఒకరిపై ఒకరు దాడి చేసుకోవడం, దొరికిన ప్రతి ఒక్కదాన్ని ఆయుధాలుగా మలుచుకొని వాటితో కొట్టడం ఈ వీడియోలో గమనించవచ్చు. ఈ ఘర్షణలో రెండు కుటుంబాల నుండి చాలామంది వ్యక్తులు గాయపడినట్లు తెలుస్తోంది. ఈ గందరగోళం జరుగుతున్న సమయంలో హోటల్ బాంకెట్ హాల్ కుస్తీ వేదికగా మారిందని అక్కడ గొడవ మొత్తం ప్రత్యక్షంగా చూసిన ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.

అయితే ఈ గొడవ గురించి వరుడి తండ్రి మహేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ.. వరమాల వేడుక పూర్తయిందని కేవలం ఫెరాస్ మాత్రమే మిగిలి ఉన్నాయని అన్నారు.అయితే వివాదం చాలా వేగంగా స్ప్రెడ్ అయి తీవ్రమైన ఘర్షణకు దారి తీసి వధువు తరఫు వారు పెళ్లిని రద్దుకు చేసుకునే వరకు వెళ్లింది. అంతేకాదు రసగుల్లాలు తక్కువగా ఉండడం వల్లే ఈ వివాదం ప్రారంభమైందని వరుడి తండ్రి పేర్కొన్నారు. అయితే ఈ గొడవ జరిగాక వధువు తరుపున కుటుంబం 2 లక్షల కట్నం మేము డిమాండ్ చేసామని పోలీసులకు ఫిర్యాదు చేశారు.కేసు దాఖలు చేసిన తర్వాత కూడా మేము పెళ్లిని కొనసాగించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పాం కానీ వధువు తరఫున కుటుంబం నిరాకరించిందని వరుడి తండ్రి తెలిపారు.

విందులో జరిగిన వివాదం కేవలం ఒక కారణమని,అసలు సమస్య వరకట్న సంబంధిత ఒత్తిడి అని వాళ్ళు ఆరోపించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ టీవీ ఫుటేజ్ తీసుకొని రెండు వైపుల నుండి స్టేట్మెంట్లను నమోదు చేశారు. ఈ గొడవ నిజంగా రసగుల్లాల కారణంగా ప్రారంభమైందా.. లేదా విందుకు ముందే ఏవైనా లోలోపల ఉద్రిక్తతలు ఉన్నాయా అనేది దర్యాప్తులో తెలియబోతుందని బోద్ గయా స్టేషన్ ఆఫీసర్ తెలిపారు.

Tags:    

Similar News