మరో బ్లూ డ్రమ్ లో వ్యక్తి మృతదేహం.. మెడ, కాళ్లు తాళ్లతో కట్టి..!

రెండు నెలల క్రితం మీరట్ లో మాజీ మర్చంట్ నేవీ అధికారిని అతని భార్య, ఆమె ప్రియుడు కలిసి అత్యంత కిరాతకంగా హత్య చేసిన ఘటన తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే.;

Update: 2025-06-27 08:40 GMT

రెండు నెలల క్రితం మీరట్ లో మాజీ మర్చంట్ నేవీ అధికారిని అతని భార్య, ఆమె ప్రియుడు కలిసి అత్యంత కిరాతకంగా హత్య చేసిన ఘటన తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో.. భర్తను ముక్కలుగా చేసి బ్లూ డ్రమ్ లో దాచారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనంగా మారింది. ఈ సమయంలో మరో బ్లూ డ్రమ్ లో మృతదేహం లభ్యమవ్వడం సంచలనంగా మారింది.

అవును... మీరట్ లో మాజీ మర్చంట్ నేవీ అధికారిని అతని భార్య, ఆమె ప్రియుడు కలిసి అత్యంత కిరాతకంగా హత్య చేసి, శరీరాన్ని ముక్కలు చేసి నీలం రంగు డబ్బాలో పెట్టి, పైన సిమెంట్ వేసిన ఘటన తీవ్ర సంచలనంగా మారిన సంగతి తెలిసిందే! ఈ క్రమంలో తాజాగా పంజాబ్ లో ఇలా బ్లూడ్రమ్ లో మృతదేహం లభ్యమైన ఘటన తెరపైకి వచ్చింది.

వివరాళ్లోకి వెళ్తే... పంజాబ్‌ లోని లూథియానాలో నీలిరంగు డ్రమ్ లోపల ఓ వ్యక్తి మృతదేహం కనిపించిన వ్యవహారం కలకలం రేపుతోంది. ప్లాస్టిక్ సంచిలో చుట్టి ఉన్న ఒక వ్యక్తి మృతదేహం.. ఆ బ్లూ డ్రమ్ లో కుళ్ళిపోయిన స్థితిలో కనిపించింది. ఆ సమయంలో.. అతని మెడ, కాళ్లను కలిపి తాడుతో కట్టి ఉంచారని చెబుతున్నారు.

తాజా, పాత ఘటనల నేపథ్యంలో ఈ వ్యవహారం పలు అనుమానాలు తెరపైకి వస్తున్నాయి. ఆ డ్రమ్ము ఉన్న పరిసరాల్లో దుర్వాసన వ్యాపించడంతో ఈ కేసు వెలుగులోకి వచ్చింది. ఆ పరిసరాల్లోని స్థానికి ఈ వ్యవహారంపై పోలీసులకు సమాచారం అందించారు. దీంతో.. రంగంలోకి దిగిన పోలీసులు డ్రమ్ ఓపెన్ చేసి చూడగా.. ఈ ఘోరం వెలుగు చూసింది. .

ఈ సందర్భంగా స్పందించిన స్టేషన్ హౌస్ ఆఫీసర్ (ఎస్.హెచ్.ఓ) కుల్వంత్ కౌర్... ఆ వ్యక్తి వలసదారుడిగా కనిపించాడని అన్నారు. ప్రస్తుతానికి మృతుడి శరీరంపై ఎటువంటి గాయాల గుర్తులు లేవని.. అయితే మృతదేహం పరిస్థితి కుళ్లిన స్థితిలో ఉందని.. పోస్ట్‌ మార్టం తర్వాత మరణానికి గల ఖచ్చితమైన కారణాలు తెలిసే అవకాశం ఉందని తెలిపారు.

మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సివిల్ హాస్పిటల్‌ లోని మార్చురీకి తరలించారు. మరోవైపు.. మృతదేహం దొరికిన డ్రమ్ కొత్తగా ఉందని చెబుతున్నారు. దీంతో... హత్యకు ముందు డ్రమ్‌ ను కొత్తగా కొనుగోలు చేసి ఉంటారనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇది పక్కా ప్లాండ్ మర్డర్ అయ్యి ఉండోచ్చని అంటున్నారు.

ఇదే సమయంలో... మృతదేహం లభ్యమైన ప్రదేశానికి 5 కిలోమీటర్ల పరిధిలోని అన్ని ప్రాంతాల సిసిటివి ఫుటేజ్‌ లను పోలీసులు స్కాన్ చేయడం ప్రారంభించారని తెలుస్తోంది. సిటీలోని ప్రైవేట్ కెమెరాలతో పాటు, రైల్వే స్టేషన్లు, బస్ స్టాండ్ల నుండి ఫుటేజ్‌ లను సమీక్షిస్తున్నారు. అనేక అనుమానాస్పద వాహన రిజిస్ట్రేషన్ నంబర్‌ లను తనిఖీ చేస్తున్నారని సమాచారం.

Tags:    

Similar News