బీజేపీలో ఆ నటి పాయే.. ఈ నటి వచ్చే!

ఈ నేపథ్యంలో విజయశాంతి స్థానాన్ని మరో సీనియర్ నటి జయసుధతో పార్టీ భర్తీ చేసిందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

Update: 2023-09-25 10:57 GMT

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందేలా చేయడంతో తెలంగాణలో ఆ పార్టీ మహిళల ర్యాలీ నిర్వహించింది. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి, రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. ఈ ర్యాలీలో ప్రముఖ నటి జయసుధ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఇటీవలే జయసుధ బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. కానీ మహిళ బిల్లు ఆమోదం పొందిందని నిర్వహించిన మహిళా ర్యాలీలో బీజేపీ మహిళా నేత విజయశాంతి కనిపించకపోవడం చర్చనీయాంశంగా మారింది.

పార్టీలో తగిన ప్రాధాన్యత దక్కడం లేదని అసంత్రుప్తి వ్యక్తం చేస్తున్న విజయశాంతి బీజేపీని వదిలేసే అవకాశాలున్నట్లు ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో విజయశాంతి స్థానాన్ని మరో సీనియర్ నటి జయసుధతో పార్టీ భర్తీ చేసిందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

తెలంగాణలో బీజేపీ పరిస్థితి గందరగోళంగానే కొనసాగుతోందని చెప్పొచ్చు. ఎన్నికల రేసులో వెనుకబడ్డ ఆ పార్టీ.. పుంజుకోవడానికి ప్రయత్నిస్తోంది. కానీ పార్టీలో నాయకుల మధ్య విభేధాలు, నేతల మధ్య సయోధ్య లేకపోవడం.. పార్టీ మారేందుకు బీజేపీ నాయకులు సిద్ధం కావడం వంటికి తలనొప్పిగా మారాయి.

Read more!

తెలంగాణను వ్యతిరేకించిన మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని బీజేపీలో చేర్చుకోవడాన్ని మొదటి నుంచి విజయశాంతి వ్యతిరేకిస్తున్నారు. కిరణ్ కుమార్ తో వేదిక పంచుకునేందుకూ ఆమె ఇష్టపడలేదు. అంతే కాకుండా మణిపూర్ సమస్యపై కేంద్రంలోని బీజేపీని ఇరకాటంలో పెట్టేలా రాములమ్మ ట్వీట్ చేశారు.

మరోవైపు కాంగ్రెస్ కు మద్దతుగానూ ట్వీట్లు పెట్టారు. సోనియా గాంధీ అంటే గౌరవముందని, రాహుల్ వ్యాఖ్యలను సమర్థిస్తూ విజయశాంతి ట్వీట్లు చేస్తున్నారు. దీంతో ఆమె మరోసారి కాంగ్రెస్ గూటికే చేరబోతున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో సినీ గ్లామర్ ను మరో సినీ నటితోనే భర్తీ చేయాలనే ఉద్దేశంతో జయసుధకు ప్రాధాన్యతనిస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Tags:    

Similar News