టార్గెట్ 12 : తెలంగాణపై బీజేపీ ఫోకస్

ఈ నెల 30, మే 3,4 తేదీలలో ప్రధాని మోదీ జహీరాబాద్, మెదక్, నల్గొండ, భువనగిరి, మహబూబ్ నగర్, చేవెళ్ల ఎంపీ అభ్యర్థులకు మద్దతుగా మద్దతుగా బహిరంగ సభలలో ప్రచారం చేయనున్నారు.

Update: 2024-04-27 15:30 GMT

ఆంధ్రప్రదేశ్ లో ఇటు టీడీపీతో పొత్తుతో అటు వైసీపీతో తెరవెనక స్నేహంతో సేఫ్ గేమ్ ఆడుతున్న భారతీయ జనతా పార్టీ తెలంగాణలో 17 లోక్ సభ స్థానాలలో కనీసం 12 స్థానాలు గెలుచుకోవాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నది. తెలంగాణలో ఒంటరిగా పోటీ చేస్తున్న బీజేపీ శాసనసభ ఎన్నికలలో 14 శాతం ఓటింగ్ సాధించింది.పార్లమెంటు ఎన్నికలలో దీనిని మరింత పెంచుకుని అనుకున్న లక్ష్యం సాధించాలని వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నది.

హైదరాబాద్ పరిధిలోని చేవెళ్ల, మల్కాజ్ గిరి, సికింద్రాబాద్ లతో పాటు మహబూబ్ నగర్, మెదక్, భువనగిరి, జహీరాబాద్, నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ స్థానాలలో కాషాయ జెండా ఎగరేస్తామని కమలం నేతలు చెబుతున్నారు. అందుకే బీజేపీ అగ్రనేతలతో వీలైనంత ఎక్కువ ప్రచారం చేయించాలన్న లక్ష్యం పెట్టుకున్నారు.

ఈ నెల 30, మే 3,4 తేదీలలో ప్రధాని మోదీ జహీరాబాద్, మెదక్, నల్గొండ, భువనగిరి, మహబూబ్ నగర్, చేవెళ్ల ఎంపీ అభ్యర్థులకు మద్దతుగా మద్దతుగా బహిరంగ సభలలో ప్రచారం చేయనున్నారు. దీంతో పాటు హైదరాబాద్ లో ఐటీ ఉద్యోగులు, మేధావులతో సమావేశం కానున్నారు. ఇక హోంమంత్రి అమిత్ షా ఇప్పటికే మెదక్ పార్లమెంటు పరిధిలో పర్యటించి సిద్దిపేట బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈనెల 29న బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఉదయం కొత్తగూడెం, మధ్యాహ్నం మహబూబాబాద్ బహిరంగ సభలలో పాల్గొంటారు. అదేరోజు సాయంత్రం ఉప్పల్‌ రోడ్‌షోలో పాల్గొంటారు.

ఇటీవల శాసనసభ ఎన్నికలలో తెలంగాణలో ఎనిమిది స్థానాలలో విజయం సాధించిన బీజేపీ పార్లమెంటులో 12 స్థానాలు గెలుచుకోవాలని ఆశించడం భారీ లక్ష్యమే అని చెప్పాలి. గత ఎన్నికలలో నాలుగ స్థానాలలో విజయం సాధించిన బీజేపీ దానికి రెండు రెట్లు అధికంగా గెలవాలని ప్రయత్నిస్తుండడం విశేషం. మరి ఓటరు తీర్పు ఎలా ఉంటుందో వేచిచూడాలి.

Tags:    

Similar News