ఇంటి పేరు ‘మల్కా’.. దక్కనుంది మల్కాజ్ గిరి బీజేపీ టికెట్?
మినీ ఇండియాగా పేరొంది.. దేశంలోనే అత్యంత పెద్ద నియోజకవర్గంగా నిలిచి.. అత్యంత కీలకమైన స్థానంగా పేరుతెచ్చుకున్న మల్కాజ్ గిరిలో ఈసారి ఎంపీ టికెట్ ఎవరికి అనేది అన్ని పార్టీల్లోనూ చర్చనీయాంశంగా మారింది.;
మినీ ఇండియాగా పేరొంది.. దేశంలోనే అత్యంత పెద్ద నియోజకవర్గంగా నిలిచి.. అత్యంత కీలకమైన స్థానంగా పేరుతెచ్చుకున్న మల్కాజ్ గిరిలో ఈసారి ఎంపీ టికెట్ ఎవరికి అనేది అన్ని పార్టీల్లోనూ చర్చనీయాంశంగా మారింది. 2014లో టీడీపీకి చిక్కిన ఈ సీటులో.. 2019లో తెలంగాణ ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి గెలిచారు. 2009లో ఏర్పాటు సమయంలోనే జనరల్ నియోజకవర్గంగా ఉన్న ఈ సీటులో దళిత వర్గానికి చెందిన సర్వే సత్యనారాయణను పోటీకి దింపి కాంగ్రెస్ పార్టీ సాహసం చేసింది. ఆయన గెలవడమే కాదు కేంద్ర మంత్రి కూడా అయ్యారు. 2014లో మల్కాజ్ గిరి నుంచి గెలిచిన విద్యా సంస్థల అధినేత మల్లారెడ్డి అనంతరం బీఆర్ఎస్ లో చేరారు. తదుపరి ఎన్నికల్లో ఎమ్మెల్యేగా నెగ్గి రాష్ట్ర మంత్రి అయ్యారు. ఇక గత ఎన్నికల్లో విజయం సాధించిన రేవంత్ రెడ్డి రెండు నెలల కిందట ఏకంగా తెలంగాణ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. ఇన్ని విశిష్టతలున్న నియోజకవర్గం కాబట్టే మల్కాజ్ గిరికి అంత ప్రాధాన్యం.
అన్ని పార్టీల్లోనూ పోటాపోటీ
మల్కాజ్ గిరి ఎంపీ సీటుకు అన్ని పార్టీల్లోనూ పోటీ నెలకొంది. కాంగ్రెస్ నుంచి రేవంత్ రెడ్డి ఖాళీ చేసిన సిటింగ్ సీటు కావడం, రాష్ట్రంలో అధికారంలో ఉండడంతో ఆ పార్టీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడం ఖాయం. మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు సహా పలువురి పేర్లను పరిశీలిస్తోంది. బీఆర్ఎస్ కూడా కేటీఆర్ ను ఇక్కడ దింపాలని చూస్తోందనే కథనాలు వచ్చాయి. ఇక మిగిలింది బీజేపీ. వాస్తవానికి మల్కాజ్ గిరిలో ఇతర రాష్ట్రాల వారు ముఖ్యంగా ఉత్తరాది వారు అధికం. ఈ లెక్కన మోదీ నాయకత్వానికి వారు ప్రభావితం అయితే బీజేపీకి ఎక్కువ అవకాశాలు ఉండాలి. కానీ, గత రెండుసార్లు అలా జరగలేదు. ఈసారి మాత్రం మల్కాజ్ గిరిని వదిలేది లేదన్న పట్టుదలతో ఉన్నారు కమలనాథులు. ఇక్కడినుంచి ఏకంగా ప్రధాని మోదీ పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. అయితే, అది నిజం కాలేదు. ఈ నేపథ్యంలోనే బలమైన అభ్యర్థులను వెదుకుతున్నారు. ఈటల రాజేందర్ నుంచి మురళీధర్ రావు, కూన శ్రీశైలంగౌడ్, పన్నాల హరీశ్ రెడ్డి, సామ రంగారెడ్డి వంటి వారు టికెట్ కోసం పోటీ పడుతున్నారు. వీరందరి మధ్యన మల్కాజ్ గిరి టికెట్ రేసులో ఢిల్లీ పబ్లిక్ స్కూల్ విద్యా సంస్థల చైర్మన్ మల్కా కొమురయ్య పేరు గట్టిగా వినిపిస్తోంది.
ఎవరీయన..?
మల్కా కొమురయ్యది కరీంనగర్ జిల్లా. ఈయనది విద్యావంతుల కుటుంబం. హైదరాబాద్ లో స్థిరపడ్డారు. వీరి సమీప బంధువు ఒకరు జడ్జిగా పనిచేస్తున్నారు. ఢిల్లీ పబ్లిక్ స్కూల్ విద్యా సంస్థల చైర్మన్ కొమురయ్యకు మల్కాజ్ గిరి ప్రాంతంలో మంచి పేరు, పలుకుబడి ఉంది. దీంతోపాటు ఆర్ఎస్ఎస్ తో దశాబ్దాలుగా అనుబంధం ఉంది. ఈ నేపథ్యమే ఆయన అభ్యర్థిత్వాన్ని సీరియస్ గా పరిశీలించేందుకు కారణమైందనే వాదన వినిపిస్తోంది. మరి లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ కు మరెంతో సమయం లేదు. ఈలోగా ఏం జరుగుతుందో చూద్దాం.?