ఇండీకి అఖిలేష్ హైలెట్...బీజేపీ నెక్స్ట్ టార్గెట్ !

ఇక కలకత్తా కాళిగా వీర విహారం చేసే మమతా బెనర్జీ మాజీ సీఎంగా బేలగా డీలాపడిన నేతగా ఇండియా కూటమి మీటింగ్ కి హాజరయ్యారు.

Update: 2026-06-09 04:16 GMT

ఇండియా కూటమిలోని బిగ్ షాట్స్ అందరికీ వరసగా బీజేపీ ఓడించుకుంటూ వస్తోంది. మొదట్లో అంటే 2022లో ఇండియా కూటమి ఏర్పాటు అయిన సమయంలో కనిపించిన పెద్ద పార్టీలు పెద్ద తలకాయలు అన్నీ ఇపుడు ఓడి వాడిపోయాయి. కొందరు ఇండియా కూటమికి దూరంగా ఉంటూ వస్తున్నారు. ఈ నేపధ్యంలో చూస్తే తాజాగా ఢిల్లీలో జరిగిన ఇండియా కూటమి సమావేశానికి ఆప్ పార్టీ దూరంగా ఉంది. ఒకనాడు ఢిల్లీ ముఖ్యమంత్రిగా క్రేజ్ ఎంతో ఉన్న అరవింద్ కేజ్రీవాల్ కాబోయే ప్రధాని అన్నంతగా హైప్ క్రియేట్ అయింది. అయితే ఆయన్ని గడిచిన ఎన్నికల్లో ఓడించి ఢిల్లీ పీఠాన్ని బీజేపీ కైవశం చేసుకుంది. ఇక ఆప్ చేతిలో ఉన్న పంజాబ్ రాష్ట్రాన్ని కూడా గెలిచేందుకు స్కెచ్ గీస్తోంది. ఆ పార్టీ ఎంపీ రాఘవ చద్దా తో పాటు ఎనిమిది మంది రాజ్యసభ ఎంపీలను చేర్చుకుని రీసెంట్ గానే క్రేజీవాల్ కి గట్టి షాక్ ని బీజేపీ ఇచ్చింది.

డీఎంకే దూరంగానే :

ఇక ఇండియా కూటమి సమావేశం అనగానే కనిపించి హడావుడి చేసే దక్షిణాదిన అతి పెద్ద ప్రాంతీయ పార్టీ అయిన డీఎంకే తాజా మీట్ కి దూరంగా ఉంటూ షాక్ తినిపించింది. దానికి కారణం టీవీకే ప్రభుత్వానికి కాంగ్రెస్ మద్దతు ఇవ్వడమే. సమీప భవిష్యత్తులో డీఎంకే ఇండియా కూటమిలో చేరుతుంది అని ఎవరూ అనుకోవడం లేదు. అదే సమయంలో టీవీకేతో బంధం గట్టి పరచుకోవడం మీద కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది. తమిళనాడులో డీఎంకే ఓటమి వెనక బీజేపీ ప్రయత్నాలు పెద్దగా లేకపోయినప్పటికీ ఆ ఓటమి మాత్రం బీజేపీకి రాజకీయంగా జాతీయ స్థాయిలో ఇలా కలిసి వచ్చిందని అంటున్నారు. ఇండియా కూటమి నుంచి డీఎంకే వేరు పడడం కమలం పార్టీకి మహదానందం కలిగించే విషయంగానే అంతా చూస్తున్నారు.

మమత బేజారు :

ఇక కలకత్తా కాళిగా వీర విహారం చేసే మమతా బెనర్జీ మాజీ సీఎంగా బేలగా డీలాపడిన నేతగా ఇండియా కూటమి మీటింగ్ కి హాజరయ్యారు. బీజేపీ మీద ఒంటి కాలు మీద లేచి విరుచుకుపడే మమతకు ఏ మాత్రం సౌండ్ లేకుండా పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాషాయం పార్టీ చేయగలిగింది. దాంతో ఇండియా కూటమిలో మమత బిగ్ షాట్ అన్న హోదా నుంచి పక్కకు తప్పుకుని ఒక సాధారణ పార్టీగానే హాజరు కావాల్సి వచ్చింది. వీటి కంటే ముందే బీహార్ లో తెగ హడావిడి చేసిన లాలూ ప్రసాద్ పార్టీ రాష్ట్రీయ జనతాదళ్ ని సైతం బీజేపీ ఓడించి మాట లేకుండా చేసింది. దాంతో ఆర్జేడీ కూడా సైలెంట్ అయింది. మహారాష్ట్రలో శివసేన ఉద్ధవ్ ఠాక్రే అలాగే మరాఠా యోధుడు శరద్ పవార్ ఎన్సీపీ కూడా బీజేపీ చేతిలో ఖంగు తిన్నవే కావడంతో మునుపటి ధాటీ దర్పం ఆ పార్టీలకు లేకుండా పోయాయి.

అఖిలేష్ బిగ్ సౌండ్ :

ఇక లేటెస్ట్ ఇండియా కూటమిలో ఒక వెలుగు వెలిగిన వారు యూపీకి చెందిన సమాజ్ వాదీ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్. ఆయన రాహుల్ గాంధీ పక్కన కూర్చుని మరీ కూటమి మీటింగ్ ని జోరుగా నడిపించారు. రేపటి రోజున కూటమికి ఏమైనా కళా కాంతి వస్తే తాను ముందు వరసలో ఉండేందుకు ఆయన చూస్తున్నారు. పోటీ దారులు అంతా తగ్గిపోవడం బ్యాక్ బెంచ్ కి వెళ్ళిపోవడం అఖిలేష్ ని స్పెషల్ గా ఫోకస్ అయ్యేలా చేస్తోంది. అదే సమయంలో బీజేపీ కూడా ఇండియా కూటమిలో చివరాఖరున ఉన్న బిగ్ షాట్ అఖిలేష్ యాదవ్ కి యూపీలో ముచ్చటగా మూడవసారి ఓటమి రుచి చూపించడానికి రంగం సిద్ధం చేస్తోంది. 2017, 2022లలో ఓటమి పాలు అయిన ఎస్పీని 2027లో కూడా ఓడిస్తే అక్కడ రాజకీయ శత్రు శేషం లేకుండా ఉంటుందని ఇండియా కూటమి పూర్తిగా వెలవెలబోతుంది అన్న లెక్కలతో బీజేపీ ముందుకు సాగుతోంది. చూడాలి మరి అఖిలేష్ అందరిలా బీజేపీ చేతిలో ఓడి సైలెంట్ అవుతారా లేక యూపీలో గెలిచి ఇండీ కూటమికే పెద్ద దిక్కుగా మారుతారా అన్నది.

Tags:    

Similar News