సామ్రాట్ చౌదరి సీఎం వెనక బీజేపీ పక్కా వ్యూహం?

బీహార్ కొత్త ముఖ్యమంత్రిగా సామ్రాట్ చౌదరి ఈ నెల 15న ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. ఇది ఆయనకు మాత్రమే కాదు బీజేపీకి ఎంతో ఆనందం కలిగించే విషయం.;

Update: 2026-04-14 22:30 GMT

బీహార్ కొత్త ముఖ్యమంత్రిగా సామ్రాట్ చౌదరి ఈ నెల 15న ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. ఇది ఆయనకు మాత్రమే కాదు బీజేపీకి ఎంతో ఆనందం కలిగించే విషయం. ఎందుకంటే బీజేపీకి కూడా ఇదే తొలిసారి పూర్తి స్థాయి ప్రభుత్వం. ఇప్పటిదాకా అధికారం పంచుకుంటూ వచ్చిన బీజేపీ తొలిసారిగా సారధ్య బాధ్యతలను స్వీకరిస్తోంది. దాంతో బీజేపీ ఎవరికి సీఎం గా ఎంపిక చేస్తుంది అన్నది పెద్ద ఎత్తున చర్చ సాగింది. ఎందుకంటే బీహార్ లో కులాల సమాహారం రాజకీయంగా కీలక పాత్ర పోషిస్తుంది.

లాలూ ఆర్జేడీతో గట్టి పోరు :

ఇప్పటిదాకా ఒక ఎత్తు ఇక ముందు మరో ఎత్తు అన్నట్లుగా బీహార్ రాజకీయం ఉంది. మాజీ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కుర్మీ సామాజిక వర్గానికి చెందినవారు. బీహార్‌లో కుర్మీలను ఇతర వెనుకబడిన తరగతి ఓబీసీగా వర్గీకరించారు. రాష్ట్రంలో ఆయన రాజకీయ పునాదికి ఆయన కులం చాలా ముఖ్యమైనది. దాంతో ఆయన అండతో బీజేపీ ఆర్జేడీని ఎదుర్కొంటూ వచ్చింది. యాదవ రాజకీయ సామాజిక సమీకరణలకు ధీటైన ఈక్వేషన్స్ నితీష్ కుమార్ రూపొందించారు. ఇక ఇపుడు నితీష్ కుమార్ తప్పుకుంటున్నారు కాబట్టి బీజేపీ సరికొత్త సామాజిక సమీకరణలతో ముందుకు రావాల్సిన అవసరం ఉంది. దాంతో బీజేపీకి కొత్త సీఎం ఎంపిక ఒక విధంగా కత్తి మీద సాము అయింది అనిటున్నారు.

సామ్రాట్ చౌదరి ఎందుకంటే :

ఈ క్రమంలో బీజేపీ బీహార్ రాజకీయ వ్యూహాలను తనదైన శైలిలో రచించింది. యాదవ సామాజిక వర్గం మద్దతు ఎక్కువగా ఉన్న ఆర్జేడీని ఎదుర్కోవాలంటే తగిన విధంగా వ్యవహరించాలని భావించే సామ్రాట్ చౌదరిని ఎన్నుకుంది. ఆయన బీహార్ లోని కుశ్వాహా సామాజిక వర్గానికి చెందిన వారు. ఈ సామాజిక వర్గం రాష్ట్రంలో 4.3 సాతం గా ఉంది. ఒక విధంగా చెప్పాలీ అంటే యాదవుల తరువాత అతి పెద్ద ఓబీసీ వర్గంగా ఉంది. దాంతో ఆర్జేడీని నిలువరించడానికి సామ్రాట్ చౌదరి ని ముందు పెట్టినట్లుగా అర్ధం అవుతోంది. బీహార్‌లో యాదవేతర ఓబీసీల మద్దతును పటిష్టం చేసుకునేందుకు బీజేపీ చేపట్టిన వ్యూహాత్మక చర్యగా దీనిని భావిస్తున్నారు. గతంలో ఆర్జేడీ జేడీయూలలో ఉన్న ఆయన తరువాత కాలంలో బీజేపీలో చేరి ఆ పార్టీకి బీహార్ రాష్ట్ర అధ్యక్షుడిగా శాసన మండలిలో ప్రతిపక్ష నాయకుడిగా, ఉప ముఖ్యమంత్రిగా కీలక బాధ్యతలను నిర్వహించారు.

నితీష్ తరువాత తరం :

బీహార్ తొలిసారి కొత్త తరం చీఫ్ మినిస్టర్ ని చూస్తోంది. ఇప్పటిదాకా బీహార్ ని పాలించిన వారిలో లాలూ రబ్రీ దేవి నితీష్ కుమార్ వీరంతా వెనకటి తరానికి చెందిన వారు. ఈ క్రమంలో సామ్రాట్ చౌదరి వారి తరువాత తరానికి చెందిన ప్రతినిధిగా రాష్టాధినేత అవుతున్నారు. ఆయన 1968 నవంబర్ 16న పుట్టారు. ఆయన వయసు 57 ఏళ్ళు. దాంతో ఆయన నాయకత్వంలో బీజేపీ అన్ని వర్గాల మద్దతుని ఆకట్టుకుంటుంది అని ఆ పార్టీ నేతలు నమ్ముతున్నారు. అదే విధంగా సామ్రాట్ చౌదరికి కావాల్సినంత రాజకీయ పాలనానుభవం ఉండడం, చాలా కాలం ఉప ముఖ్యమంత్రిగా పనిచేయడం అటు బీజేపీకి ఇటు నితీష్ కుమార్ కి కూడా ఆయన సన్నిహితుడు కావడంతో బీజేపీ తరఫున తొలి సీఎం గా ఆయన అయ్యారు.

Tags:    

Similar News