2026 కేంద్ర బిందువు.... జమిలికి సన్నాహాలు ?
దేశంలో అనూహ్యమైన రాజకీయ మార్పులకు 2026 కేంద్ర బిందువు అవుతుందని అంటున్నారు. ఈ ఏడాదిలోనే ఏకంగా నాలుగు రాష్ట్రాలలో శాసనసభలకు ఎన్నికలు ఉన్నాయి.;
దేశంలో అనూహ్యమైన రాజకీయ మార్పులకు 2026 కేంద్ర బిందువు అవుతుందని అంటున్నారు. ఈ ఏడాదిలోనే ఏకంగా నాలుగు రాష్ట్రాలలో శాసనసభలకు ఎన్నికలు ఉన్నాయి. అవి పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అసోం. ఇందులో అసోం లో మాత్రమే బీజేపీ అధికారంలో ఉంది. బెంగాల్ లో తృణమూల్ కాంగ్రెస్ పవర్ లో ఉంటే తమిళనాడులో డీఎంకే ఉంది. కేరళలో వామపక్షాల నాయకత్వంలో ఎల్డీఎఫ్ అధికారంలో ఉంది. ఇక ఈ నాలుగింటిలో అసోం లో మరోసారి గెలవాలని బీజేపీ చూస్తోంది. ఆ రాష్ట్రం మీద ఫోకస్ ఎటూ ఉంటుంది. దాని తర్వాత బీజేపీ కోరుకునే గెలుపు బెంగాల్ లోనే ఉంది. ఆ రాష్ట్రం గెలిచి మమతను మాజీ ముఖ్యమంత్రిగా చేస్తే ఆ గెలుపు మజా వేరే లెవెల్ అని కూడా తలపోస్తోంది.
వాటి విషయంలో :
ఇక తమిళనాడులో గతసారి గెలిచిన నాలుగు అసెంబ్లీ సీట్ల కంటే ఎక్కువగా గెలుచుకోవాలని చూస్తోంది. కేరళ అసెంబ్లీలో పాగా వేయాలని కూడా ఉంది. ఇలా చూసుకుంటే బీజేపీ హాట్ ఫేవరేట్ స్టేట్ బెంగాల్ అని అర్ధమవుతుంది. ఈసారి గెలుపు అక్కడ ఖాయమని బీజేపీ ధీమాగా ఉంది. సర్ అస్త్రం బాగా పనిచేస్తోంది దాంతో అక్రమ ఓట్లు పోతాయని అసలైన ఓట్ల సమరం జరిగితే తమదే భారీ విజయమని నమ్ముతోంది. మూడు సార్లు గెలిచిన మమత మీద జనాలకు మొహం మొత్తిందని కూడా కమలనాధులు విశ్లేషించు కుంటున్నారు.
జమిలికి ఊపిరి :
ఇక బెంగాల్ లో కనుక బీజేపీ గెలిస్తే ఒక్కసారిగా జాతీయ రాజకీయాల్లో ప్రకంపనలు వస్తాయని అంటున్నారు. దేశంలో దాదాపుగా పెద్ద రాష్ట్రాలు అన్నీ బీజేపీ చేతిలోకి వచ్చేసినట్లు అవుతుంది. అలాగే రాజ్యసభలోనూ ఆ పార్టీ బలం పెరుగుతుంది. దాంతో తాము కలకు కంటున్న జమిలి ఎన్నికలను ఈసారి పక్కాగా జరిపించాలని చూస్తుంది అని అంటున్నారు. ఇప్పటికే మాజీ రాష్ట్రపతి రాం నాధ్ కోవింద్ నాయకత్వంలోని కమిటీ జమిలి ఎన్నికల మీద ఇచ్చిన నివేదిక కేంద్రం వద్ద ఉంది. దానిని సభలో ప్రవేశపెట్టి ఆమోదం తీసుకుంటుందని అంటున్నారు. అలాగే సగానికి కంటే ఎక్కువ రాష్ట్రాలు ఎన్డీయే చేతుల్లో ఉన్నాయి కాబట్టి జమిలి బిల్లు వారి ఆమోదముద్రతో కూడా నెగ్గుకుని రావచ్చు అన్నది కూడా ఉందని అంటున్నారు.
ఇదే ముహూర్తం :
అంతే కాదు 2026 రెండవ అర్ధభాగం నుంచి జనాభా గణన మొదలెట్టి 2027 మొదటికి పూర్తి చేసి ఆ మీదట కొత్తగా పార్లమెంట్ నియోజకవర్గాలను పునర్ విభజన చేస్తారని చెబుతున్నారు. ఈ తతంగం అన్నీ ముగియడానికి 2027 ఎండింగ్ పడుతుందని అంటున్నారు. దాంతో జమిలి ఎన్నికలు 2027 చివరిలో కానీ లేదా 2028 మొదట్లో కానీ ఉండే చాన్స్ కనిపిస్తోంది అని అంటున్నారు. షెడ్యూల్ ప్రకారం అయితే 2029 మేలో ఎన్నికలు జరుగుతాయి. దాని కంటే ఒక ఏడాది ముందు అన్న మాట. ఇక జమిలి ఎన్నికలు కనుక జరిగితే దేశంలోని 28 రాష్ట్రాలలో ఒకేసారి కాకుండా అంది వచ్చిన పదిహేను రాష్ట్రాలతో కలుపుకుని జరిపిస్తారు అని అంటున్నారు. మొత్తానికి అయితే బెంగాల్ బీజేపీ చేతిలో పడాలి కానీ దేశంలో జమిలి ఎన్నికలకు రంగం సిద్ధం అయినట్లే అని అంటున్నారు. చూడాలి మరి ఈ ప్రచారంలో నిజమెంత ఉందో.