నా ఫోన్ ట్యాప్ ఎందుకు చేసినవ్ బే : ఎంపీ అరవింద్ తీవ్ర వ్యాఖ్యలు
ప్రస్తుతం రేవంత్ రెడ్డి ప్రభుత్వం నియమించిన సిట్ (SIT) విచారణపై ఎంపీ అరవింద్ తీవ్ర అనుమానాలు వ్యక్తం చేశారు.;
తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వివాదం మరోసారి తీవ్ర చర్చనీయాంశంగా మారింది. భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఎంపీ ధర్మపురి అరవింద్ తన ఫోన్‌ను ట్యాప్ చేశారని తీవ్ర ఆరోపణలు చేయడంతో ఈ వ్యవహారం మళ్లీ ఊపందుకుంది. ఈ కేసును తక్షణమే సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)కి అప్పగించాలని ఆయన డిమాండ్ చేశారు.
ఎంపీ అరవింద్ మాట్లాడుతూ.. తన ఫోన్ ట్యాప్ అవుతోందని ఆపిల్ ఐఫోన్ సంస్థ నుండి తనకు హెచ్చరిక సందేశాలు వచ్చాయని వెల్లడించారు. "నా ఫోన్ ట్యాప్ అవుతోందని యాపిల్ నుంచి అలర్ట్ మెసేజులు వచ్చాయి. అందుకు తగ్గ జాగ్రత్తలు మేము తీసుకున్నాం. టెలిఫోనులో కేసీఆర్, కేటీఆర్, కవిత గురించి నేను ఓపెన్‌గా మాట్లాడతాను. వాళ్ల గురించి ఏమన్నా మాటలు వినుంటే... ఆ తిట్ల తీవ్రతకు వాళ్ల చెవుల్లో నుంచి రక్తాలు కారేవి," అని ఆయన ఘాటుగా విమర్శించారు.
ప్రస్తుతం రేవంత్ రెడ్డి ప్రభుత్వం నియమించిన సిట్ (SIT) విచారణపై ఎంపీ అరవింద్ తీవ్ర అనుమానాలు వ్యక్తం చేశారు. "రేవంత్ రెడ్డి ప్రభుత్వం నియమించిన సిట్‌పై నాకు ఏ మాత్రం నమ్మకం లేదు. అసలైన న్యాయం జరిగాలంటే ఈ కేసును కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐకి అప్పగించాలి," అని ఆయన స్పష్టం చేశారు.
ఇక కేటీఆర్ గురించి ఎంపీ ధర్మపురి అరవింద్ నోరుపారేసుకున్నారు. ‘ఈయనో చిల్లరగాడు.. పనిపాట లేదా? చదువుకోలేదా? అమెరికా పో.. రాజకీయాల్లో ఎందుకున్నావు.. అభద్రత భావంతో ఫోన్లు ట్యాప్ చేస్తున్నావా?’ అంటూ కేటీఆర్ పై ఎంపీ ధర్మపురి అరవింద్ తీవ్ర విమర్శలు గుప్పించారు.
గత కొద్దికాలంగా తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు తీవ్ర చర్చకు దారితీశాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పలువురు రాజకీయ నాయకులు, ఉద్యోగుల ఫోన్‌లు ట్యాప్ చేయబడ్డాయని ఆరోపణలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. తాజాగా ఎంపీ అరవింద్ చేసిన ఈ వ్యాఖ్యలు ఈ వివాదానికి మరింత ఆజ్యం పోశాయి. ఈ పరిణామాలు తెలంగాణ రాజకీయాల్లో ఎలాంటి మలుపులు తిప్పుతాయో వేచి చూడాలి.