అజహర్ కు మంత్రి యోగం ఉందా? సీఈవోకు బీజేపీ ఫిర్యాదుతో ట్విస్ట్
ఇంకా ఎమ్మెల్సీ పదవి నియామకంపై ఆమోదం పొందకుండానే టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ మొహమ్మద్ అజహరుద్దీన్ ను తెలంగాణ కేబినెట్ లోకి తీసుకోవడం మలుపులు తిరుగుతోంది.;
ఇంకా ఎమ్మెల్సీ పదవి నియామకంపై ఆమోదం పొందకుండానే టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ మొహమ్మద్ అజహరుద్దీన్ ను తెలంగాణ కేబినెట్ లోకి తీసుకోవడం మలుపులు తిరుగుతోంది. అజహర్ ను చేర్చుకునేలా మంత్రివర్గ విస్తరణకు అనుమతి ఇవ్వొద్దంటూ తెలంగాణ బీజేపీ నేతలు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో)ను కలిసి ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం జూబ్లీహిల్స్ ఎన్నికల కోడ్ నడుస్తోందని.. దానిని ఉల్లంఘించేలా అక్కడినుంచి గత ఎన్నికల్లో పోటీ చేసిన అజహర్ ను మంత్రిగా చేయడం అంటే ఓ వర్గం ఓట్లను ఆకట్టుకోవడానికే అని బీజేపీ తన ఫిర్యాదులో పేర్కొంది. కేబినెట విస్తరణను ఆపాలని కోరారు.
అసలు నిర్ణయం ఏమిటో?
అజహర్ కు మంత్రి పదవి అని మీడియా అంతా చెప్పేసింది. సీఎం రేవంత్ రెడ్డి ఈ మేరకు నిర్ణయించినట్లుగానూ వార్తలు వచ్చేశాయి. శుక్రవారమే కేబినెట్ విస్తరణ అని.. ఇందుకు కాంగ్రెస్ హై కమాండ్ అనుమతి కూడా ఇచ్చిందని అంటున్నారు. అజహర్ కు మంత్రి పదవితో పాటు కొందరి మంత్రివర్గ శాఖలు కూడా మారుతాయనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఇంతలోనే సీఈవోను బీజేపీ కలవడం గమనార్హం.
ఎన్నికల సంఘం ఏం చేస్తుందో..??
బీజేపీ ఫిర్యాదు అనంతరం ఎన్నికల సంఘం (ఈసీ) నిర్ణయం ఎలా ఉంటుంది? అనేది చూడాల్సి ఉంది. 4 లక్షల మంది మొత్తం ఓటర్లకు గాను జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 1.20 లక్షల మంది ముస్లింలే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ అజహర్ ను మంత్రివర్గంలోకి తీసుకుని, కేబినెట్ లో ముస్లింలు లేరన్న విమర్శలకు అడ్డుకట్ట వేస్తోంది. ఉప ఎన్నికలో ఈ నియోజకవర్గం నుంచి మళ్లీ టికెట్ ఆశించిన అజహర్.. అధిష్ఠానాన్ని కలిసి తన కోరికను వెల్లడించారు. అయితే, నవీన్ యాదవ్ కు టికెట్ ఇచ్చే ఉద్దేశంలో అజహర్ ను ఎమ్మెల్సీని చేశారు. అజహర్ తో పాటు తెలంగాణ ఉద్యమకారుడు, తెలంగాణ జన సమితి (టీజేఎస్) వ్యవస్థాపకుడైన ప్రొఫెసర్ కోదండరాంను కూడా గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ఎంపిక చేశారు. దాదాపు రెండు నెలల కిందటే ఈ నియామకంపై ప్రభుత్వం నుంచి వివరాలు వచ్చినా గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ నుంచి ఆమోద ముద్ర మాత్రం పడలేదు. ఇది అలా ఉండగానే ఏకంగా మంత్రిని కూడా చేస్తున్నారు.
పలుసార్లు తిరస్కరణ..
కోదండరాం అభ్యర్థిత్వం ఇప్పటికే ఓసారి తిరస్కరణకు గురైంది. మళ్లీ ఆయనను ప్రతిపాదించారు. అది కూడా అజహర్ తో కలిపి కావడం గమనార్హం. ఇదే సమయంలో గవర్నర్ నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది. ఒకవేళ ఆమోదం లభించకుంటే అజహర్ ను త్వరలో ఖాళీ అయ్యే ఎమ్మెల్సీ స్థానాల నుంచి మండలికి పంపించే అవకాశం ఉంది. కానీ, ఈలోపు ఈసీ ఏం నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. కోడ్ నేపథ్యంలో మంత్రివర్గ విస్తరణను నిలిపివేస్తే అప్పుడు ఏం జరుగుతుంది అనేది ఆసక్తికరం.