కాంగ్రెస్ బీట్ ఔట్: దేశంలో అదే అతి పెద్ద పార్టీ..!
దేశంలో పలు జాతీయ పార్టీలు ఉన్నాయి. ఒకటి నుంచి రెండు మూడు రాష్ట్రాల్లో ప్రభావం చూపించే పార్టీలు జాతీయ పార్టీలుగా ప్రాచుర్యం పొందుతాయి;
దేశంలో పలు జాతీయ పార్టీలు ఉన్నాయి. ఒకటి నుంచి రెండు మూడు రాష్ట్రాల్లో ప్రభావం చూపించే పార్టీలు జాతీయ పార్టీలుగా ప్రాచుర్యం పొందుతాయి. వీటిలో టీడీపీ, డీఎంకే, బీఆర్ ఎస్, టీఎంసీ వంటి ప్రాంతీయ పార్టీలు కూడా జాతీయ పార్టీలుగా మారా యి. అయితే.. అతి పెద్ద జాతీయ పార్టీలను చూసుకుంటే మాత్రం.. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు మాత్రమే కనిపిస్తాయి. తాజాగా ఆయా పార్టీలకు సంబంధించిన పరిస్థితి, ఆయా పార్టీలకు ఉన్న బలం వంటివాటిపై కీలక ప్రకటన విడుదలైంది. ఈ లెక్కల ప్రకారం.. దేశంలో నిన్న మొన్నటి వరకు కూడా కాంగ్రెస్ పార్టీ అతి పెద్ద జాతీయ పార్టీగా ఉంది.
వాస్తవానికి 2014 తర్వాత కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి రాలేదు. అయినప్పటికీ.. గత ఏడాది ఎన్నికలకు ముందు వరకు కూడా.. పార్టీ సభ్యత్వాలు.. కార్యకర్తల విషయంలో ఆ పార్టీ ముందుంది. సభ్యత్వాలు.. 12 కోట్లపైబడి ఉన్నాయి. అదేవిధంగా కార్యకర్తల లెక్క మరో రేంజ్‌లో ఉంది. దీంతో 2024 ఎన్నికలకు ముందు కూడా కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో చాలా ముందుంది. దీనిని వెనక్కి నెట్టే విషయంలో మరో జాతీయ పార్టీ, ప్రస్తుతం ఎన్డీయే కూటమిగా కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ బీజేపీ చాలానే ప్రయత్నాలు చేసింది. ఎక్కడికక్కడ మార్పులు చేసుకుంటూ.. బీసీలకు ప్రాధాన్యం ఇస్తూ.. ముందుకు సాగింది.
ఈ నేపథ్యంలోనే గత ఏడాది నుంచి దేశవ్యాప్తంగా చేపట్టిన సభ్యత్వాల డ్రైవ్‌తో పార్టీ పుంజుకుంది. ఇదే విషయాన్ని తాజాగా బీజేపీ అధిష్టానం ప్రకటించింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 14.2 కోట్ల మంది సభ్యత్వాలు తీసుకున్నారని తెలిపారు. గత ఏడాది కాలంలోనేదేశంలో 3 కోట్ల పైచిలుకు కొత్త సభ్యత్వాలు నమోదయ్యాయని పార్టీ ప్రకటించింది. ఇతర జాతీయ పార్టీలతో పోల్చుకుంటే.. ఇది చాలా ఎక్కువని పేర్కొంది. అంతేకాదు, క్రియాశీలక కార్యకర్తల్లోనూ 8 కోట్ల మంది ఉన్నారని తెలిపింది. అంటే.. సభ్యత్వాలు తీసుకున్నాక.. పార్టీ కోసం పనిచేసేవారి సంఖ్య అన్న మాట. ఇది కాంగ్రెస్‌లో దేశవ్యాప్తంగా 6 కోట్లుగానే ఉంది. ఈ క్రమంలో జాతీయ స్థాయిలో అతి పెద్ద పార్టీగా బీజేపీ అవతరించిందని పార్టీ ప్రకటించింది.
దీనికి కారణాలను వివరిస్తూ.. మోడీ ప్రభుత్వంపై నమ్మకంతోనే ప్రజలు ఎక్కువగా బీజేపీ బాట పడుతున్నట్టు తెలిపింది. అంతేకాదు.. ప్రజలకు కేంద్రం అన్ని రకాల సంక్షేమాన్ని అందిస్తోందని .. ఇది కూడా తమకు కలిసివచ్చిందని పేర్కొంది. అదేసమయంలో బీసీ నాయకులకు అవకాశం ఇవ్వడం ద్వారా దక్షిణాదిలోనూ.. ఎస్సీ, ఎస్టీలకు ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా ఉత్తర భారతంలోని కొన్ని రాష్ట్రాల్లోనూ పార్టీ పుంజుకుందని పేర్కొంది. గతంలో వాజపేయి.. ఎల్. కే. అడ్వాణీలు ఇదే కలలు కన్నారని.. వీటినిఇప్పుడు ప్రధాని మోడీ, అమిత్ షా ద్వయం సాకారం చేస్తోందని చెప్పుకొచ్చారు.