గోశాల ఇష్యూలోకి బీజేపీ అగ్రనేత.. టీటీడీ చైర్మన్ పై ఘాటు వ్యాఖ్యలు

టీడీపీ, బీజేపీ మధ్య పొత్తు కొనసాగుతున్నా, బీజేపీ సీనియర్ నేత, న్యాయవాది అయిన సుబ్రహ్మణ్యస్వామి తొలి నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబుకు వ్యతిరేకంగానే వ్యవహరిస్తున్నారు.;

Update: 2025-04-18 14:27 GMT

ఏపీలో కూటమి ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరిస్తున్న బీజేపీకి ఆ పార్టీకి చెందిన అగ్రనేత సుబ్రహ్మణ్యస్వామి షాక్ ఇస్తున్నారు. తిరుపతిలోని ఎస్వీ గోశాలలో గోవుల మరణాలపై సుప్రీంకోర్టులో కేసు వేసేందుకు ఆయన సన్నాహాలు చేస్తున్నట్లు చెబుతున్నారు. మిత్రపక్షానికి చెందిన బీఆర్ నాయుడు టీటీడీ చైర్మన్ గా వ్యవహరిస్తున్నప్పటికీ, గోవుల మరణంపై ఆయన నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని సుబ్రహ్మణ్యస్వామి అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారాన్ని కోర్టుకీడ్చి టీటీడీతోపాటు అధికార టీడీపీ పైనా న్యాయపోరాటం చేయాలని సుబ్రహ్మణ్యస్వామి డిసైడ్ అవడం చర్చనీయాంశమవుతోంది.

టీడీపీ, బీజేపీ మధ్య పొత్తు కొనసాగుతున్నా, బీజేపీ సీనియర్ నేత, న్యాయవాది అయిన సుబ్రహ్మణ్యస్వామి తొలి నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబుకు వ్యతిరేకంగానే వ్యవహరిస్తున్నారు. పలు విషయాల్లో టీడీపీని టార్గెట్ చేసిన సుబ్రహ్మణ్యస్వామి తాజాగా టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడిని లక్ష్యంగా ఎంపిక చేసుకోవడం రాజకీయంగా హీట్ పుట్టిస్తోంది. గోవుల మరణాలపై పూర్తి ఆధారాలు సేకరించి సుప్రీంలో సవాల్ చేయాలని సుబ్రహ్మణ్యస్వామి నిర్ణయించడం చర్చకు దారితీస్తోంది. ఈ క్రమంలో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు వివరణపై సుబ్రహ్మణ్యస్వామి తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు చెబుతున్నారు.

వృద్దాప్యం కారణంగా గోవులు మరణించాయని చెప్పడం టీటీడీ చైర్మన్ నిర్లక్ష్యంగా భావిస్తున్న సుబ్రహ్మణ్యస్వామి టీటీడీ చైర్మన్ కూడా వృద్ధాప్యంతో బాధపడుతున్నారని, ఆయన కుటుంబ సభ్యులు వదిలేస్తారా? అంటూ ఘాటు వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశమవుతోంది. ఈ పరిణామం ఎటు దారితీస్తుందోనని టీడీపీ, బీజేపీ నేతలు టెన్షన్ పడుతున్నారు. న్యాయవాది అయిన సుబ్రహ్మణ్యస్వామి మొండివారని చెబుతారు. ఆయన ఏదైనా విషయంపై డిసైడ్ అయ్యారంటే ఆ తర్వాత ఎవరి మాట వినరని చెబుతున్నారు. ప్రస్తుతం జాతీయ రాజకీయాలను కుదిపేస్తున్న నేషనల్ హెరాల్డ్ కేసును కూడా సుబ్రహ్మణ్యస్వామి వెలుగులోకి తెచ్చారు. స్వయంగా ఆ కేసును వాదిస్తూ కాంగ్రెస్ అగ్రనేతలకు ముప్పతిప్పలు పెడుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఆయన టీటీడీ గోశాల విషయంలో జోక్యం చేసుకుంటే ఇబ్బందేనన్న టాక్ వినిపిస్తోంది.

Tags:    

Similar News