ఓబీసీకి పట్టం.. మోడీ వ్యూహానికి కాంగ్రెస్ ఉక్కిరిబిక్కిరి!
తమిళనాడులో బలమైన సామాజికవర్గం: ప్రస్తుతం ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేసిన సీపీ రాధాకృష్ణన్.. తమిళనాడులో బలమైన గౌండర్ సామాజిక వర్గానికి వర్గానికి చెందిన వారు.;
తాజాగా బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిని ఎంపిక చేసింది. తమిళనాడుకు చెందిన చంద్రాపురం పొన్నుసామి రాధాకృష్ణన్(సీపీ రాధాకృష్ణన్)ను ప్రధాని మోడీ అధ్యక్షతన జరిగిన బీజేపీ పార్లమెంటరీ బోర్డు.. ఈయనను ఎంపిక చేసింది. అయితే.. ఏం చేసినా స్వప్రయోజనాలు లేకుండా ఏ పార్టీ కూడా అడుగులు వేయదు. అలానే ఇప్పుడు సీపీ రాధాకృష్ణ న్ ఎంపికలోనూ.. మూడు కీలక అంశాలను ప్రధానంగా పరిగణనలోకి తీసుకున్నట్టు స్పష్టంగా తెలుస్తోంది. వీటిని ప్రాతిపదికగా చేసుకునే రాధాకృష్ణన్ ఎంపిక జరిగిందని అంటున్నారు.
1) తమిళనాడులో బలమైన సామాజికవర్గం: ప్రస్తుతం ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేసిన సీపీ రాధాకృష్ణన్.. తమిళనాడులో బలమైన గౌండర్ సామాజిక వర్గానికి వర్గానికి చెందిన వారు. గౌండర్లలో అనేక ఉప కులాలు ఉన్నాయి. ఏపీలో కాపులు, కమ్మల మాదిరిగా గౌండర్‌లు తమిళనాడులో రాజకీయాలను శాసించేస్థాయిలో ఉన్నారు. అందుకే.. ఏ ప్రభుత్వం వచ్చినా.. మంత్రిపదవులు వీరు కోరకుండా ఇస్తారు. ఇక, జనాభాలోనూ వీరి భాగస్వామ్యం ఎక్కువగా ఉంది. ఓబీసీలుగా పరిగణించే ఈ సామాజిక వర్గానికి చెందిన రాధాకృష్ణన్‌కు ఛాన్స్ ఇవ్వడం ద్వారా బీజేపీ పెద్ద వ్యూహమే వేసింది.
2) కాంగ్రెస్-డీఎంకేలకు ఛాన్స్ లేకుండా చేయడం: తమిళనాడు నుంచి సీపీ రాధాకృష్ణన్‌ను ఎంపిక చేయడం ద్వారా బీజేపీ రాజకీయ పాచికలను సరిగ్గా తనకు అనుకూలంగా మార్చుకుంది. గౌండర్ సామాజిక వర్గానికి చెందిన(ఓబీసీ) సీపీ రాధాకృష్ణన్ ను ఎంపిక చేయడం ద్వారా.. ప్రస్తుత తమిళనాడులో కాంగ్రెస్-డీఎంకేలు అధికారంలో ఉన్నాయి. వచ్చే ఎన్నికల్లోనూ విజయందక్కించుకోవాలని భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ ఎంపిక చేసిన గౌండర్ సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థిని వ్యతిరేకిస్తే.. ప్రత్యామ్నాయంగా మరో అభ్యర్థిని తీసుకువస్తే.. గౌండర్ సహా.. ఈ సామాజిక వర్గంలోని ఉప కులాలు ఈ రెండు పార్టీలపైనా ఆగ్రహం వ్యక్తం చేయడం ఖాయం. తద్వారా బీజేపీకి తమిళనాడులో మరింత అనుకూల పవనాలు పెరుగుతాయి.
3) అటు బీజేపీ-ఇటు ఆర్ ఎస్ ఎస్‌లకు కీలక నేత: ఇక, సీపీ రాధాకృష్ణన్ ఎంపిక విషయంలో బీజేపీ నాణేనికి మరోవైపును కూడా పరిగణనలోకి తీసుకుంది. ఇటీవల కాలంలో బీజేపీ మాతృ సంస్థ ఆర్ ఎస్ ఎస్ నుంచి వస్తున్న విమర్శలకు చెక్ పెట్టేలా.. ఇప్పుడు ఉపరాష్ట్రపతి అభ్యర్థిని ఎంపిక చేసిందనే వాదన వినిపిస్తోంది. 17 ఏళ్ల వయసులోనే ఆర్ ఎస్ ఎస్ తో తన ప్రస్థానాన్ని ప్రారంభించిన రాధాకృష్ణన్‌ను ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేయడం ద్వారా.. స్వామికార్యం, స్వకార్యం రెండూ నెరవేర్చుకునే దిశగా మోడీ నేతృత్వంలోని బీజేపీ కీలక నిర్ణయం తీసుకుందున్న చర్చ జోరుగా సాగుతోంది.