ఇద్దరు బీజేపీ సీఎంలను రాజీనామా చేయిస్తారా ?

జూన్ నెల వచ్చేసింది. దాంతో దేశంలో మారే రాజకీయాల గురించి పెద్ద ఎత్తున చర్చ మొదలైంది.

Update: 2026-06-01 04:22 GMT

జూన్ నెల వచ్చేసింది. దాంతో దేశంలో మారే రాజకీయాల గురించి పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చి రెండేళ్ళు జూన్ 9తో పూర్తి అవుతున్నాయి. దాంతో భారీ ఎత్తున కేంద్ర మంత్రి వర్గ విస్తరణ లేదా పునర్ వ్యవస్థీకరణ జరగనుంది అని జాతీయ స్థాయిలో గట్టిగా వినిపిస్తున్న మాట. దానికి తగినట్లుగా సూచనలు సంకేతాలు కూడా కనిపిస్తున్నాయి ఇదిలా ఉంటే ఎవరిని కేంద్ర మంత్రులుగా తీసుకుంటారు అన్న దాని మీద వివిధ రకాలైన విశ్లేషణలు వార్తలు కూడా ప్రచారంలో ఉంటున్నాయి.

నితీష్ కి చోటు ఖాయం :

ఇక ఇప్పటికి నెలన్నర క్రితమే తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణం చేసిన దిగ్గజ నేత జేడీయూ అధ్యక్షుడు నితీష్ కుమార్ కి కేంద్ర మంత్రి పదవి ఖాయమని అంటున్నారు. ఆయనకు ఆ హామీ మీదనే బీహార్ సీఎం పదవి నుంచి తప్పించారు అన్నది కూడా ఉంది. అలా సుదీర్ఘ కాలం ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసి కేంద్ర మంత్రివర్గంలో చేరుతున్న వారిలో నితీష్ అందరి దృష్టిని ఆకట్టుకుంటున్నారు. ఆయన ఒక్కరే కాదు మరో ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా తమ పదవులకు రాజీనామా చేసి కేంద్ర మంత్రులుగా బాధ్యతలు స్వీకరిస్తారు అని ప్రచారం హస్తిన వర్గాలలో సాగుతూండడం విశేషం.

ఎవరా ఇద్దరు సీఎంలు :

ఇదిలా ఉంటే ఈ ప్రచారం బట్టి చూస్తే కనుక ఆ ఇద్దరు ముఖ్యమంత్రులు ఎవరూ అన్నది అంతా ఆసక్తిగా చర్చిస్తున్నారు. ఈ రోజున దేశంలో బీజేపీకి సొంతంగా 16 రాష్ట్రాలలో ముఖ్యమంత్రులు ఉన్నారు. ఇల లేటెస్ట్ గా చూస్తే బీహార్ లో సామ్రాట్ చౌదరి, అస్సాం లో హిమంత శర్మ, పశ్చిమ బెంగాల్ లో సువేందు అధికారి కొత్తగా సీఎంలు అయ్యారు. అలా వారిని కేంద్రంలోకి తీసుకోలేరు అని అంటున్నారు. మరో వైపు 2027, 2028లలో వివిధ రాష్ట్రాలకు ఎన్నికలు ఉన్నాయి. దాంతో ఎన్నికలు జరిగే రాష్ట్రాలలో పార్టీలో ప్రభుత్వంలో మార్పులు చేయడానికి అక్కడ మరింత బలోపేతం చేయడానికి సీఎంలను మార్చి కేంద్రంలోకి తీసుకుంటారా అన్న చర్చ సాగుతోంది.

కీలక నిర్ణయాలు :

అలా ఆలోచిస్తే 2027 లో ఏడు రాష్ట్రాల్లో శాసనసభలకు ఎన్నికలు జరగనున్నాయి. అవి వరుసగా ఉత్తర ప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్, గోవా మణిపూర్ హిమాచల్ ప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాలు. ఇందులో యూపీ సీఎం యోగిని తప్పించే చాన్స్ ఏమైనా ఉందా అన్నది ఒక చర్చ. ఆయన ప్లేస్ లో ఎవరిని అయినా తెస్తారా అన్నది కూడా ఆలోచిస్తున్నారు. అలాగే గుజరాత్ లో భూపేంద్ర పటేల్ ఉన్నారు. ఆయనను కేంద్ర మంత్రిని చేసి కొత్త వారికి అక్కడ పగ్గాలు అప్పగిస్తారా అన్నది ఉంది. అలాగే ఉత్తరాఖండ్ సీఎం అయిన పుష్కర సింగ్ దామీని ఏమైనా కేంద్రంలోకి తీసుకుని వచ్చే ఆలోచన ఉందా అన్నది కూడా చర్చిస్తున్నారు. 2028లో మధ్యప్రదేశ్, రాజస్థాన్ వంటి పెద్ద రాష్ట్రాలకు ఎన్నికలు ఉన్నాయి.అలా అక్కడ సీఎంలను ఏమైనా కదుపుతారా అన్నది మరో చర్చ. ఏది ఏమైనా నితీష్ తో పాటు మరో ఇద్దరు సీఎంలకు కేంద్ర మంత్రులు అన్న వార్త అయితే పెద్ద ఎత్తున వైరల్ అవుతోంది. ఆ బీజేపీ ముఖ్యమంత్రులు ఎవరూ అన్నదే చూడాల్సి ఉంది.

ప్రధాన శాఖలు వారికే :

ఈ విధంగా ముఖ్యమంత్రులుగా చేసి వచ్చిన వారికి ప్రధాన శాఖలు కేంద్ర ప్రభుత్వం కట్టబెడుతుందని అంటున్నారు. రైల్వే శాఖ, అటీ, పౌర విమానయాన శాఖ వంటి వాటితో పాటు కొందరు కేంద్ర మంత్రుల వద్ద సమాచార ప్రసారాల శాఖ గ్రామీణ అభివృద్ధి శాఖ వంటివి అదనంగా ఉన్నాయి. వీటిని కూడా సీనియర్లకు సీఎం లుగా చేసిన వారికే ఇస్తారని అంటున్నారు. చూడాలి మరి మోడీ అమిత్ షాల వ్యూహం ఏమిటి అన్నది.

Tags:    

Similar News