కవిత కోసం బీజేపీ ఆరాటం ఎందుకు ?

బీజేపీ చాలా వ్యూహాత్మకంగా ఎపుడూ వ్యవహరిస్తూంటుంది. ఆ పార్టీకి ప్రాంతీయ పార్టీలు అంటే పరమ చికాకు.;

Update: 2025-05-24 06:34 GMT

బీజేపీ చాలా వ్యూహాత్మకంగా ఎపుడూ వ్యవహరిస్తూంటుంది. ఆ పార్టీకి ప్రాంతీయ పార్టీలు అంటే పరమ చికాకు. వాటి వల్లనే జాతీయ పార్టీల ఎదుగుదల ఆగిపోతోంది అన్నది బీజేపీకి ఉన్న పర్మనెంట్ అభిప్రాయం. అందుకే ప్రాంతీయ పార్టీలను నిర్వీర్యం చేయాలని నిలువరించాలని నియంత్రించాలని తనదైన ప్రయత్నం ఎప్పుడూ చేస్తూనే ఉంటుంది అని అంటున్నారు. ఒకే దేశం ఒకే ఎన్నిక అన్నది అందులో భాగమే అని చెబుతూంటారు.

ఈ నేపద్యంలో ప్రాంతీయ పార్టీలతో పొత్తు పెట్టుకోవడం వాటినే చీల్చడం ఇలా బీజేపీ చాలానే చేసిందని ఆరోపణలు ఉన్నాయి. ఉదాహరణకు మహారాష్ట్రలో శివసేన పార్టీతో పొత్తు పెట్టుకుని ఆ పార్టీని రెండు ముక్కలు చేసి ఏక్ నాధ్ షిండేను మహా నేతను చేసింది బీజేపీయే అని అంటారు. అలాగే మరాఠా యోధుడు శరద్ పవార్ పార్టీని చీల్చిన ఘనతనూ బీజేపీ మూటకట్టుకుందని చెబుతారు.

అలాంటి బీజేపీకి ఇపుడు ఊహించని అవకాశంగా బీఆర్ఎస్ లో వివాదాలు కనిపిస్తున్నాయని అంటున్నారు. స్వయంగా కేసీఆర్ కుమార్తె కవిత తండ్రి కేసీఆర్ ని ఎదిరిస్తూ రాసిన లేఖతో ఇపుడు గులాబీ పార్టీలో గుబులు రేగుతోంది. దాంతో ఇదే సందు అన్నట్లుగా బీజేపీ తన వ్యూహాలకు పదును పెడుతోంది అని అంటున్నారు.

బీజేపీ సోషల్ మీడియా యాక్టివిస్టులు తమ హ్యాండిల్స్ ద్వారా ఇపుడు యమ జోరు చేస్తున్నారు అని బీఆర్ఎస్ లో వివాదాలు గొడవల మీద ఫుల్ ఫోకస్ చేస్తూ తెగ వైరల్ చేస్తున్నారు అని అంటున్నారు. కవితకు ఏదో అన్యాయం జరిగింది అన్నట్లుగా కూడా ప్రచారం చేస్తున్నారు అని అంటున్నారు.

ఇదంతా ఆమె మీద ప్రేమతో కంటే బీఆర్ఎస్ ని చీల్చడం కోసమే అని అంటున్నారు. ఇక చూస్తే కవితను మంచి నాయకురాలిగా ప్రొజెక్ట్ చేస్తున్నా ఆమెను పార్టీలోకి చేర్చుకునే ఉద్దేశ్యం ఏదీ బీజేపీ నేతలకు లేదని అంటున్నారు. ఆమె ద్వారా తమకు కావలసిన కార్యాన్ని జరిపించుకోవడమే ముఖ్య ఉద్దేశ్యం అని అంటున్నారు.

మరో వైపు చూస్తే కవితకు బీఆర్ఎస్ నుంచి అండ దండ లేదని కూడా బీజేపీ సోషల్ మీడియా యాక్టివిస్టులు సానుభూతిని చూపిస్తున్నారు అని అంటున్నారు. అమెరికా నుంచి పర్యటన ముగించుకుని శంషాబాద్ ఎయిర్ పోర్టుకు వచ్చిన కవితకు బీఆర్ఎస్ నుంచి స్వాగతం లేదని పెద్ద నాయకులు కానీ చిన్న నాయకులు కానీ ఆమెకు స్వాగతం పలికేందుకు రాలేదని గుర్తు చేస్తూ ఆ తరహా వార్తలను కూడా సోషల్ మీడియాలో హైలెట్ చేస్తున్నారు.

తెలంగాణా జాగృతి పేరు మీద బ్యానర్లు మాత్రమే కవిత స్వాగత కార్యక్రమంలో కనిపించాయీ అంటే ఆమె బీఆర్ఎస్ నుంచి పూర్తిగా వేరు పడినట్లే అని కూడా అంటున్నారు. ఇక కవితకు గులాబీ పార్టీలో సరైన స్థానం లేదని ఆమె దాదాపుగా వేరు పడినట్లే అని కూడా అంటున్నారు.

మరో వైపు చూస్తే కవిత కొత్తగా పార్టీ పెట్టబోతున్నారు అని కూడా కధనాలు ప్రచారం చేస్తున్నారు. ఇక మీడియా కూడా మీరు కొత్త పార్టీ పెడతారా మీకు కేసీఅర్ దగ్గర సాన్నిహిత్యం లేదా అని అడిగిన ప్రశ్నలకు కవిత స్పందించలేదని అంటున్నారు. ఇక కవితకు స్వాగతం పలికిన ఫ్లెక్సీలలోనూ కేసీఆర్ కేటీఆర్ ఫోటోలు అయితే కనిపించలేదు అని అంటున్నారు.

ఈ విధంగా చూస్తే కనుక కవిత బీఆర్ఎస్ నుంచి దూరం అవుతున్నారని అంటున్నారు. వీటి మీద ఇపుడు బీజేపీ సోషల్ మీడియా యాక్టివిస్టులు ఫుల్ ఫోకస్ పెట్టేశారు అని అంటున్నారు. అంటే కవిత బీఆర్ఎస్ నుంచి బయటకు రావాలని బీఆర్ఎస్ చీలిపోవాలని అది తెలంగాణాలో పొలిటికల్ గా తమకు అడ్వాంటేజ్ కావాలని బీజేపీ గట్టిగా కోరుకుంటోందా అన్న చర్చ అయితే సాగుతోంది.

ఏది ఏమైనా గులాబీ పార్టీలో రేగుతున్న మంటలు కమలానికి ఎంత మేరకు ఉపయోగపడతాయో తెలియదు కానీ కమల కుతూహలం మాత్రం అధికమైపోతోంది. బీజేపీ తాను బలపడేందుకు బీఆర్ఎస్ లో కలహాలను పూర్తిగా వినియోగించుకోవాలని చూస్తోంది అన్నది రాజకీయ విశ్లేషకుల మాటగా ఉంది. చూడాలి మరి ఏమి జరుగుతుందో. ఎవరికి మేలు జరుగుతుందో, ఎవరికి ఈ పరిణామాలు ప్లస్ అవుతాయో.

Tags:    

Similar News