బీహార్ దంగల్: కోటి మందికి ఉద్యోగాలు.. కేజీ టు పీజీ ఫ్రీ.. ఎన్డీయే మ్యానిఫెస్టో
అయితే.. సాధారణంగా ఉచితాలకు తాము వ్యతిరేకమని చెప్పే బీజేపీ.. బీహార్ విషయంలో మాత్రం ఆసూత్రాన్ని పక్కన పెట్టింది.;
బీహార్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి శుక్రవారం ఉమ్మడి ఎన్నికల మ్యానిఫెస్టోను విడుదల చేసింది. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, కేంద్ర మంత్రులు జితిన్ రామ్ మాంఝీ, చిరాగ్ పాశ్వాన్ సహా పలువురు నేతల సమక్షంలో నిర్వహించిన కార్యక్రమంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జేపీ నడ్డా ఈ మ్యానిఫెస్టోను విడుదల చేశారు. అయితే.. సాధారణంగా ఉచితాలకు తాము వ్యతిరేకమని చెప్పే బీజేపీ.. బీహార్ విషయంలో మాత్రం ఆసూత్రాన్ని పక్కన పెట్టింది.
రాష్ట్రంలోని యువతకు వచ్చే ఐదేళ్లలో కోటి ఉద్యోగాలు కల్పించడమే తమ లక్ష్యమని పేర్కొంది. అంతేకాదు.. కోటి మంది మహిళలను రాబోయే ఐదేళ్లలో లక్షాధికారులుగా మారుస్తామని హామీ ఇచ్చారు. అదేవిధంగా కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు ఉచిత విద్యను అందిస్తామని తెలిపారు. అక్కడితో కూడా ఆగకుండా.. బీహార్‌లోని ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన విద్యార్థులకు నెలకు 2 వేల రూపాయలను ఉపకార వేతనంగా అదిస్తామని మేనిఫెస్టోలో పేర్కొన్నారు.
అంతేకాదు.. కొత్తగా వ్యాపారాలు ప్రారంభించే మహిళలకు(ఎంఎస్ ఎంఈ) 2 లక్షల రూపాయల సాయం ఉచితంగా అందిస్తారు. అలాగే.. రైతులకు ఏడాదికి 9 వేల రూపాయల చొప్పున పెట్టుబడి సాయం. ఇది కేంద్రం అందిస్తున్న పీఎం కిసాన్ నిధులకు అదనంగా అందిస్తారు. అంటే.. మొత్తంగా రైతులకు 15 వేల రూపాయలను ఏడాదికి అందించనున్నారు. రాష్ట్రంలోని నాలుగు నగరాల్లో మెట్రో రైళ్లు ఏర్పాటు చేస్తారు. అదేవిధంగా 7 ప్రధాన రహదారులను ఎక్స్‌ప్రెస్ వేలుగా మార్చనున్నారు.
గిగ్ వర్కర్లు(జుమాటో, స్విగ్వీ), ఆటో డ్రైవర్లకు ఏడాదికి రూ.10,000 ఆర్థిక సాయం అందిస్తామని మ్యానిఫెస్టోలో కీలక హామీ గుప్పించారు. అంతేకాదు.. ప్రతి జిల్లాలోనూ మెడికల్ కాలేజీ నిర్మాణం.. సగం సీట్లు పేదలకు కేటాయింపు. వచ్చే ఐదేళ్లలో 50 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు ఆకర్షించి.. వాటి ద్వారా ఉద్యోగాలు, ఉపాధికల్పన చేస్తామని హామీలపై హామీలు గుప్పించారు. మరి బీహార్ ఓటరు ఏమేరకు కరుణిస్తాడో చూడాలి.