మళ్లీ అదే ప్రశ్న: ఎగ్జిట్ పోల్స్ నమ్మొచ్చా?
ఇలా సర్వే సంస్థలు ఎగ్జిట్ ఫలితాలను వెల్లడించాయి. అయితే.. సహజంగానే గెలుస్తామని ఆశలు పెట్టుకున్న పార్టీలు.. ఈ సంస్థల సర్వేలపై నమ్మకం లేదని చెబుతున్నాయి.;
దేశవ్యాప్తంగా 10 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికతోపాటు బీహార్‌లోని 243 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఈ పోలింగ్ ప్రక్రియ ముగిసీ ముగియగానే.. ఎగ్జిట్ పోల్ ఫలితాలను సర్వే సంస్థలు వెల్లడించాయి. వీటిలో బీహార్‌లో తిరిగి ప్రస్తుతం అధికారంలో ఉన్న ఎన్డీయే ప్రభుత్వమే వస్తుందని మెజారిటీ సర్వే సంస్థలు(దాదాపు అన్నీ) తేల్చి చెప్పాయి. మోడీ మ్యానియా బాగా వర్కవుట్ అయిందని.. ముఖ్యమంత్రి నితీష్‌కు ప్రజలు మరోసారి పట్టం కడుతున్నారని సర్వే సంస్థలు తేల్చి చెప్పాయి. ఇదే సమయంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో అధికార పార్టీ కాంగ్రెస్ వైపు ప్రజలు మొగ్గు చూపినట్టు పేర్కొన్నాయి.
నిజానికి జూబ్లీహిల్స్‌లో బీఆర్ ఎస్ సెంటిమెంటును రాజేసింది. పైగా ఇది సిట్టింగ్ సీటు కావడంతో ప్రధాన ప్రతిపక్షం బీఆర్ ఎస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన రోజు నుంచే ప్రచారం చేసింది. తొలి బీఫాం కూడా..మాగంటి సునీ తకు ఇవ్వడం ద్వారా ప్రజల్లోకి బలమైన సంకేతాలు కూడా పంపించామని చెప్పింది. ఇక, రాజకీయ వివాదాలు, విమర్శలు కామన్‌గా సాగిపోయాయి. అయినప్పటికీ.. ప్రజలు సెంటిమెంటుకు మొగ్గు చూపలేదన్న వాదనను సర్వే సంస్థలు పేర్కొన్నా యి. దీంతో కాంగ్రెస్ వైపే ప్రజలు మొగ్గు చూపారని, అయితే.. పోరు మాత్రం హోరా హోరీగానే సాగిందని పేర్కొన్నాయి.
ఇలా సర్వే సంస్థలు ఎగ్జిట్ ఫలితాలను వెల్లడించాయి. అయితే.. సహజంగానే గెలుస్తామని ఆశలు పెట్టుకున్న పార్టీలు.. ఈ సంస్థల సర్వేలపై నమ్మకం లేదని చెబుతున్నాయి. వాస్తవ ఫలితమే తమకు గీటు రాయి అని బీహార్ విషయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని మహాఘఠ్ బంధన్, జూబ్లీహిల్స్ విషయంలో బీఆర్ ఎస్ పార్టీలు కూడా చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో సర్వే సంస్థలను ఏమేరకు నమ్మొచ్చు? అనే ప్రశ్న మరోసారి తెరమీదకి వచ్చింది. వాస్తవానికి.. సర్వే సంస్థలు దాదాపు నిజమైన పరిస్థితులు ఉన్నప్పటికీ.. కొన్ని పట్టు తప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి.
గతంలో ఏపీలో జగన్ అధికారంలోకి వస్తారని.. రెండు మూడు సర్వేలు చెప్పగా.. అది విఫలమైంది. కర్ణాటకలో కాంగ్రెస్ బొటాబొటి మార్కులతో వస్తుందని చెప్పినా.. ఎన్నడూ లేని విధంగా కాంగ్రెస్ భారీ మెజారిటీ దక్కించుకుంది. ఇక, పంజాబ్, హరియాణాలలోనూ ఇలానే మిశ్రమ ఫలితం కనిపించింది. ఇక, కేంద్రంలో మోడీ సర్కారుమూడోసారి వస్తుందని.. భారీ మెజారిటీ కూడాదక్కించుకుంటారని చెప్పాయి. మూడో సారి మోడీ వచ్చినా.. కేవలం 248 స్థానాలకే పరిమితం అయ్యారు. దీంతో ఎన్డీయే పక్షాల బలంతో ఆయన గద్దె నెక్కారు. సో.. సర్వే ఫలితాలు అన్ని వేళలా నిజం కాకపోవడంతోపాటు.. మిశ్రమంగా ఉండడంతో మరోసారి నొమ్మొచ్చా? అనే ప్రశ్న తెరమీదికి రావడం గమనార్హం.