బీహార్ దంగల్: తొలి ఘట్టం పూర్తి.. రాహుల్ హ్యాపీ!
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో తొలి దశ పోలింగ్ ముగిసింది. మొత్తం 243 అసెంబ్లీ స్థానాలు ఉన్న బీహార్‌లో రెండు దశల్లో కేంద్ర ఎన్నికల సంఘం పోలింగ్ నిర్వహిస్తోంది.;
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో తొలి దశ పోలింగ్ ముగిసింది. మొత్తం 243 అసెంబ్లీ స్థానాలు ఉన్న బీహార్‌లో రెండు దశల్లో కేంద్ర ఎన్నికల సంఘం పోలింగ్ నిర్వహిస్తోంది. దీనిలో తొలి అర్ధభాగం.. గురువారం ముగి సింది. అయితే.. ఊహించని విధంగా 67 శాతం వరకు పోలింగ్ జరిగింది. వాస్తవానికి బీహార్ చరిత్రంలో ఇప్పటి వరకు 67 శాతం పోలింగ్ నమోదు కావడం .. ఇదే తొలిసారి అని అధికారులు, రాజకీయ నేతలు కూడా చెబుతున్నారు. ఈ పరిణామం మహాఘఠ్ బంధన్‌కు నేతృత్వం వహిస్తున్న కాంగ్రెస్‌లో సంతోషం నింపింది.
తొలిదశ పోలింగ్‌లో 121 స్థానాలకు సంబంధించి పోటీలో ఉన్న అభ్యర్థుల భవితవ్యాన్ని ఓటర్లు తేల్చేశా రు. పూర్తిగా ఈవీఎంల ద్వారానే జరిగిన ఈ పోలింగ్‌లో మహిళలు ఎక్కువగా రావడం మరో చర్చకు దారితీసింది. ఇరు పక్షాల కూటములు.. బీజేపీ నేతృత్వంలోనిఎన్డీయే, కాంగ్రెస్ నేతృత్వంలోని మహాఘఠ్ బంధన్‌లు.. మహిళలపై వరాల జల్లు కురిపించాయి. ఏడాదికి 10 వేల చొప్పున మహిళలకు ఆర్థిక సాయం చేస్తామని.. బీజేపీ ప్రకటించగా, మహిళా ఉద్యోగులను రెగ్యులర్ చేయడంతోపాటు.. వారికి నెలకు రూ.2000 చొప్పున ఇస్తామని కాంగ్రెస్ నేతృత్వంలో ఆర్జేడీ ప్రకటించింది.
ఈ కారణంగానే.. మహిళలు పోలింగ్ బూతుల వరకు చేరుకున్నారన్న వాదన వినిపిస్తోంది. ఏదేమైనా గతంలో 45-55 శాతాలకు, 2000 సంవత్సరంలో 62 శాతానికి మాత్రమే పరిమితమైన.. పోలింగ్ తాజాగా 67 శాతానికి పెరగడం(5%) అనేక చర్చలకు దారి తీసింది. మరోవైపు దీనిపై కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. పోలింగ్ పెరిగిందంటే.. అది ప్రభుత్వ వ్యతిరేకతకు.. ముఖ్యంగా సీఎం నితీష్‌కుమార్‌కు వ్యతిరేకంగా ప్రజలు పోటెత్తినట్టేనని విశ్లేషించారు. ఇదే విషయాన్ని ఆర్జేడీ నాయకుడు తేజస్వి యాదవ్ కూడా చెప్పుకొచ్చారు.
స్వల్ప ఘటనలు..
వాస్తవానికి బీహార్ ఎన్నికలు అంటే.. దొమ్మీలు.. బూత్ ఆక్రమణలు కామన్. గతంలో అనేక కేసులు కూడా నమోదయ్యాయి. అలాంటిది ఈ సారి కేంద్రబలగాలను రంగంలోకి దింపారు. ప్రతి బూత్‌ను సీసీ కెమెరా నిఘాలోకి తీసుకువచ్చారు. ఫలితంగా ఎలాంటి విధ్వంసాలకు అవకాశం లేకుండా.. కేంద్ర ఎన్నికల సంఘం పక్కా చర్యలు తీసుకోవడంతో పోలింగ్ ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రశాంతంగా సాగిపోయింది.