ఎన్డీయే గెలుపు వెనక ఎంవై మంత్రం
బీహార్ విజయానికి మహిళకు యువత ప్రధాన కారణం అని ఆ పార్టీ విజయోత్సవ సంబరాలలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సైతం వ్యాఖ్యానించారు.;
బీహార్ లో ఎన్డీయే ఇంత పెద్ద మెజారిటీతో గెలిచింది అంటే దాని వెనక ఎంవై మంత్రం ఉందని అంటున్నారు. నిజానికి ఈ ఎంవై మంత్రం ఎపుడూ ఆర్జేడీకి విషయ సూత్రంగా ఉంటూ వచ్చింది. అయితే ఆర్జేడీ ఎంవై మంత్రానికి ఎన్డీయే ఎంవై మంత్రానికి భారీ తేడాయే ఉంది. ఆర్జేడీ ఎంవై అంటే ముస్లిమ్స్ అండ్ యాదవ్. ఈ రెండు బలమైన సామాజిక వర్గాల మద్దతుతో ఆర్జెడీ ఎపుడూ ముందంజలో ఉండేది. గెలుపు తీరం తాకకపోయినా మంచి నంబర్ తో సీట్లు అయితే దక్కేవి. కానీ ఈసారి ఆర్జేడీ ఎంవై విజయ సూత్రం వికటించింది. కేవలం వై మద్దతు మాత్రమే దక్కి చతికిలపడింది.
ఎన్డీయేకి సాలిడ్ గా :
ఇక ఎంవై మంత్రం ఎన్డీయేకు సాలిడ్ గా ఉపకరించింది అని అంటున్నారు. అది ఎలా ఉంటే ఎం అంటే మహిళలు, వై అంటే యూత్ ఈ రెండు భారీ సెక్షన్లు ఎపుడూ గెలుపు రాతను రాస్తాయి. భారీ విజయాలను అందిస్తాయి. రాజకీయ పార్టీల సిరిని కూడా నిర్ణయిస్తాయి. బీహార్ లో పెద్ద ఎత్తున పోలింగ్ బూత్ లలో కొలువు తీరిన మహిళలు అలాగే పెద్ద సంఖ్యలో వచ్చిన యువత సైతం ఈసారి ఎన్డీయేకు జై కొట్టారు. దాంతోనే ఇంత పెద్ద విజయం దక్కింది అన్నది ఒక వాస్తవ విశ్లేషణగా ఉంది.
మోడీ సైతం :
బీహార్ విజయానికి మహిళకు యువత ప్రధాన కారణం అని ఆ పార్టీ విజయోత్సవ సంబరాలలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సైతం వ్యాఖ్యానించారు. ఎన్డీయే ప్రభుత్వం పాలన పట్ల మహిళకు యువత ఎంతో సంతృప్తిగా ఉన్నారని వారు అభివృద్ధిని తమ సంక్షేమాన్ని కోరుకుంటున్నారు అని ఆయన అన్నారు. అంతే కాదు వారు అభివృద్ధి నిరోధక శక్తులను దూరంగా పెట్టారని అందుకే ఇంతటి భారీ విజయం తమ కూటమిని దక్కింది అని ప్రధాని చెప్పుకొచ్చారు.
డబుల్ ఇంజన్ సర్కార్ తో :
తాజా విజయాన్ని సుపరిపాలన, అభివృద్ధి, సామాజిక న్యాయం ప్రజా సంక్షేమం యొక్క విజయంగా నరేంద్ర మోడీ ప్రశంసించారు. ఈ అద్భుతమైన ప్రజా మద్దతు ప్రభుత్వానికి ప్రజలకు సేవ చేయడానికి మరియు బీహార్ పురోగతి కోసం నూతన సంకల్పంతో పనిచేయడానికి మరింత శక్తినిస్తుందని ఆయన నొక్కి చెప్పారు. బిహార్‌లో ఎన్డీఏకు లభించిన చారిత్రాత్మక ప్రజా మద్దతు డబుల్ ఇంజన్ ప్రభుత్వ అభివృద్ధి ఆధారిత ప్రజా సంక్షేమ విధానాలపై ప్రజల నుండి వచ్చిన నమ్మకానికి ముద్ర అని అన్నారు. బిహార్‌లోని ప్రజలు సుపరిపాలన, స్థిరత్వం మరియు ఎన్డీఏ అభివృద్ధి యొక్క కోణాలను స్వీకరించారని చెప్పడానికి ఈ అద్భుతమైన మెజారిటీ రుజువు అని ఆయన చెప్పారు.
నిమో అంటూ :
బీహార్ ఎన్నికలో నితీష్ కుమార్ మోడీ కాంబో సూపర్ సక్సెస్ అయింది అని అంటున్నారు. ఈ ఇద్దరు నేతలు అభివృద్ధి మీదనే ఎక్కువగా ఫోకస్ చేస్తారు. దాదాపుగా ఒకే ఏజ్ ఉన్నవారు. రాజకీయంగా ఎంతో అనుభవం కలిగిన వారు. ప్రసంగాలు ప్రజలను ఉద్దేశించి ఉత్తేజపూరితంగా చేయడంలో వీరు ముందుంటారు. అలాగే పెద్ద నేతలుగా జనం నాడ్ని పట్టే నేర్పు ఉన్న వారిగా వీరికి గుర్తింపు ఉంది. ఇదే బీహార్ ఎన్నికల్లో బలంగా పనిచేసింది అని అంటున్నారు.