ఐటీ నగరిలో ఎందుకీ దుస్థితి!

ఇక బెంగళూరు నగరంలో నాలుగు లోక్‌ సభ స్థానాలు ఉండగా ఓటర్లు ఓట్లేయడానికి ముందుకు రాలేదు. ఓట్లేయడానికి నగర ఓటర్లు అనాసక్తిని ప్రదర్శించారు.

Update: 2024-04-27 07:31 GMT

దేశంలో ప్రస్తుతం సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికే రెండు విడతల పోలింగ్‌ పూర్తయింది. అయితే గ్రామీణ ప్రాంతాల్లో నమోదైనంతగా పట్టణ, నగర ప్రాంతాల్లో పోలింగ్‌ నమోదు కాకపోవడం విస్మయపరుస్తోంది. విద్యావంతులు, ఉద్యోగులు, ధనికులు, మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి ప్రజలు ఉండే అర్బన్‌ ప్రాంతాల్లో ప్రతిసారి పోలింగ్‌ తక్కువ నమోదవుతోంది. దీనిపై ఎంతగా అవగాహన కార్యక్రమాలు కల్పిస్తున్నా, ప్రచారం చేస్తున్నా పట్టణ, నగర ప్రజల తీరులో మార్పు రావడం లేదు.

తాజాగా ఐటీ హబ్‌ ఇండియాగా, సిలికాన్‌ వ్యాలీ ఆఫ్‌ ఇండియాగా పేరు మోసిన బెంగళూరు నగరంలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. తాజాగా కర్ణాటకలోని మొత్తం 28 లోక్‌ సభ స్థానాల్లో 14 స్థానాలకు ఏప్రిల్‌ 26న పోలింగ్‌ నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా 69.23 శాతం పోలింగ్‌ మాత్రమే నమోదైంది.

ఇక బెంగళూరు నగరంలో నాలుగు లోక్‌ సభ స్థానాలు ఉండగా ఓటర్లు ఓట్లేయడానికి ముందుకు రాలేదు. ఓట్లేయడానికి నగర ఓటర్లు అనాసక్తిని ప్రదర్శించారు.

బెంగళూరు నగరంలో ఉన్న నాలుగు లోక్‌ సభ స్థానాల్లో మూడు పూర్తిగా అర్బన్‌ ప్రాంతంలోనే ఉండగా ఒకటి కొంత రూరల్‌ నేపథ్యంతో ఉంది. ఈ క్రమంలో మూడు అర్బన్‌ నియోజకవర్గాల్లో చాలా తక్కువ పోలింగ్‌ నమోదైంది. సగానికి సగం మంది ఓట్లేయడానికి ముందుకు రాలేదు.

బెంగళూర్‌ సౌత్, బెంగళూర్‌ సెంట్రల్, బెంగళూర్‌ నార్త్‌ స్థానాల్లో అతి తక్కువ ఓటింగ్‌ శాతం నమోదు కావడంపై విమర్శల జడివాన కురుస్తోంది. విద్యావంతులు, ఉద్యోగులు ఎక్కువగా ఉండే చోట ఇలాంటి పరిస్థితి ఏమిటనే ప్రశ్న ఉదయిస్తోంది.

ఐటీ ఉద్యోగులు.. తదితరులు తాము ఓట్లేయడంతోపాటు ఓటు హక్కుపై అవగాహన కల్పించాల్సి ఉండగా వారే ఓటు వేయడానికి ముఖం చాటేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

గత పరిణామాలతో ఎన్నికల సంఘం అధికారులు ఓటర్ల భాగస్వామ్యాన్ని పెంచేందుకు అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ వారి ఆశలు అడియాసలే అయ్యాయి. పోలింగ్‌ బూత్‌ లని గుర్తించడానికి ఓటర్‌ స్లిప్‌లపై క్యూఆర్‌ కోడ్‌ లను కూడా ముద్రించింది. ఓటరు హెల్ప్‌లైన్, ‘నో యువర్‌ క్యాండిడేట్‌’, క్యూలో ఉన్న ఓటర్ల సంఖ్య, పోలింగ్‌ బూత్‌ వద్ద అందుబాటులో ఉన్న పార్కింగ్‌ సౌకర్యాల గురించి వివరించడం.. ఇలా అనేక సౌకర్యాలను అందుబాటులోకి తెచ్చినా ఎన్నికల సంఘానికి నిరాశే ఎదురైంది.

బెంగళూరు సెంట్రల్‌ లో 52.81 శాతం, బెంగళూరు నార్త్‌ లో 54.42 శాతం, బెంగళూరు సౌత్‌ లో 53.15 శాతం మాత్రమే పోలింగ్‌ నమోదైంది. 2019 ఎన్నికల్లో పోల్చితే తాజాగా నమోదైన పోలింగ్‌ శాతాలు తక్కువ కావడం గమనార్హం.

మరోవైపు రూరల్‌ నేపథ్యం ఉన్న బెంగళూర్‌ రూరల్‌ నియోజకవర్గంలో మాత్రం 67.29 శాతం ఓటింగ్‌ నమోదు కావడం విశేషం. బెంగళూరు నగరం పరిధిలో నాలుగు లోక్‌ సభా స్థానాల పరిధిలో ప్రతిసారి తక్కువ పోలింగే నమోదవుతోంది. ఇప్పుడు ఓవైపు వేసవితో ఎండలు మండుతున్నాయి.. మరోవైపు నీటి ఎద్దటి అభ్యర్థులను బెంబేలెత్తిస్తున్నాయి. నీళ్లు దొరక్క వారాలు తరబడి స్నానాల మాటను కూడా బెంగళూరు వాసులు మర్చిపోయారు. బాత్‌ రూమ్‌ కు వెళ్లాలన్నా పేపర్లు, టాయిలెట్‌ పేపర్లే గతయ్యాయి. ఈ నేపథ్యంలో ఓటింగ్‌ మొగ్గు చూపలేదని అంటున్నారు.

అలాగే బెంగళూరులో వలస వచ్చినవారే ఎక్కువ. ఐటీ నిపుణులతోపాటు భవన నిర్మాణ రంగంలో పనిచేయడానికి వివిధ రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున ఇక్కడకు వస్తుంటారు. వీరంతా సహజంగానే ఓటు హక్కు స్థానికంగా లేకపోవడం, తదితర కారణాలతో ఓటింగుకు దూరంగా ఉంటున్నారని చెబుతున్నారు.

Tags:    

Similar News