బెంగళూరులో నెల ఖర్చు రూ.5.90 లక్షలు.. ఓ జంట నేర్పుతున్న ఆర్థిక పాఠం

ఎంత చెట్టుకు అంత గాలి అంటారు. బెంగళూరులో నివాసం కూడా అంతే మరీ.. లక్షల జీతాలు వచ్చినప్పుడు దాన్ని మెయింటేన్ చేయడానికి అంతే లక్షల ఖర్చు అవుతుంది.;

Update: 2025-09-05 17:30 GMT

ఎంత చెట్టుకు అంత గాలి అంటారు. బెంగళూరులో నివాసం కూడా అంతే మరీ.. లక్షల జీతాలు వచ్చినప్పుడు దాన్ని మెయింటేన్ చేయడానికి అంతే లక్షల ఖర్చు అవుతుంది. కొత్తగా పెళ్లైన ఓ జంట నెలకు తమకు రూ.5.90 లక్షల ఖర్చు అవుతుందని ప్రతీ ఖర్చును విడమరుస్తూ చెప్పిన వీడియో వైరల్ అవుతోంది. ఇంత నెల ఖర్చు ఓ సాధారణ మధ్యతరగతి కుటుంబం సంవత్సరం గడిపేస్తుంది. అందుకే అంటారు.. ఎంత సంపాదించినా దాన్ని సరిగ్గా వినియోగించుకునే సామర్థ్యం ఉంటేనే ఆ డబ్బు పదికాలాల పాటు మనుగడ సాధిస్తుంది. మనదగ్గర ఉంటుంది. ఈ జంట నేర్పుతున్న ఆర్థిక పాఠం ఇప్పుడు అందరికీ వర్తిస్తుంది.

బెంగళూరుకు చెందిన ప్రకృతి, ఆశీష్ దంపతులు తమ నెలవారీ ఖర్చులను వివరిస్తూ పోస్ట్ చేసిన ఒక వీడియో సోషల్ మీడియాలో కలకలం రేపింది. కేవలం ఒక్క నెలలో రూ. 5.90 లక్షలు ఖర్చు చేసినట్లు వారు ఈ వీడియోలో వెల్లడించారు. ఈ వీడియో ఇప్పటికే మిలియన్ల కొద్దీ వ్యూస్ సాధించి, నెటిజన్ల మధ్య తీవ్ర చర్చకు దారి తీసింది. చాలామంది ఈ స్థాయి ఖర్చులను చూసి ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

* ఖర్చుల బ్రేక్ డౌన్

దంపతులు ఆగస్టు నెలలో చేసిన ఖర్చుల వివరాలు ఇవీ..

* ప్రయాణాలు: రూ. 3.50 లక్షలు (రెండు అంతర్జాతీయ, రెండు దేశీయ ట్రిప్స్ కోసం ఫ్లైట్ టికెట్లు, హోటల్ బుకింగ్స్)

* అద్దె: రూ. 42,000

* ఫిట్నెస్ (వ్యక్తిగత శిక్షకులు, పిలేట్స్ క్లాసులు): రూ. 40,000

* కిరాణా: రూ. 20,000

* ఇంటి పనివాళ్లు, యుటిలిటీలు, ఓటీటీ సబ్ స్క్రిప్షన్లు: రూ. 10,000

* ఆన్ లైన్ ఫుడ్, బయట భోజనాలు, షాపింగ్: రూ. 13,000

* ఎస్ఐపీలలో పెట్టుబడి: రూ. 1 లక్ష

* ఇతర ఖర్చులు (క్యాబ్, ఇన్సూరెన్స్, గిఫ్టులు): రూ. 15,000

* నెటిజన్ల ప్రశ్నలు, స్పందనలు

ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోయారు. ముఖ్యంగా, దంపతులు ఇంత డబ్బు ఎలా సంపాదిస్తున్నారని, వారి ఉద్యోగ వివరాలు ఏమిటని ఎక్కువగా అడుగుతున్నారు. “మీ ఒక నెల ఖర్చు మా ఒక సంవత్సరం జీతంతో సమానం” అని ఒక నెటిజన్ చమత్కరించగా, మరికొందరు బెంగళూరులో నివసించడం ఎంత ఖర్చుతో కూడుకున్నదో ఈ వీడియోతో అర్థమైందని కామెంట్ చేశారు.

* ఆర్థిక ప్రణాళికపై దంపతుల స్పందన

తమ ఖర్చులను అదుపు చేసుకోవడం కష్టం అవుతోందని దంపతులు అంగీకరించారు. వారిద్దరిలో డబ్బు పట్ల వేర్వేరు వైఖరులు ఉండటం దీనికి ఒక కారణమని పేర్కొన్నారు. అయితే, ఇకపై ఆర్థిక నియంత్రణ కోసం ప్రతి నెల ఒక మీటింగ్ పెట్టుకొని, ఖర్చులను, పెట్టుబడులను ప్లాన్ చేసుకుంటున్నామని, ఇది ఇద్దరి మధ్య ఆర్థిక సామరస్యాన్ని పెంచుతుందని తెలిపారు. వారి ఈ ఆలోచనను కొందరు అభినందిస్తున్నారు.

డబ్బు సంపాదించడం ఎంత ముఖ్యమో, దాన్ని స్మార్ట్‌గా వినియోగించడం అంతకంటే ముఖ్యం. బెంగళూరు దంపతుల ఈ కథ మనందరికీ ఒక ఫైనాన్షియల్ అవగాహన లెసన్. ఖర్చులను అదుపులో పెట్టడం కష్టమే అయినా అసాధ్యం కాదు.

Tags:    

Similar News