సీబీఐ, ఆర్బీఐ అని దోచేశారు!.. కోట్ల దోపిడీలో కానిస్టేబుల్ అరెస్ట్!
బుధవారం మధ్యాహ్నం సీబీఐ, ఆర్బీఐ అధికారులమంటూ కారులో వచ్చిన గుర్తుతెలియని వ్యక్తులు ఏటీఎంలలో నగదు నింపే వాహనం నుంచి పట్టపగలే రూ.7.11 కోట్లు కొట్టేశారనే విషయం తీవ్ర సంచలనంగా మారిన సంగతి తెలిసిందే.;
బుధవారం మధ్యాహ్నం సీబీఐ, ఆర్బీఐ అధికారులమంటూ కారులో వచ్చిన గుర్తుతెలియని వ్యక్తులు ఏటీఎంలలో నగదు నింపే వాహనం నుంచి పట్టపగలే రూ.7.11 కోట్లు కొట్టేశారనే విషయం తీవ్ర సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. బెంగళూరులో అచ్చు సినిమా ఫక్కీలో జరిగిన ఈ ఘటన విషయంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేశారు!
అవును... నవంబర్ 19న జరిగిన ఏటీఎం నగదు వ్యాన్ దోపిడీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇందులో భాగంగా... ఈ దోపిడీ జరిగిన 50 గంటల్లోనే బెంగళూరు నగర పోలీసులు ఒక పోలీసులు కానిస్టేబుల్ తో సహా ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా దోపిడీకి గురైనట్లు చెబుతోన్న రూ.7.11 కోట్లలో రూ.5.7 కోట్లు స్వాధీనం చేసుకున్నారు!
జాతీయ మీడియాలో వస్తోన్న కథనాల ప్రకారం... అరెస్ట్ చేయబడిన నిందితులను పోలీస్ కానిస్టేబుల్ అన్నప్ప నాయక్, క్యాష్ వ్యాన్ ఫ్లీట్ ఇన్ ఛార్జ్ గోపాల్ ప్రసాద్, క్యాష్ ట్రాన్స్ పోర్ట్ కంపెనీ మాజీ ఉద్యోగి జేవియర్ గా గుర్తించారు. ఈ సందర్భంగా.. వీరితో పాటు మరో 30 మందికి పైగా వ్యక్తులు వివిధ హోదాల్లో ఈ కుట్రతో సంబంధం కలిగి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.
ప్రధానంగా ఇప్పటికే అరెస్ట్ కాబడిన ముగ్గురు వ్యక్తులూ.. సుమారు మూడు నెలలుగా ఈ దోపిడీకి ప్లాన్ వేశారని అధికారులు నిర్ధారించినట్లు తెలుస్తోంది. ఈ దోపిడీ ఘటన తర్వాత.. కాల్ రికార్డులు, స్థానిక నిఘా వర్గాల సమాచారం ఆధారంగా సుమారు 30 మందిని ప్రశ్నించిన పోలీసులు.. ఫైనల్ గా ముగ్గురు ప్రధాన నిందితులను అరెస్ట్ చేశారు! వారి నుంచి రూ.5.7 కోట్లు స్వాధీనం చేసుకున్నారు.
కాగా... దొంగతనం జరిగిన రోజు నిందితులు తమను తాము ఆర్బీఐ, సీబీఐ అధికారులుగా పేర్కొంటూ.. జేపీ నగర్ లోని ఒక ప్రైవేటు బ్యాంక్ నుంచి ఏటీఎంలలో నగదు నింపడానికి వెళ్తోన్న సీఎంఎస్ ఇన్ఫో సిస్టమ్స్ లిమిటెడ్ క్యాష్ వ్యాన్ ను అడ్డగించారు! ఈ సందర్భంగా.. డాక్యుమెంట్లు ధృవీకరించాల్సిన అవసరం ఉందంటూ వాహన సిబ్బందిని, నగదు పెట్టేలతో పాటు వారి కారులోకి బలవంతంగా ఎక్కించారు.
ఆ తర్వాత వారి వాహనం డైరీ సర్కిల్ వైపు మళ్లింది.. ఆ ప్రాంతంలో వాహన సిబ్బందిని అక్కడే వదిలేసి, నగదుతో పాటు వెళ్లిపోయారు. ఈ సమయంలో విషయం తెలుసుకొన్న పోలీసులు.. మాన్యువల్ నిఘా, గ్రౌండ్ లెవెల్ ఇంటెలిజెన్స్ తో సహా ప్రత్యామ్నాయ ఆధారాలను ఉపయోగించి సుమారు 200 మందిపై పోలీసులు రంగంలోకి దిగారు.
ఈ సందర్భంగా స్పందించిన బెంగళూరు పోలీస్ కమీషనర్ సీమంత్ కుమార్ సింగ్... నగరంలో జరిగిన రూ.7.11 కోట్ల దోపిడీ కేసులో ఒక పోలీస్ కానిస్టేబుల్ సహా ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. ఈ కేసు దర్యాప్తు కోసం 200 మంది అధికారులు, సిబ్బందిని నియమించినట్లు వెల్లడించారు. మిగిలిన మొత్తాన్ని రికవరీ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు.