విమానంలో టెన్షన్... కత్తితో విమాన హైజాక్‌కు యత్నం.. కట్ చేస్తే

అంత సేపు విమాన ప్రయాణం ప్రశాంతంగా కొనసాగుతోంది. ఇంతలో ఒక్క సారిగా ఓ వ్యక్తి కత్తితో నిలబడి అందరినీ బెదిరిస్తూ విమానం హైజాగ్ చేస్తున్నట్లు బెదిరించాడు.;

Update: 2025-04-18 07:08 GMT

అంత సేపు విమాన ప్రయాణం ప్రశాంతంగా కొనసాగుతోంది. ఇంతలో ఒక్క సారిగా ఓ వ్యక్తి కత్తితో నిలబడి అందరినీ బెదిరిస్తూ విమానం హైజాగ్ చేస్తున్నట్లు బెదిరించాడు. ఇంతలోనే హీరోలా మరో ప్రయాణికుడు లేచి దుండగుడిని క్షణాల్లో మట్టుబెట్టాడు. బెలీజ్‌లో జరిగిన ఈ ఘటన సినిమాను తలపించే విధంగా ఉంది. ఇంతకీ అసలు ఏం జరిగింది ? ఆ హీరో ఎవరు అన్న సంగతులను ఈ కథనంలో తెలుసుకుందాం.

సెంట్రల్ అమెరికాలోని బెలీజ్‌లో గురువారం ఓ విమానంలో ఊహించని ఘటన చోటు చేసుకుంది. అప్పటి వరకు ప్రశాంతంగా సాగుతున్న విమాన ప్రయాణంలో ఒక్కసారిగా కుదుపు మొదలైంది. ఉన్నట్లుండి విమానంలో భయానక పరిస్థితి నెలకొంది. ఒక దుండగుడు అందరినీ కత్తితో బెదిరిస్తూ విమానాన్ని తన ఆధీనంలోనికి తీసుకునేందుకు ప్రయత్నించగా, అక్కడే ఉన్న మరో ప్రయాణికుడు ధైర్యం చేసి తన లైసెన్స్ డ్ తుపాకీతో కాల్పులు జరిపి అతడిని హతమార్చాడు. దీంతో పెను ప్రమాదం తప్పింది. ప్రయాణికులంతా ఊపిరి పీల్చుకున్నారు.

ట్రాఫిక్ ఎయిర్‌కు చెందిన ఒక చిన్న విమానం కొరొజాల్ నుంచి శాన్ పెడ్రోకు బయలుదేరిన కాసేపటికే ఈ సినిమాటిక్ సీన్ చోటు చేసుకుంది. విమానం గాల్లో ఉండగా, అకిన్యేలా సావా టేలర్ అనే అమెరికాకు చెందిన వ్యక్తి హఠాత్తుగా తన దగ్గరున్న కత్తిని బయటకు తీసి సిబ్బందిని బెదిరించడం మొదలు పెట్టాడు. విమానాన్ని తమ ఆధీనంలోకి తీసుకుని దేశం వెలుపలికి తీసుకెళ్లాలని డిమాండ్ చేశాడు. ఈ క్రమంలో కొంతమంది ప్రయాణికులను కూడా గాయపరిచాడు.

విమానంలో మొత్తం 14మంది ప్రయాణికులు, మరో ఇద్దరు సిబ్బంది ఉన్నారు. ఈ ఊహించని దాడితో అందరూ ఒక్కసారిగా భయంతో వణికిపోయారు. అయితే, ఆ సమయంలోనే ఒక రియల్ హీరోలా ఒక ప్రయాణికుడు ముందుకు దూకాడు. తన వద్ద ఉన్న లైసెన్స్‌డ్ తుపాకీని తీసి దుండగుడిని అడ్డుకునే ప్రయత్నం చేశాడు. కానీ దుండగుడి ప్రతిఘటన తీవ్రంగా ఉండటంతో అతడు కాల్పులు జరపాల్సి వచ్చింది. ఈ కాల్పులలో దుండగుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.

బెలీజ్ అధికారులు ఈ ఘటనను ధృవీకరించారు. హైజాక్‌కు ప్రయత్నించిన టేలర్ కత్తిని విమానంలోకి ఎలా తీసుకువచ్చాడనే దాని మీద పోలీసులు దర్యాప్తు నిర్వహిస్తున్నారు.టేలర్‌పై కాల్పులు జరిపిన ప్రయాణికుడిని మాత్రం అందరూ ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. అతని ధైర్యసాహసాల వల్లే పెను ప్రమాదం తప్పిందని ప్రయాణికులు చెబుతున్నారు. ఈ ఘటన కారణంగా విమానం గాల్లోనే దాదాపు రెండు గంటల పాటు చక్కర్లు కొట్టింది. ఆ తర్వాత సురక్షితంగా ల్యాండ్ కావడంతో ప్రయాణికులందరూ హమ్మయ్యా అనుకున్నారు.

Tags:    

Similar News