బంగాళాఖాతంలోనే తుఫాన్లు ఎక్కువా? అతిపెద్ద నష్టం కలిగించిన తుఫాన్ ఏది?

భూమిపై జరిగే సహజ ప్రక్రియల్లో ప్రకృతి మార్పులు ఒకటి. ఇందులో భాగంగానే వర్షాకాలంలో తుఫాన్లు, వాయుగుండాలు వంటి విపత్తులు వస్తుంటాయి.;

Update: 2025-10-29 05:51 GMT

భూమిపై జరిగే సహజ ప్రక్రియల్లో ప్రకృతి మార్పులు ఒకటి. ఇందులో భాగంగానే వర్షాకాలంలో తుఫాన్లు, వాయుగుండాలు వంటి విపత్తులు వస్తుంటాయి. అయితే ఈ ప్రపంచంలో ఉన్న సప్త సముద్రాల్లో కెల్లా అత్యధిక తుఫానులు ఎందులో వస్తాయి? హిందూ మహాసముద్రంలో ఏ ప్రాంతంలో ఎక్కువ విపత్తులు ఏర్పడుతుంటాయనేది అందరూ తెలుసుకోవాల్సిన ఆసక్తికర అంశం. తాజా బంగాళాఖాతంలో ఉష్ణోగ్రతలు వేడెక్కడంతో ఏర్పడిన అల్పపీడనం తుఫానుగా మారి ఏపీతోపాటు ఆరు రాష్ట్రాలను వణికించింది. ఈ పరిస్థితులు తుఫాన్లపై ఆసక్తికర చర్చ జరుగుతోంది.

ప్రపంచవ్యాప్తంగా పశ్చిమ పసిఫిక్ మహా సముద్రంలో అత్యధిక సంఖ్యలో తుఫాన్లు ఏర్పడుతుంటాయని నిపుణులు చెబుతున్నారు. అత్యంత శక్తివంతమైన ఉష్ణమండల తుఫాన్లు (టైఫూనులు) ఈ సముద్రంలో ఉద్భవిస్తాయి. ఇక హిందూ మహాసముద్రం పరిధిలో ఉన్న మన దేశంలో ఎక్కువగా బంగాళాఖాతంలోనే తుఫాన్లు ఏర్పడతాయి. మన దేశంలోని పశ్చిమ ప్రాంతంలో ఉన్న అరేబియా సముద్రంతో పోల్చుకుంటే ఎక్కువ తుఫాన్లు, తీవ్ర నష్టాలు బంగాళాఖాతం వల్లే ఉంటున్నట్లు చరిత్ర చెబుతోంది. దీనికి కారణం బంగాళాఖాతంలో తుఫానులు ఏర్పడటానికి అనువైన వెచ్చని నీరు, గాలి ప్రవాహమే అంటున్నారు.

హిందూ మహాసముద్రంలోని అరేబియా సంద్రంతో పోలిస్తే బంగాళాఖాతంలో చాలా ఎక్కువ తుఫాన్లు ఏర్పడతాయని చెబుతున్నారు. ఇవి మరింత తీవ్రంగా ఉంటాయని రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. అందుబాటులో ఉన్న డేటా ప్రకారం, అరేబియా సముద్రంలో సంభవించిన వాటి కంటే 86% తుఫాన్లు, 77% తీవ్రమైన తుఫాన్లు బంగాళాఖాతంలోనే ఏర్పడ్డాయి. తుఫానులు ఏర్పడటానికి అవసరమైన వెచ్చని వాతావరణం, గాలి ప్రవాహం అరేబియా సముద్రం కంటే బంగాళాఖాతంలో ఎక్కువగా ఉండటమే దీనికి ప్రధాన కారణంగా వివరిస్తున్నారు. అదేవిధంగా చరిత్రలో నమోదైన అత్యంత ఘోరమైన 36 తుఫానులలో 26 బంగాళాఖాతంలోనే సంభవించాయని లెక్కలు చెబుతున్నాయి.

ఇక బంగాళాఖాతం తీరంలో మన దేశంతోపాటు శ్రీలంక, మయన్మార్, బంగ్లాదేశ్, ఇండోనేషియా దేశాలు ఉన్నాయి. ఈ సముద్రంలో ఉద్భవించిన తుఫాన్ల వల్ల ఎక్కువగా బంగ్లాదేశ్ నష్టపోతున్నట్లు రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. మన దేశంలో బంగాళాఖాతం తీర ప్రాంతంలో పశ్చిమబెంగాల్, ఒడిశా, ఏపీ, తమిళనాడు రాష్ట్రాలు ఉన్నాయి. ఈ నాలుగు రాష్ట్రాల్లో ఎక్కువ నష్టం ఒడిశా, పశ్చిమబెంగాల్ ఎదుర్కొంటున్నట్లు చెబుతున్నారు. ఏటా బంగాళాఖాతంలో ఏర్పడుతున్న తుఫాన్ల వల్ల సాధారణ జనజీవనానికి తీవ్ర నష్టం వాటిల్లుతోంది. అయితే ఈ తుఫానుల వల్ల అత్యంత విధ్వంసం 1970లో జరిగినట్లు రికార్డులు చెబుతున్నాయి.

1970 నవంబరు 12న ఏర్పడిన భోలా తుఫాను వల్ల దాదాపు మూడు నుంచి ఐదు లక్షల మంది మరణించినట్లు సమాచారం. అప్పట్లో ఈ తుపాను వల్ల బంగ్లాదేశ్ తోపాటు మనదేశంలోని పశ్చిమ బెంగాల్ లోని కొన్ని ప్రాంతాలు తీవరంగా ప్రభావితమయ్యాయి. గంగా డెల్టా ప్రాంతంలోని లోతట్టు దీవులు అన్ని ముంపునకు లోనయ్యాయి. దీంతో భారీ ప్రాణనష్టం జరిగిందని చెబుతున్నారు. ప్రపంచ చరిత్రలో తుఫాను వల్ల వాటిల్లిన నష్టాల్లో ఇదే అత్యంత ఘోరమైన ప్రకృతి విపత్తుగా నిలిచింది. ఇక 1999లో ఒడిశాను అతలాకుతలం చేసిన సూపర్ సైక్లోన్ కూడా తీవ్ర నష్టం కలిగించింది. ఈ తుఫాను వల్ల సుమారు పది వేల మంది మరణించారు. అంతేస్థాయిలో ఆస్తినష్టం సంభవించింది. అదేవిధంగా 2014లో హుదు హుద్ తుఫాన్ వల్ల ఏపీలో సుమారు 21 వేల కోట్ల ఆస్తినష్టం సంభవించిందని రికార్డులు చెబుతున్నాయి.

Tags:    

Similar News