రాజమౌళి మాటలపై బండి సంజయ్ రియాక్షన్!
మాధవీలత, వానరసేన వంటి వారు రాజమౌళిపై విమర్శలు గుప్పిస్తుంటే, కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ మాత్రం దీనిపై చాలా హుందాగా స్పందించారు.;
'వారణాసి' ఈవెంట్ లో రాజమౌళి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన విషయం తెలిసిందే. టెక్నికల్ గ్లిచ్ కారణంగా అసహనానికి గురైన ఆయన, "దేవుడు లేడు, ఇదేనా నడిపించేది?" అంటూ చేసిన కామెంట్స్ పై హిందూ సంఘాల నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. మాధవీలత, వానరసేన వంటి వారు రాజమౌళిపై విమర్శలు గుప్పిస్తుంటే, కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ మాత్రం దీనిపై చాలా హుందాగా స్పందించారు.
రాజమౌళి వ్యాఖ్యలపై మీడియా అడిగిన ప్రశ్నకు బండి సంజయ్ సమాధానమిస్తూ, "ఎవరి ఆలోచన వాళ్లది, ఎవరి నమ్మకం వాళ్లది" అని వ్యాఖ్యానించారు. రాజమౌళిని విమర్శించడానికి బదులుగా, ఆయన పట్ల సానుకూల దృక్పథాన్ని ప్రదర్శించారు. ఇలాంటి సున్నితమైన అంశాలపై రాజకీయ నాయకులు సాధారణంగా ఘాటుగా రియాక్ట్ అవుతుంటారు, కానీ బండి సంజయ్ మాత్రం చాలా మెచ్యూర్డ్ గా స్పందించడం అందరినీ ఆశ్చర్యపరిచింది.
"భవిష్యత్తులో దేవుడు కరుణించి, ఆయనే దేవుడిని నమ్మే విధంగా ఆ దేవుడి కరుణాకటాక్షాలు రాజమౌళిపై ఉండాలని కోరుకుంటున్నాను" అని సంజయ్ అన్నారు. నాస్తికత్వం అనేది రాజమౌళి వ్యక్తిగత అభిప్రాయం కావొచ్చు, కానీ ఏదో ఒక రోజు ఆయన కూడా దైవ శక్తిని నమ్ముతారనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.
అంతేకాకుండా, "రాజమౌళి గారు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో సక్సెస్ అవ్వాలి. ఆ అమ్మవారి ఆశీర్వాదంతో ఆయన కెరీర్ లో ఇంకా ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను" అని బండి సంజయ్ ఆశీర్వదించారు. ఒకవైపు హిందూ సంఘాలు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తుంటే, బండి సంజయ్ మాత్రం ఇలా పాజిటివ్ గా స్పందించడం చర్చనీయాంశమైంది.
రాజకీయాల్లో, సినిమాల్లో ఇలాంటి కాంట్రవర్సీలు సహజం. అయితే వాటిని డీల్ చేసే విధానంలోనే నాయకుడి పరిపక్వత తెలుస్తుంది. బండి సంజయ్ వ్యాఖ్యలు చూస్తుంటే, ఆయన ఈ వివాదాన్ని పెద్దది చేయడానికి ఇష్టపడలేదని అర్థమవుతోంది. రాజమౌళిని ఒక గొప్ప దర్శకుడిగా గౌరవిస్తూనే, ఆయన వ్యక్తిగత నమ్మకాలను ప్రశ్నించకుండా దేవుడికే వదిలేశారు. బండి సంజయ్ రియాక్షన్ తో ఈ వివాదానికి కొంతమేర బ్రేక్ పడే అవకాశం ఉంది. హిందూ సంఘాలు కూడా ఆయన మాటలను పరిగణలోకి తీసుకుని శాంతిస్తాయో లేదో చూడాలి.