పులివెందులపై బాలయ్య రియాక్షన్.. ఎంత మాటో తెలుసా?
చాలాకాలం తర్వాత ప్రజలు ధైర్యంగా వచ్చి ఓటేశారని చెప్పారు. గతంలో నామినేషన్ వేసే పరిస్థితి కూడా లేదని గుర్తు చేశారు.;
పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నిక ఫలితంపై టీడీపీ నేత, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వరుసగా మూడు సార్లు ఎమ్మెల్యే అయినా, టీడీపీలో మాస్ ఇమేజ్ లీడరు అయినప్పటికీ సహజంగా బాలయ్య పెద్దగా రాజకీయ వ్యాఖ్యలు చేయరు. రొటీన్ పాలిటిక్స్ కు దూరంగా ఉండే బాలయ్య ఎక్కువగా తన సొంత నియోజకవర్గ రాజకీయాలకే పరిమితమవుతారని చెబుతారు. కానీ, పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నిక నేపథ్యంలో ఆయన ప్రత్యేకంగా పొలికల్ కామెంట్స్ చేయడం హాట్ టాపిక్ అవుతోంది.
పులివెందులలో టీడీపీ విజయం సాధించడంతో అక్కడి ప్రజలకు నిజమైన స్వాతంత్ర్యం వచ్చిందని హాట్ కామెంట్ చేశారు బాలయ్య. పులివెందుల గెలుపుపై బాలయ్య ఆనందం వ్యక్తం చేశారు. గత మూడు దశాబ్దాలుగా ఎన్నికలు జరిగిన పరిస్థితి లేదని, కానీ తొలిసారిగా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నిక జరిగిందని బాలయ్య వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నిక జరగలేదన్న వైసీపీ విమర్శలపై స్పందిస్తూ టీడీపీ పాలనలో ప్రజాస్వామ్య యుతంగా ఎన్నిక జరిగిందని అన్నారు.
చాలాకాలం తర్వాత ప్రజలు ధైర్యంగా వచ్చి ఓటేశారని చెప్పారు. గతంలో నామినేషన్ వేసే పరిస్థితి కూడా లేదని గుర్తు చేశారు. పులివెందుల వాసులు స్వేచ్ఛావాయువులు పీల్చుకుంటున్నారని వ్యాఖ్యానించారు. 11 మంది వచ్చి ధైర్యంగా నామినేషన్ వేయడాన్ని నిజమైన ప్రజాస్వామ్యంగా ఆయన అభివర్ణించారు. కాగా, పులివెందుల ఓట్ల లెక్కింపు సందర్భంగా పలు ఆసక్తికర విశేషాలు బయటకు వచ్చాయి. ‘‘30 ఏళ్ల తర్వాత ఓటు వేశాను. అందరికీ దండాలు’’ అంటూ ఓ ఓటరు చిన్నకాగితంపై రాశాడు. ఈ స్లిప్పు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.