జనసేన ఎమ్మెల్యే కుమారుడి వివాహ వేడుకకు బాలయ్య
నందమూరి బాలక్రిష్ణ. ఈ పేరు గత నెల నుంచి ఇప్పటికే సోషల్ మీడియాలో మారుమోగుతూనే ఉంది దానికి కారణం అసెంబ్లీ ఎపిసోడ్.;
నందమూరి బాలక్రిష్ణ. ఈ పేరు గత నెల నుంచి ఇప్పటికే సోషల్ మీడియాలో మారుమోగుతూనే ఉంది దానికి కారణం అసెంబ్లీ ఎపిసోడ్. మాట్లాడింది గట్టిగా అయిదు నిమిషాలు కూడా లేదు కానీ బాలయ్య రాజకీయ ప్రకంపనలే సృష్టించారు. ఆ మరునాడు ఏమీ జరగనట్లుగా ఆయన విజయవాడ ఉత్సవాలకు హాజరయ్యారు. అక్కడ కూడా ఉత్సవాల గురించి గొప్పగా చెప్పి జనాలను మెప్పించారు. ఆ తరువాత బాలయ్య వైపు నుంచి సౌండ్ లేదు. దాంతో రకరకాలైన చర్చలు దీని మీద నడిచాయి.
ప్రత్యేక ఆకర్షణగా :
మళ్ళీ ఇన్ని రోజుల తరువాత బాలయ్య మెరిసారు. అది కూడా ఒక వివాహ వేడుకలో. జనసేన పార్టీకి చెందిన ఎమ్మెల్యే కుమారుడి వివాహ వేడుకకు బాలయ్య రావడం విశేషం అయితే ఆయనే అక్కడ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారారు పైగా తన మేనల్లుడు మంత్రి లోకేష్ తో ఆయన వచ్చారు. మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ లో జరిగిన ఈ వేడుకకు పలువురు రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా వచ్చారు అయితే బాలయ్య లోకేష్ కలసి రావడం ఒక విశేషంగా చూడాలని అంటున్నారు.
వివాదాలకు ఫుల్ స్టాప్ :
బాలయ్య ఆగ్రహంగా ఉన్నారని ఆయన కూడా ఒక బహిరంగ లేఖ రాస్తారని ఆ మధ్యన ప్రచారం అయితే పెద్ద ఎత్తున సాగింది. అంతే కాదు బాలయ్య టీడీపీ అధినాయకత్వం మీద మండిపడుతున్నారని కూడా మరో ప్రచారం కూడా జరిగింది అయితే బాలయ్య ప్రసన్న వదనంతో తమ మేనల్లుడుతో రావడం యధా ప్రకారం తనదైన జోష్ తో సందడి చేయడంతో ఆ వివాదానికి ఫుల్ స్టాప్ పడిందని అంతా సర్దుకున్నారని అంటున్నారు. పైగా బాలయ్య కూడా హుషార్ చేస్తూ కనిపించారు.
వ్యూహాత్మకంగానేనా :
జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీ గోదావరి జిల్లాలో ప్రముఖ నాయకుడే. అయితే ఆయన మంత్రి కాదు, అయినా ఆయనకు రాజకీయంగా అందరితో మంచి సంబంధాలు ఉన్నాయి. ఒక బలమైన సామాజిక వర్గానికి చెందిన నానాజీ కుమారుడి వివాహ వేదికకు వచ్చి బాలయ్య నవ దంపతులను ఆశీర్వదించడం యధాలాపంగానే జరిగింది అని అంటున్నా బాలయ్య చేసిన కొన్ని వ్యాఖ్యలతో ఒక బలమైన సామాజిక వర్గానికి ఇబ్బంది జరిగిందని వారు అసంతృప్తిగా ఉన్నారని ప్రచారం సాగుతున్న క్రమంలో బాలయ్య రావడం తన నిండు దీవెనలు ఇవ్వడం విశేషంగానే చూస్తున్నారు. మొత్తానికి టీ కప్పులో తుఫాను మాదిరిగా అసెంబ్లీ ఎపిసోడ్ అయితే ముగిసింది అని అంటున్నారు.