అవంతికి రూట్ క్లియర్ కావడం లేదా ?

విశాఖ మేయర్ పదవి కూటమికి దక్కడంలో తులసీదళం మాదిరిగా మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ కుమార్తె ఆరవ వార్డు జీవీఎంసీ కార్పొరేటర్ లక్ష్మీ ప్రియాంక ఓటు పనిచేసింది.;

Update: 2025-04-20 20:30 GMT

విశాఖ మేయర్ పదవి కూటమికి దక్కడంలో తులసీదళం మాదిరిగా మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ కుమార్తె ఆరవ వార్డు జీవీఎంసీ కార్పొరేటర్ లక్ష్మీ ప్రియాంక ఓటు పనిచేసింది. 74 మ్యాజిక్ ఫిగర్ ని చేరుకోవడానికి కూటమికి ఆ విధంగా అవంతి కుమార్తె ఓటు ఆక్సిజన్ గా ఉంది.

అయితే కూటమికి చాలా మంది వైసీపీ వారు ఓటు చేశారు. మాజీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రుల వారసులూ ఓటు చేశారు. ఇపుడు వారందరినీ తెచ్చి కూటమి పార్టీలు చేర్చుకుంటాయా అంటే అదేమీ లేదు అని కూటమి వైపు పార్టీల నాయకులు అంటున్నారు

వైసీపీ ఏలుబడిలో విశాఖ అభివృద్ధి చెందలేదని భావించే వారు మద్దతు ఇచ్చారు తప్ప అందులో ఎలాంటి రాజకీయ ప్రాధాన్యతలు లేవని అంటున్నారు. ఇక మాజీ మంత్రి వైసీపీలో అయిదేళ్ళ పాటు అధికారం అందుకున్న అవంతి శ్రీనివాసరావు గత డిసెంబర్ లో ఆ పార్టీకి రాజీనామా చేశారు.

ఇపుడు ఆయన కూటమి వైపు చూస్తున్నారు అని ప్రచారం సాగుతోంది. అయితే ఆయనకు కూటమిలోకి ఎంట్రీ ఉంటుందా అన్నదే విశాఖలో చర్చగా ఉంది. అవంతి శ్రీనివాసరావు తన 15 ఏళ్ళ రాజకీయ జీవితంలో నాలుగు పార్టీలు మారారని అంటున్నారు. ఆయన ఏ పార్టీకి గాలి ఉంటే ఆ వైపుగా మారే పొద్దు తిరుగుడు పువ్వు లాంటి వారు అని అంటున్నారు.

ఆయనను రాజకీయంగా ప్రవేశం కల్పించి ఎమ్మెల్యేని చేసింది ప్రజారాజ్యం పార్టీ అని గుర్తు చేస్తున్నారు. అయితే ఆయన ప్రజారాజ్యం కాంగ్రెస్ లో విలీనం అయినపుడు అందులో కొన్నాళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నారు. 2014లో ఆయన టీడీపీలో చేరారు. అలా అనకాపల్లి ఎంపీ అయ్యారు. తిరిగి అయిదేళ్ళు గడవకుండానే టీడీపీని వీడి 2019 ఎన్నికల వేళకు వైసీపీలో చేరారు. వైసీపీలో మూడేళ్ళ పాటు మంత్రిగా ఉన్నారు. అలా మంత్రిగా తన కోరికను తీర్చుకున్నారు. వైసీపీ నుంచి రెండు ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ ని సంపాదించారు. వైసీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడిగా వ్యవహరించారు.

ఇక వైసీపీ ఓటమి తరువాత కూడా ఆరు నెలల పాటు అందులో ఉన్నారు. గత డిసెంబర్ లో ఆ పార్టీకి రాజీనామా చేసిన అవంతి కూటమి వైపు చూస్తున్నారు. అయితే ఆయన రాజకీయ నిలకడ మీదనే కూటమి పార్టీలు సందేహం వ్యక్తం చేస్తున్నాయి. అధికారంలో ఉండే పార్టీలోనే ఆయన ఉంటారని గత పరిణామాలను గుర్తు చేస్తున్నారు. ఆయన మొత్తం రాజకీయ జీవితంలో ఎపుడూ విపక్ష ఎమ్మెల్యేగా లేరని అంటున్నారు.

ఇక ఆయన వైసీపీ మంత్రిగా ఎమ్మెల్యేగా ఉన్నపుడు చంద్రబాబు లోకేష్ పవన్ ల మీద చేసిన కామెంట్స్ ని ఆయా పార్టీల నాయకులు మళ్ళీ బయటపెడుతున్నారు. అలాంటి వారిని చేర్చుకోవద్దని తమ పార్టీ పెద్దలను వారు కోరుతున్నారుట. ఇక అవంతి విషయానికి వస్తే బలమైన సామాజిక వర్గానికి చెందిన వారు, అంగబలం అర్ధబలం దండీగా ఉన్నారు.

అయితే రాజకీయాల్లో ఇవొక్కటే కాదని వీటితో పాటుగా నిలకడ తనం కూడా అవసరం అని అంటున్నారు. చంద్రబాబు టీడీపీలో ఎంపీగా చేసినా 2019లో ఆయన పార్టీ మారడాన్ని తమ్ముళ్ళు గుర్తు చేస్తున్నారు. ఇక పవన్ కళ్యాణ్ అయితే వైసీపీ మంత్రిగా అవంతి ఉన్నపుడు బంతి పూబంతి చామంతి అని కామెంట్స్ చేసిన సంగతిని గుర్తు చేస్తున్నారు.

మొత్తానికి అయితే అవంతి శ్రీనివాస్ ని జనసేనలో కానీ టీడీపీలో కానీ చేర్చుకోవద్దని పార్టీ నేతలు కోరుతున్నారుట. అయితే అవంతి జనసేనలో చేరుతారు అని ఆయన అనుచరులు చెబుతున్నారు. మరో వైపు అవంతి కూడా తన రాజకీయ ఫ్యూచర్ మీద ధీమాగానే ఉన్నారుట. అసెంబ్లీ నియోజకవర్గాలు పెరుగుతాయని అలా చాన్స్ వస్తుందని ఆయన భావిస్తున్నారుట. ఏదో ఒక పార్టీ నుంచి ఆహ్వానం వస్తుందని ఆయన ఆశతో ఉన్నారుట. ఏది ఏమైనా అవంతి కుమార్తె కూటమికి ఓటు వేయడంతో ఈ మాజీ మంత్రి అడుగులు ఆ వైపుగానే సాగుతున్నాయని అంటున్నారు. ఏమి జరుగుతుందో చూడాల్సి ఉంది.

Tags:    

Similar News