అవంతికి కూటమిలో ఆహ్వానం ?
మాజీ మంత్రి వైసీపీలో మూడేళ్ళ పాటు పర్యాటక శాఖను చూసిన అవంతి శ్రీనివాసరావు గత ఏడాది డిసెంబర్ లో వైసీపీకి రాజీనామా చేసి రాజకీయంగా కొంత విరామం కోరుకున్నారు.;
మాజీ మంత్రి వైసీపీలో మూడేళ్ళ పాటు పర్యాటక శాఖను చూసిన అవంతి శ్రీనివాసరావు గత ఏడాది డిసెంబర్ లో వైసీపీకి రాజీనామా చేసి రాజకీయంగా కొంత విరామం కోరుకున్నారు. అయితే ఏడాదికి దగ్గర పడుతున్న వేళ ఆయన రాజకీయం ఏమిటి అన్నది చర్చకు వస్తోంది. ఆయన కుదిరితే టీడీపీ లేకపోతే జనసేనలోకి అని ఆలోచిస్తున్నారు అని అంటున్నారు. అయితే టీడీపీలో ఆయన రీ ఎంట్రీకి ఇబ్బందులు ఉన్నాయని జనసేనలో అయితే ఒకనాటి ప్రజారాజ్యం ఎమ్మెల్యేగా వెళ్లవచ్చు కానీ పవన్ కళ్యాణ్ నుంచే గ్రీన్ సిగ్నల్ రావాలని అంటున్నారు.
రాజకీయంగా కలివిడిగానే :
ఇదిలా ఉంటే ఇటీవల తన కుమారుడికి వివాహం చేశారు ఈ మాజీ మంత్రి. దానికి అన్ని పార్టీల నుంచి నాయకులు వచ్చారు. అలా అందరితోనూ రిలేషన్స్ ని ఆయన బాగానే మెయిన్ టెయిన్ చేస్తున్నారు అని అంటున్నారు. అయితే ఈ రిలేషన్స్ ఏవి వర్కౌట్ అవుతాయో ఆయన రాజకీయం ఏ విధమైన మలుపు తిరుగుతుందో అన్నది అయితే చర్చగానే ఉంది.
సీటు దగ్గరే పేచీ :
తెలుగుదేశం అయినా జనసేన అయినా భీమిలీ సీటు దగ్గరే పేచీ ఉందని అంటున్నారు. మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు భీమిలీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన టీడీపీలో సీనియర్ గా ఉన్నారు ఆయన టీడీపీ అధినాయకత్వంల్తో బాగానే సత్సంబంధాలు కొనసాగిస్తున్నారు. ఆయన వచ్చే ఎన్నికల్లో భీమిలీ టికెట్ ని తన కుమారుడికి దక్కేలా ప్రయత్నాలు చేసుకుంటున్నారు అని అంటున్నారు. దాంతో టీడీపీలో అవంతికి ఆ విధంగా బ్రేకులు ఉన్నాయని అంటున్నారు ఇక జనసేన విషయం తీసుకుంటే ఆ పార్టీలో యువ నేత ఒకరు ఉన్నారు. ఆయన 2019లో తొలిసారి పోటీ చేసి పాతిక వేల ఓట్లను సాధించారు. ఆయన పవన్ కి అత్యంత సన్నిహితుడు. దాంతో ఆయనను కాదని వేరే వారిని తీసుకుని వచ్చేది ఉండదని అంటున్నారు.
దాని మీదనే ఆశలు :
ఇక అసెంబ్లీ సీట్ల పునర్ విభజన మీదనే అవంతి ఆశలు పెట్టుకున్నారా అని అంటున్నారు. 2029 ఎన్నికల నాటికి సీట్లు పెరిగితే పెద్ద నియోజకవర్గం అయిన భీమిలీ రెండుగా మారుతుంది. అపుడు మరో నియోజకవర్గం రావచ్చు. అది కనుక జరిగితే ఆయన ఆశలు నెరవేరుతాయని అంటున్నారు అయితే ఒకటికి రెండు సీట్లు పెరిగితే ఒకటి టీడీపీ మరొకటి జనసేన పంచుకోవచ్చు అని కూడా అంటున్నారు. దాంతో అవంతికి ఆ విధంగానూ కలసి వచ్చేది ఏ మేరకు ఉంటుంది అని కూడా అంటున్నారు. దాంతో ఆయన రాజకీయంగా మౌనంగా ఉంటూ అన్ని గమనిస్తున్నారు అని అంటున్నారు. 2029 ఎన్నికలకు ఇంకా సమయం ఉంది కాబట్టి ఆనాటికి రాజకీయంగా మార్పులు రావచ్చు అన్న ఆశలు ఉన్నాయని చెబుతున్నారు. అప్పటికి గెలిచే పార్టీ ఏదో చూసుకుని తన రాజకీయానికి పదును పెట్టవచ్చు అని అవంతి అనుచరులు అంటున్నారు. చూడాలి మరి ఈ మాజీ మంత్రి రాజకీయం ఈ తీరం చేరుతుందో.