అచ్చెన్నా...యోగా డే కి రావద్దన్నా !
ఎందుకంటే ముఖ్యమంత్రి చంద్రబాబే ఆయనకు ఒక సలహా లాంటి సూచన చేసి అందరిలో సెటైర్లు వేశారు.;
టీడీపీ కూటమిలో ముఖ్య నేత, ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ గా నాలుగేళ్ళ పాటు పనిచేసిన వారు, ప్రభుత్వంలో కీలక శాఖలు చూస్తున్న మంత్రి అయిన అచ్చెన్నాయుడు ఈ నెల 21న విశాఖ వేదికగా జరుగుతున్న అంతర్జాతీయ యోగా డేకు వస్తున్నారా లేదా అన్నది ఇపుడు పెద్ద డౌట్ గా ఉంది.
ఎందుకంటే ముఖ్యమంత్రి చంద్రబాబే ఆయనకు ఒక సలహా లాంటి సూచన చేసి అందరిలో సెటైర్లు వేశారు. విశాఖలో జరుగుతున్న యోగా డే ఏర్పాట్ల గురించి చంద్రబాబు అధికారులు మంత్రులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా బస్సులలో యోగాభ్యాసకులను ఎలా తీసుకుని రావాలి, వారికి కేటాయించిన సీట్లలో ఎలా కూర్చోబెట్టాలి బస్సులు ఎన్ని అవసరం అవుతాయి వంటి విషయాల మీద బాబు చర్చిస్తున్నపుడు అచ్చెన్న మధ్యలో జోక్యం చేసుకుని ఎ ఏ బస్సులో ఎవరు ఎక్కుతారో అని అంటూ మాట్లాడుతున్నారు.
దాంతో ఒకింత విస్మయంతో కూడిన ఆగ్రహంతో బాబు ఏ బస్సులో ఎవరు ఎక్కడమేంటి అని ప్రశ్నించారు. అంతే కాదు, ఎవరు పడితే వారు ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొనే ప్రతిష్టాత్మకమైన యోగా డేకి ఎలా వస్తారని నిలదీశారు. నెల రోజుల పాటు సచివాలయం కేంద్రంగా యోగాభ్యాసములు ప్రాక్టీస్ చేయించామని గుర్తు చేశారు.
అలా యోగా ప్రాక్టీస్ చేసిన వారే వస్తారని, వారందరికీ ప్రత్యేకంగా నంబర్ ఇస్తారని అలా వారు తమకు కేటాయించిన చోటులో కూర్చుంటారని, తమకు ఇచ్చిన బస్సులో ఎక్కి వస్తారని బాబు వివరించారు. ఏ ప్రాక్టీస్ చేయకుండా నేరుగా బస్సులు ఎక్కి వచ్చేయడం కుదరదు అన్నారు.
ఈ విషయాల మీద అవగాహన లేకపోతే అచ్చెన్నాయుడు ఇంకా గాలిలో ఉన్నట్లే అని సెటైర్లు పేల్చారు. అంతే కాదు అచ్చెన్నాయుడు నీవు కూడా యోగా ప్రాక్టీస్ చేయకపోతే దయచేసి రావద్దు అని బాబు షాకింగ్ కామెంట్స్ చేశారు. అక్కడ అందరూ తలో రకంగా యోగాభ్యాసాలు చేస్తూంటే టీవీలలో అవి వార్తలు అవుతాయని మొత్తానికి మొత్తం ఇబ్బంది అవుతుందని బాబు చెప్పడం విశేషం.
అంతా ఒక క్రమపద్ధతి ప్రకారం జరగాలని ప్రణాళిక మేరకు సాగాలని బాబు సూచించారు. అయితే యోగా ప్రాక్టీస్ లేకపోతే అచ్చెన్న నీవు రావద్దు అని బాబు అన్నపుడు అక్కడ అంతా నవ్వులు వెల్లి విరిసాయి. మరి ఇంతకీ అచ్చెన్న యోగాభ్యాసం చేశారా లేదా అన్నది మాత్రం తెలియదని అంటున్నారు.
అచ్చెన్న ఇంతకీ యోగా డేకి వస్తారా వచ్చి గంట పాటు యోగాసనాలు వేస్తారా అన్నది కూడా చర్చనీయాంశం అయింది. బాబు చేసిన వ్యాఖ్యలతో కచ్చితంగా మీడియా ఫోకస్ అంతా అచ్చెన్న మీద ఉంటుంది. ఆయన ఏ చిన్న తడబాటుగా యోగాసనాలు వేసినా దానిని క్షణాలలో వైరల్ చేసేందుకు మీడియా సిద్ధంగా ఉంటుందేమో అని అంటున్నారు. చంద్రబాబు మాట్లాడుతూంటే మధ్యలో జోక్యం చేసుకుని అచ్చెన్న యోగా డేకే రాకుండా చేసుకున్నారా అన్నది ఇపుడు అంతా అనుకుంటున్నారు.