అశోక్ ఖేమ్కా రిటైర్మెంట్ నేడే.. 34 ఏళ్ల సర్వీసులో 57సార్లు బదిలీలు
ముక్కుసూటిగా ఉండే ఈ ఐఎఎస్ అధికారి ఈ రోజు రిటైర్ అవుతున్నారు. సర్వీసులో అత్యధిక సార్లు బదిలీ అయిన ఆఫీసర్ గా ఆయనకున్న ట్రాక్ రికార్డు మరెవరికీ ఉండదనే చెప్పాలి.;
నీతిగా.. నిజాయితీగా.. ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లకు లొంగకుండా.. ఉన్నతాధికారులు పక్షపాతంగా వ్యవహరించమన్నా.. నో అంటే నో చెప్పే ఉన్నతాధికారులు కొందరు ఉంటారు. అయితే.. వీరిలో కొందరు తమ సర్వీసులో ఏదో ఒక చోట కాస్తంత రాజీ పడతారు. అందుకు భిన్నంగా తనకు నచ్చని ఏకైక పదం ‘రాజీ’ పడటం అన్నట్లుగా వ్యవహరిస్తారు సీనియర్ ఐఏఎస్ అధికారి అశోక్ ఖేమ్కా. కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా.. ఆయనకు మాత్రం ఎలాంటి న్యాయం జరగలేదన్నట్లుగా ఆయన సర్వీసును చూస్తే అర్థమవుతుంది.
ముక్కుసూటిగా ఉండే ఈ ఐఎఎస్ అధికారి ఈ రోజు రిటైర్ అవుతున్నారు. సర్వీసులో అత్యధిక సార్లు బదిలీ అయిన ఆఫీసర్ గా ఆయనకున్న ట్రాక్ రికార్డు మరెవరికీ ఉండదనే చెప్పాలి. హర్యానా రవాణా శాఖ విభాగం అదనపు ప్రధాన కార్యదర్శి హోదాలో ఆయన ఈ రోజు (ఏప్రిల్ 30న) పదవీ విరమణ అవుతున్నారు. 1991 సివిల్స్ బ్యాచ్ అయిన ఆయన.. తన 34 ఏళ్ల కెరీర్ లో 57 సార్లు బదిలీ అయ్యారు. ఆయన జరిగిన ట్రాన్సఫర్లను చూస్తే.. ప్రతి ఆర్నెల్లకు ఒక బదిలీ వేటు ఆయన సర్వీసులో కనిపిస్తుంది.
బెంగాలీ అయిన అశోక్ ఖేమ్కా.. పశ్చిమబెంగాల్ రాష్ట్ర రాజధాని కోల్ కతాలో 1965లో జన్మించారు. ఐఐటీ ఖరగ్ పుర్ నుంచి 1988లో సీఎస్ఈలో బీటెక్ పూర్తి చేసి.. టాటా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ కంప్యూటర్స్ లో పీహెచ్ డీ పూర్తి చేశారు. అంతేకాదు ఎంబీఏ.. ఎల్ఎల్ బీ డిగ్రీల్ని సాధించారు. హర్యానా కేడర్కు చెందిన ఈ ఐఏఎస్ అధికారి 2012లో రాబర్ట్ వాద్రాకు సంబంధించిన గురుగ్రామ్ భూ ఒప్పందం మ్యుటేషన్ రద్దుతో జాతీయ స్థాయిలో ఈయన పేరు మారుమోగింది.
దాదాపు పదేళ్ల క్రితం హర్యానా రవానా శాఖ కమిషన్ గా బాధ్యతలు చేపట్టిన ఆయన.. నాలుగు నెలలకే బదిలీ వేటు పడింది. ఆసక్తికరమైన అంశం ఏమంటే రిటైర్మెంట్ వేళ అదే పోస్టు చేపట్టి రిటైర్ కావటం. సాధారణంగా సీనియర్ అధికారులు తాము చేసిన పోస్టుకు మించి.. మరింత అత్యున్నత పోస్టుల్ని చేపడుతుంటారు.కానీ.. ఖేమ్కా నిజాయితీ.. ముక్కుసూటితనం ఆయనకు ఇబ్బందిగా మారింది.
రెండేళ్ల క్రితం హర్యానా ప్రభుత్వానికి ఆయన రాసిన లేఖ అప్పట్లో సంచలనంగా మారింది. అవినీతిని నిర్మూలించేందుకు తనకు స్టేట్ విజిలెన్స్ విభాగం అధిపతిగా బాధ్యతలు అప్పగించాలని కోరారు. కానీ.. అందుకు అక్కడి ప్రభుత్వం సానుకూలంగా స్పందించలేదు. తాను కెరీర్ చరమాంకంలో ఉన్నానని.. అవినీతిని చూసినప్పుడు తన మనసు తల్లడిల్లుతుందని.. అందుకే సదరు విభాగంలో తాను సేవలు అందించాలని భావిస్తున్నట్లుగా పేర్కొన్నారు. ఆ సమయంలో ఆయన హర్యానా సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖకు అదనపు ప్రధాన కార్యదర్శిగా వ్యవహరించేవారు. లేఖ నేపథ్యంలో ఆయన్ను ఆర్వైవ్స్ శాఖకు బదిలీ చేశారు. తన కెరీర్ లో అత్యధిక భాగం అప్రాధాన్య శాఖల్లో పని చేసిన ఖేమ్కా.. తన ఆర్కైవ్స్ శాఖలో నాలుగుసార్లు పని చేయటం గమనార్హం.