రాజ్ భవన్ లోకి రాజు గారు.. ఆ భవనం విశేషాలు చాలా...

పోర్చుగీసు పాలనలో ఈ కోటను ‘పలాసియో డో కాబో’ అని పిలిచేవారు, వాళ్ల గవర్నర్ జనరల్స్ ఇక్కడే నివసించేవారు. గోవాకు స్వాతంత్య్రం వచ్చాక, ఇది ‘కాబో రాజ్ నివాస్’గా మారింది.;

Update: 2025-07-26 12:11 GMT

కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు గోవా గవర్నర్ గా నియమితులు అవ్వడంతో అక్కడి రాజ్ భవన్ ఒక్కసారిగా వార్తాల్లోకి వచ్చేసింది. దేశంలో ప్రతి రాష్ట్రానికి రాజ్ భవన్ ఉన్నప్పటికీ తెలుగు వారు.. ముఖ్యంగా విజయనగరం రాజుగా చిరపరిచితులైన అశోక్ గజపతిరాజుకు ఆతిథ్యం ఇస్తున్న రాజ నివాసం విశేషాలు తెలుసుకునేందుకు ఎక్కువ ఆసక్తి కనిపిస్తోంది. గతంలో చాలా మంది తెలుగు ప్రముఖులు గవర్నర్లుగా పనిచేశారు. ఇప్పుడు పనిచేస్తున్నారు. కానీ, విజయనగర రాజ వంశానికి చెందిన అశోక్ గజపతిరాజు ఒక కోటను వదిలి మరో కోటలో అడుగు పెట్టడంతో ఈ చర్చ ఎక్కువగా జరుగుతోంది.

 

1540లొ నిర్మాణం

శనివారం గోవా గవర్నర్ గా అశోక్ గజపతిరాజు ప్రమాణస్వీకారం చేశారు. అనంతరం గవర్నర్ అధికారిక నివాసమైన గోవా రాజ్ భవన్ లోకి అడుగుపెట్టారు. 88 ఎకరాల పెద్ద స్థలంలో నిర్మించిన ఆ అపురూప కట్టడం దేశంలో విలాసవంతమైన రాజభవనుల్లో ఒకటిగా చెబుతారు. ఈ ప్యాలెస్ కు ఎంతో చారిత్రక నేపథ్యం ఉంది. పోర్చుగీసు వాళ్లు గోవాను పాలించిన సమయంలో 1540లో ఈ కోటను నిర్మించారు. ఈ భవనాన్ని ‘కాబో రాజ్ నివాస్’గా పిలిచేవారు.

 

రెండు నదుల మధ్యన..

పోర్చుగీసు పాలనలో ఈ కోటను ‘పలాసియో డో కాబో’ అని పిలిచేవారు, వాళ్ల గవర్నర్ జనరల్స్ ఇక్కడే నివసించేవారు. గోవాకు స్వాతంత్య్రం వచ్చాక, ఇది ‘కాబో రాజ్ నివాస్’గా మారింది. గోవాలో ఇది చాలా పాత, ముఖ్యమైన భవనాల్లో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. అరేబియా సముద్రంలోకి వెళ్లినట్లు ఉండే ఓ కొండ చివరన ఈ ప్యాలెస్ ను నిర్మించారు. మాండవి, జువారీ నదులు సముద్రంలో కలిసే చోట నిర్మించిన ఈ భారీ భవనం చూసేందుకు చాలా అందంగా ఉంటుంది. మొదట నదుల ద్వారా వచ్చే ఓడలను పర్యవేక్షించడానికి, రక్షించడానికి దీన్ని ఒక కోటగా కట్టారు. ఇక్కడ నుండి మాండవి బే, అగువాడ కోట, మోర్ముగావ్ నౌకాశ్రయం చాలా అందంగా కనిపిస్తాయి.

రెండు అంతస్తుల భవనం..

రెండు అంతస్తుల ఈ భవనం కింది అంతస్తులో గవర్నర్ కార్యాలయం, ఆయన నివాసం, కొన్ని అతిథి గదులు ఉంటాయి. పై అంతస్తులో పెద్ద దర్బార్ హాల్, సమావేశాలకు ఉపయోగించే హాళ్లు, విందులకు వాడే హాళ్లు ఉన్నాయి. ప్యాలెస్ లోపల అనేక పురాతన వస్తువులు ఉన్నాయి. బోహేమియన్ షాన్డిలియర్‌లు, చైనా పింగాణీ వస్తువులు, వెండి వస్తువులు, చెక్క ఫర్నిచర్ ఉన్నట్లు చెబుతున్నారు. ఇక హిందూ దేవతలు, దేవాలయాల బొమ్మలతో చెక్కిన కుర్చీలు హిందువులు, క్రైస్తవుల మధ్య ఉన్న స్నేహానికి ప్రతిబింబంగా చెబుతారు. పోర్చుగీసు చిహ్నాలున్న 300 ఏళ్ల నాటి ఐదు పొడవైన క్యాంటోనీస్ వాజులు, రెండు పెద్ద క్యాంటోనీస్ గిన్నెలు ఇక్కడ ప్రత్యేక ఆకర్షణలు.

Tags:    

Similar News