రాధా రాజకీయం: రైట్ టైమ్‌లో రాంగ్ డెసిషన్స్..!
వంగవీటి ఫ్యామిలీ నుంచి వచ్చారంటే.. ఆ కుటుంబంలోని వారికి ప్రత్యేకంగా ఎలాంటి గుర్తింపు అవసరం లేదు.;
వంగవీటి ఫ్యామిలీ నుంచి వచ్చారంటే.. ఆ కుటుంబంలోని వారికి ప్రత్యేకంగా ఎలాంటి గుర్తింపు అవసరం లేదు. రంగా ఏర్చి కూర్చిన గుర్తింపు సరిపోతుంది. దానిని వారు నిలబెట్టుకుంటే కూడా రాజకీయంగా ఎదిగేందుకు అవకాశం ఉంటుంది. అయితే.. సరైన అడుగులు సరైన సమయంలో పడాలి. ఈ విషయం లోనే రంగా వారసుడిగా వంగవీటి రాధాకృష్ణ వేసిన అడగులు రాంగ్ అయ్యాయన్నది రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ. రాధాను చూపిస్తూ.. ఆయన సోదరి, రంగా కుమార్తె ఆశకు కొన్ని సూచనలు కూడా చేస్తున్నారు.
2004లో కాంగ్రెస్‌పార్టీలోకి వచ్చిన రాధా.. పిన్న వయసులోనే విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ టికెట్‌పై విజయం దక్కించుకున్నారు. అనంతరం.. ఆయన 2009 ఎన్నికల నాటికి... ప్రజారాజ్యం పార్టీ పంచన చేశారు. ఈ సమయంలో అప్పటి సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి స్వయంగా రాధాకు ఫోన్ చేసి.. ఇది రాంగ్ నిర్ణయం. కాంగ్రెస్‌లోనే ఉండాలని సూచించారు. కానీ, రాధా వినిపించుకోలేదు. కుల ప్రాతిపది కన.. ప్రజారాజ్యంలో చేరిపోయారు. కానీ, అది బెడిసి కొట్టింది.
ఇక, ఆ తర్వాత.. ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేశాక.. మరోసారి కాంగ్రెస్‌లో చేరే అవకాశం వచ్చింది. కానీ.. కొన్నాళ్లు గ్యాప్ తీసుకున్న రాధా.. వైసీపీలోకి వచ్చారు. 2019లో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం ఇవ్వాలని పట్టుబట్టారు. కానీ, పార్టీ మాత్రం ఆయనకు మచిలీపట్నం ఎంపీ సీటును ఆఫర్ చేసింది. నిజానికి ఆ సమయంలో వైసీపీ తరఫున ఎవరిని నిలబెట్టినా.. ప్రజలు గెలిపించే మూడ్‌లో ఉన్నారు. పాదయాత్ర ప్రభావం, ఒక్క ఛాన్స్ నినాదం వంటివి వైసీపీకి కలిసి వచ్చాయి.
కానీ, అలాంటి రైట్ సమయంలోనూ రాధా రాంగ్ నిర్ణయం తీసుకుని ఎన్నికల పోటీకి దూరంగా ఉన్నారు. ఇక, 2024లో టీడీపీలోకి వచ్చారు. అయితే.. ఆయన చేరిక సమయంలో ఎలాంటి హామీ తీసుకోకుండానే.. బేషరతుగా చేరిపోయారన్న విషయం తెలిసిందే. వాస్తవానికి ఈ సమయంలోనూ.. టీడీపీ కూటమి హవా బాగా కనిపించింది. ఇలాంటి సమయంలో రాధా ఏది అడిగినా.. ఇచ్చేందుకు టీడీపీ రెడీ అయింది. ఇక్కడా ఆయన తప్పటడుగు వేశారు. దీంతో గత 2004 తర్వాత.. ఇప్పటి వరకు రాధా రాజకీయ గ్రాఫ్ పుంజుకోలేదు. సో.. వీటిని చూపిస్తూ.. ఆశ కూడా ఇలా చేయకుండా జాగ్రత్తగా అడుగులు వేయాలన్న సూచనలు రంగా అభిమానుల నుంచి వినిపిస్తుండడం గమనార్హం.