జగన్ అరెస్టు...సానుభూతులూ...లెక్కలూ !

వైసీపీ అధినేత జగన్ అరెస్టు అవుతారా అంటే అవవచ్చు అని ఒక రాజకీయ జోస్యం , అబ్బే కాకపోవచ్చు అని మరో రాజకీయ జోస్యం.;

Update: 2025-05-20 17:44 GMT

వైసీపీ అధినేత జగన్ అరెస్టు అవుతారా అంటే అవవచ్చు అని ఒక రాజకీయ జోస్యం , అబ్బే కాకపోవచ్చు అని మరో రాజకీయ జోస్యం. ఇలా ఎవరికి తోచినట్లుగా వారు చెప్పుకుంటున్నారు. ఇంతకీ ఆ అవకాశాలు ఏ మేరకు ఉన్నాయంటే ఇది ఫక్తు రాజకీయం కాబట్టి ఎవరికి ఏమి తెలుసు. ఏమైనా జరగవచ్చు అన్న వారే ఉన్నారు.

వైసీపీ నేతలు అయితే జగన్ అరెస్ట్ అని మానసికంగా సిద్ధపడిపోయాయి. మా నాయకుడినే గురి పెట్టి ఆయనే కేంద్రంగా లిక్కర్ స్కాం అని లేని దానిని ఉన్నట్లుగా చూపిస్తున్నారు. ఇదంతా జగన్ కోసమే అని ఆడిపోసుకుంటున్నారు. జగన్ కి లిక్కర్ స్కాం కి సంబంధం ఏమిటి అని ప్రశ్నించేవారు ఉన్నారు. అంతే కాదు స్కాం అన్నది ఎక్కడ జరిగింది అని తెలివిగానే ప్రశ్నిస్తున్నారు.

ఇలా ఎవరికి తోచిన వ్యాఖ్యానాలు వైసీపీ చేస్తూంటే కొత్తగా ఆ పార్టీలో చేరిన అనంతపురం జిల్లా వాసి అయిన మాజీ మంత్రి సాకే శైలజానాధ్ అయితే జగన్ అరెస్ట్ అంటే కూటమి పెద్దలు తమను తాము కార్నర్ చేసుకున్నట్లే అనేశారు. జగన్ కి అత్యంత ప్రజాదరణ ఉందని ఆయనను అరెస్టు చేస్తే ఏమవుతుందో కూడా వారికి తెలియనిది కాదు అన్నారు.

ఒకవేళ అరెస్టే చేయాలని తలచి అన్నీ కూడా పక్కన పెడితే అది అంతిమంగా కూటమికే నష్టం అని తీర్మానించారు. అయినా లిక్కర్ స్కాం అంటే కూటమి ప్రభుత్వం వచ్చాకనే జరిగేది అన్నారు. ప్రభుత్వం నడిపే మద్యం షాపులలో కుంభకోణం ఏమి ఉంటుందని ఆయన అంటున్నారు. జగన్ ని కనుక జైలులో పెడితే మాత్రం చంద్రబాబు పెద్ద తప్పు చేస్తున్నట్లే అని శైలజానాధ్ అంటున్నారు.

ఇదిలా ఉంటే ఒకనాడు జగన్ కి వీర విధేయుడు భక్తుడు అయిన నెల్లూరు రూరల్ జిల్లా టీడీపీ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి అయితే జగన్ ని అరెస్ట్ చేస్తే చేస్తారు అందులో పెద్ద విశేషం ఏముంది అని ఎదురు ప్రశ్నిస్తున్నారు. బలమైన ఆధారాలు ఉంటే ఎవరిని అయినా అరెస్టు చేస్తారు అని అన్నారు.

ఇక జగన్ ని అరెస్ట్ చేస్తే సానుభూతి వస్తుందని వైసీపీ వారు ఊహించుకుంటున్నారు కానీ అలాంటిది ఏదీ ఉండదని అన్నారు జగన్ కొత్తగా రాజకీయాల్లోకి వచ్చినపుడు సీబీఐ కేసులు పెట్టి అరెస్ట్ చేసినపుడే ఆయన 2014 ఎన్నికల్లో గెలవలేదని గుర్తు చేశారు. అందువల్ల అరెస్ట్ జైలు సానుభూతి అన్నది వైసీపీ అధినేతకు అసలు వర్కౌట్ కాదని ఖరాఖండీగా ఆయన చెప్పేస్తున్నారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ని చాలా కాలం జైలు లో ఉంచారని ఎన్నికల ముందే ఆయన బయటకు వచ్చారని అయినా ఆయన పార్టీ ఓటమి చవి చూసిందని గుర్తు చేస్తున్నారు.

ఇంతకీ జగన్ అరెస్ట్ అయితే ఆయనకు సానుభూతి వస్తుందా రాదా అంటే అది జనాల మూడ్ బట్టి ఉంటుంది. ఇక నాలుగేళ్ళ కాలం బిగిసి ఉన్నందువల్ల ఇపుడు అరెస్ట్ చేసినా ఒకవేళ జనాలలో సింపతీ ఏ మాత్రం వచ్చినా 2029 ఎన్నీక్ల సమయానికి ఏదీ మిగలదని కూడా మరో విశ్లేషణ ఉంది.

అయితే తెలుగు నాట అరెస్టులు అయితే బ్రహ్మాండంగా రాజకీయాలలో పనిచేశాయని అంటారు. జగన్ 2014 లో గెలవకఒపయినా దాదాపుగా గెలుపు అంచుల దాకా వచ్చారని, ఒక బిగ్ పొలిటికల్ స్టార్ గా ఎస్టాబ్లిష్ అయ్యారంటే అది అరెస్టులు జైలు వల్లనే అంటారు. అలాగే తెలంగాణాలో రేవంత్ రెడ్డి ఏపీలో చంద్రబాబు జైలు నుంచి బయటకు వచ్చాకనే సీఎంలు అయ్యారని చెబుతున్నారు. జగన్ ఇపుడు బయటకు రావడం లేదు, బెంగళూరులో ఉంటున్నారు. లేకపోతే ఇలా తాడేపల్లి వచ్చి అలా వెళ్ళిపోతున్నారు.

అలాంటి ఆయనను జైలులో పెడితే ఉచితంగా పబ్లిసిటీ ఇచ్చి మరీ వైసీపీ గ్రాఫ్ పెంచినట్లే అవుతుంది అని అంటున్నారు. సో జగన్ అరెస్టు చుట్టూ సెంటిమెంట్లూ సానుభూతులూ చాలానే ఉన్నాయని వైసీపీ వైపు నుంచి అంటున్న వారూ ఉన్నారు. ఇంతకీ జగన్ అరెస్టు అయినపుడు కదా ఇవన్నీ అని అంటున్న వారూ ఉన్నారు.

Tags:    

Similar News