ఆర్మీ అధికారి Vs స్పైస్‌జెట్ ఎంప్లాయీస్ మధ్య గొడవ.. నలుగురికి గాయాలు.. వీడియో వైరల్!
ఆర్మీ సీనియర్ అధికారి స్పైస్‌జెట్ ఉద్యోగులపై దాడి చేసిన తీరు అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది.;
ఆర్మీ సీనియర్ అధికారి స్పైస్‌జెట్ ఉద్యోగులపై దాడి చేసిన తీరు అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. పరిమితికి మించిన లగేజీతో వచ్చినందుకు అదనంగా ఫీజు చెల్లించాలి అని స్పైస్‌జెట్ అధికారులు ఆర్మీ సీనియర్ అధికారిని కోరారు. దాంతో ఆయన కోపం వ్యక్తం చేస్తూ.. వారిపై చెలరేగిపోయి విచక్షణారహితంగా ప్రవర్తించారు. ముఖ్యంగా నలుగురు ఉద్యోగులను చితకబాదడంతో ఒకరికి దవడ పగలడం, మరొకరికి వెన్నెముక విరగడం వంటి తీవ్ర గాయాలతో ఆసుపత్రి పాలయ్యారు.
పూర్తి వివరాల్లోకి వెళితే.. శ్రీనగర్ విమానాశ్రయంలో జూలై 26వ తేదీన ఈ ఘటన చోటుచేసుకుంది. లెఫ్టినెంట్ కల్నల్ రితేష్ కుమార్ సింగ్ గుల్మార్గ్ లోని హై అల్టిట్యూడ్ వార్ ఫెయిర్ స్కూల్లో పనిచేస్తున్నారు. ఈయన జూలై 26వ తేదీన ఢిల్లీ వెళ్లే స్పైస్‌జెట్ విమానంలో ప్రయాణించాల్సి ఉంది. అయితే ప్రయాణికులు క్యాబిన్ లోకి వెళ్ళేటప్పుడు కేవలం 7 కిలోల బరువు ఉన్న లగేజీని మాత్రమే తీసుకెళ్లేందుకు అనుమతిస్తారు. కానీ ఈయన మాత్రం 16 కిలోల బరువు ఉన్న రెండు బ్యాగులతో విమానాశ్రయంలోకి వచ్చారు.
నిబంధనల ప్రకారం అదనపు బరువుకు అదనంగా ఛార్జీ చెల్లించాల్సి ఉంటుంది అని సిబ్బంది చెప్పడంతో.. అదనపు ఛార్జీలు చెల్లించడానికి కల్నల్ సింగ్ నిరాకరించారు. అంతేకాదు వారిపై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ, దుర్భాషలాడుతూ ఊగిపోయారు. వారిని నెట్టుకుంటూ లోపలికి వెళ్లే ప్రయత్నం చేశారు. దాంతో ఆయనను సిబ్బంది అడ్డుకోబోయారు. దీంతో వారిపై సైన్ బోర్డ్ స్టీల్ స్టాండ్ తీసుకొని దాడికి దిగారు. ఆ దాడిలో ఒక ఉద్యోగి అక్కడికక్కడే స్పృహ తప్పి పడిపోగా.. ఆయనను కాలితో తన్నారు. మరొక ఉద్యోగి ముఖంపై పంచు ఇవ్వడంతో ఆయన దవడ ఎముక విరిగిపోయింది. ముక్కు నుంచి రక్తం కూడా కారింది. అంతేకాదు మరొక ఉద్యోగి వెన్నెముక చిట్లింది.
అక్కడ పరిస్థితి విషమించడంతో అసలు విషయం తెలుసుకున్న సీఐఎస్ఎఫ్ అధికారి మధ్యలో కలగజేసుకొని కల్నల్ సింగ్ ను తిరిగి గేటు వద్దకు తీసుకెళ్లారు. బాధిత నలుగురు ఉద్యోగులను కూడా వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇకపోతే ఈ వీడియో వైరల్ అవ్వడంతో ఆర్మీ వెంటనే దీనిపై స్పందించింది. క్రమశిక్షణకు పెద్దపీట వేస్తామని చెప్పిన ఆర్మీ దర్యాప్తు చేపట్టామని ఒక ప్రకటనలో తెలిపింది. స్థానిక పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయింది. అంతేకాదు ఆ అధికారి పేరును నో ఫ్లై జాబితాలో చేరుస్తామని, ఆ ప్రయాణికుడిపై తగిన చర్యలు తీసుకోవాలి అని స్పైస్‌జెట్ పౌర విమానయాన శాఖకు లేఖ కూడా రాసింది.