రాజకీయ తులాభారంలో విజయమ్మ ఎటు వైపు...!?

ఆమె ఓడిపోతే కనుక రాజకీయంగా పెను సవాళ్లు ఎదురవుతాయి. మరి కుమార్తె పట్టుబట్టి ఎన్నికల ప్రచారానికి తల్లి విజయమ్మను తీసుకుని వస్తారా ఏమో చూడాల్సి ఉంది.

Update: 2024-04-04 08:14 GMT

అవును. ఇది రాజకీయ తులాభారం. ఎవరికీ రాని కష్టం. ఆనాడు శ్రీకృష్ణుడు అటు పాండవులు ఇటు కౌరవులు ఇద్దరూ తనకు బంధువులు దగ్గరి వారే అని అంటూ ఎవరి పక్షం వహించేది అని చాలా సంకట పరిస్థితి ఎదుర్కోన్నాడు. చివరికి దేవుడు కాబట్టి వారికే ఎంపిక చాన్స్ ఇచ్చి తన తప్పు లేదని చెప్పి పాండవ పక్షం వహించి ఆ ఇబ్బంది నుంచి తప్పించుకున్నాడు.

దేవుడు కంటే పెద్ద బాధ్యత పవిత్రత ఉన్నది అమ్మ అనే పాత్రకి. దేవుడు అయిన పక్షపాతం చూపిస్తాడేమో కానీ అమ్మకు అది ఉండదు. అది ఉంటే అమ్మ కానేకాదు. అమ్మకు ఎందరు పిల్లలు ఉన్నా అందరూ ఒక్కటే అంటారు. రెండు కళ్లలో ఏ కన్ను నీకు ఇష్టం అంటే ఎవరూ జవాబు చెప్పలేరు. అమ్మ కూడా అంతే.

అలాంటి అమ్మ వైఎస్సార్ సతీమణి అయిన వైఎస్ విజయమ్మకు అతి పెద్ద కష్టం వచ్చిపడింది. తన కుమారుడు జగన్ వైసీపీ అధినేత. కుమార్తె షర్మిల కాంగ్రెస్ ఏపీ పీసీసీ చీఫ్. ఇది చాలదు అన్నట్లుగా ఇద్దరూ సొంత గడ్డ మీద ప్రత్యర్థులుగా కత్తులు దూస్తున్నారు. షర్మిల కాంగ్రెస్ తరఫున ప్రచారానికే పరిమితం అవుతారు అనుకుంటే ఆమె కడప నుంచి ఎంపీగా పోటీకి దిగుతున్నారు.

ఇది నిజంగా విజయమ్మకు ఇబ్బందిని పెట్టే విషయం. షర్మిల కూడా వైఎస్సార్ కుటుంబం రెండుగా చీలిపోయే నిర్ణయం ఇది అన్నారు. మరి ఆమెకే అలా ఉంటే విజయమ్మకు ఎలా ఉంటుంది. ఆమె కన్న తల్లి. ఆమె ఎవరు పక్షం ఉంటారు అన్నది ఇపుడు చర్చగా ఉంది. ఆమె మద్దతు ఈ రాజకీయ సమరంలో తులాభారం అవుతుంది. ఆమె ఎవరి వైపు ఉంటే వైఎస్సార్ మద్దతు ఆ వైపే అని జనాలు అంతా అనుకుంటారు. అంతే కాదు ఆ పక్షానికి నైతిక మద్దతు కూడా లభించినట్లు అవుతుంది.

అసలే కడపలో వైఎస్ వివేకా దారుణ హత్య కేసు మీద వైసీపీని టార్గెట్ చేస్తూ చెల్లెళ్ళు షర్మిల సునీత జగన్ మీద నేరుగా మాటల దాడి చేస్తున్నారు. ఈ కీలక సమయంలో విజయమ్మ కనుక షర్మిల వైపు మొగ్గితే మరిది వివేకా హత్య కేసులో వైసీపీ ప్రభుత్వానిదే బాధ్యత అని ఇండైరెక్ట్ గా జనాలకు చెప్పినట్లు అవుతుంది.

దానికి కారణం ఏంటి అంటే తాను పోటీ చేయడానికి అవినాష్ రెడ్డికి జగన్ టికెట్ ఇవ్వడమే రీజన్ అని షర్మిల చెప్పారు. ఇక సునీత అయితే అవినాష్ రెడ్డితో పాటు జగన్ ఓటమిని కూడా తాను కోరుకుంటున్నాను అని బాహాటంగా చెప్పేశారు. ఇలా వైఎస్సార్ ఇంటి ఆడపడుచులు ఇద్దరు జగన్ కి ఆయన ప్రభుత్వానికి వ్యతిరేకంగా ద్వజమెత్తుతున్న వేళ ఇప్పటిదాకా ఆ కుటుంబంలో మరో ప్రముఖ వ్యక్తి ఎవరూ వీరికి మద్దతు ఇచ్చినట్లుగా కనిపించడం లేదు.

మొత్తం 750 మంది సభ్యులతో వైఎస్సార్ వంశ వృక్షం అతి పెద్దది. అలాంటి కుటుంబం నుంచి ఇద్దరు చెల్లేళ్లకు మద్దతు పెద్దగా అందడం లేదు. జగన్ మేనత్త విమలమ్మ వంటి వారు కూడా ఆయనకే మద్దతుగా ఉన్నారు. మొత్తానికి చూస్తే వీరందరి మద్దతు ఒక ఎత్తు. ఒక్క విజయమ్మ మద్దతు మరో ఎత్తు. ఆమె కనుక ఉంటే ఆ పక్షానికి వేయి ఏనుగుల బలం వచ్చినట్లు అవుతుంది.

ఇటీవల వైసీపీ తన మొత్తం అభ్యర్థుల లిస్ట్ ని రిలీజ్ చేసినపుడు విజయమ్మ వచ్చారు. జగన్ని ఆశీర్వదించారు. అలాగే కాంగ్రెస్ ఏపీ చీఫ్ హోదాలో షర్మిల కాంగ్రెస్ అభ్యర్ధుల లిస్ట్ రిలీజ్ చేస్తే హైదరాబాద్ నుంచి కడపకు ప్రత్యేక విమానంలో షర్మిలతో పాటు విజయమ్మ వచ్చి ఆమెను కూడా ఆశీర్వదించారు.

ఇలా చూసుకుంటే కనుక విజయమ్మ ఇప్పటిదాకా బ్యాలెన్స్ చేస్తూ వెళ్తున్నారు. ఇద్దరికీ తాను మద్దతు అంటున్నారు. కానీ ఎన్నికల కురుక్షేత్రంలో అలా కుదరదు, ఎటో వైపు ఉండాలి. అది కీలకం. మరి అలాంటి సమయంలో విజయమ్మ షర్మిల వైపు ఉంటారా లేక జగన్ వైపు ఉంటారా అన్నది చర్చకు వస్తున్న విషయం.

ఆమె ఎటు వైపు అన్న దానిని బట్టి కడపలో రాజకీయ లెక్కలు పూర్తిగా మారిపోతాయి. అయితే అంతా అనుకుంటున్నట్లుగా విజయమ్మ జగన్ పట్ల ఏ మాత్రం కోపంగా లేరు. ఆమెకు కొడుకు అంటే ఎంతో ప్రేమాభిమానాలు ఉన్నాయి. తన కుమారుడు మరోసారి ముఖ్యమంత్రి కావాలని ఆమె కోరుకుంటున్నారు అన్నది ఇడుపులపాయలో ఆమె వచ్చి జగన్ ని ఆశీర్వదించినపుడు అర్ధం అయింది.

ఇక షర్మిల విషయం తీసుకుంటే ఆమె పోటీ చేస్తే గెలిస్తే ఎంపీ అవుతారు తప్ప సీఎం కాలేరు పైగా కాంగ్రెస్ పార్టీకి ఏపీలో ఏ మాత్రం బలం లేదు షర్మిల మొండి పట్టుదల అన్న మీద కోపంతో చేస్తున్న రాజకీయం ఇదంతా అని భావిస్తే మాత్రం విజయమ్మ న్యూట్రల్ విధానాన్నే కొనసాగిస్తారు తప్ప షర్మిలకు బాహాటంగా మద్దతు ఇవ్వకపోవచ్చు అని అంటున్నారు.

ఆమె మద్దతు లేకపోతే జగన్ కి ఇబ్బంది లేదు కానీ షర్మిలకు మాత్రం తొలిసారి ఎన్నికల్లో రాజకీయంగా భారీ నష్టమే జరుగుతుంది. ఆమె ఓడిపోతే కనుక రాజకీయంగా పెను సవాళ్లు ఎదురవుతాయి. మరి కుమార్తె పట్టుబట్టి ఎన్నికల ప్రచారానికి తల్లి విజయమ్మను తీసుకుని వస్తారా ఏమో చూడాల్సి ఉంది.

Tags:    

Similar News