లోకేశ్ సమక్షంలో కీలక ఒప్పందం.. ఏపీలో యూట్యూబ్ అకాడమీ
సింగపూర్ లో పర్యటిస్తున్న ఏపీ సీఎం చంద్రబాబు టీం గొప్ప విజయాన్ని సాధించింది. కంటెంట్ ఎకానమీని క్యాష్ చేసుకునేలో భాగంగా రాష్ట్రంలో కంటెంట్ క్రియేటర్లకు శిక్షణ ఇచ్చేందుకు యూట్యూబ్ అకాడమీ ఏర్పాటు కానుంది.;
సింగపూర్ లో పర్యటిస్తున్న ఏపీ సీఎం చంద్రబాబు టీం గొప్ప విజయాన్ని సాధించింది. కంటెంట్ ఎకానమీని క్యాష్ చేసుకునేలో భాగంగా రాష్ట్రంలో కంటెంట్ క్రియేటర్లకు శిక్షణ ఇచ్చేందుకు యూట్యూబ్ అకాడమీ ఏర్పాటు కానుంది. దీనిపై మంగళవారం సింగపూర్ లో మంత్రి నారా లోకేశ్ సమక్షంలో టీస్సెరాక్ యూఎస్ ఇంక్, యూట్యూబ్ ఇండియాలతో రాష్ట్ర ప్రభుత్వం ఎంఓయూ కుదుర్చుకుంది.
ప్రస్తుతం డిజిటల్ మీడియా ప్రభావం ఎక్కువగా ఉన్న విషయం తెలిసిందే. యూట్యూబ్ లో కంటెంట్ పోస్టు చేయడం ద్వారా ఎక్కువ మంది ఉపాధి పొందుతున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని కంటెంట్ క్రియేటర్లకు మరింత వృత్తి నైపుణ్యం పెంచేలా ప్రభుత్వం చొరవ చూపింది. సింగపూర్ పర్యటనలో భాగంగా ఏపీ ఐటీ, ఎలక్ట్రానిక్స్, హెచ్‌ఆర్‌డీ మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో అధికారులు టీస్సెరాక్ట్, యూట్యూబ్ ప్రతినిధులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. రాష్ట్రంలో యూట్యూబ్ అకాడమీ ఏర్పాటుకు వారితో చర్చించారు. అనంతరం యూట్యూబ్ అకాడమీ ఇండియా హెడ్ అర్జున్ దొరైస్వామి, టీస్సరాక్ట్ యూఎస్ ఇంక్ ప్రెసిడెంట్ తేజ ధర్మ, ఏపీ ఐటీ కార్యదర్శి కాటమనేని భాస్కర్ అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశారు.
ఈ ఒప్పందం ప్రకారం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యూట్యూబ్ అకాడమీ ఏర్పాటుకు స్థలాన్ని సమకూర్చనుంది. టీస్సెరాక్ట్ సంస్థ మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయనుండగా, గూగుల్, యూట్యూబ్ సిబ్బంది కంటెంట్ సృష్టికర్తలకు నైపుణ్య శిక్షణ ఇచ్చే బాధ్యతను తీసుకుంటారు. బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ (BCG) నివేదిక ప్రకారం, మన దేశంలో క్రియేటర్ ఎకానమీ 2030 నాటికి వన్ ట్రిలియన్ డాలర్ల మార్కెట్‌గా ఎదుగుతుందని అంచనా. ఇది అన్ని వయసుల వారికి మంచి అవకాశాలను కల్పించనుందని చెబుతున్నారు.