ఇది చాలా.. ఇంకొంచెం పెంచాలా... చంద్ర‌బాబు డైలాగ్‌...!

వాస్తవానికి ఇది సినిమా డైలాగ్‌. అయినప్పటికీ రాష్ట్రంలోనే కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ఈ మాట వినిపిస్తోంది.;

Update: 2025-11-20 03:06 GMT

వాస్తవానికి ఇది సినిమా డైలాగ్‌. అయినప్పటికీ రాష్ట్రంలోనే కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ఈ మాట వినిపిస్తోంది. దీనికి ప్రధాన కారణం ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు. అదేవిధంగా ఇతర పథకాలు. ఇవి ప్రజలకు చేరువ అవుతున్న తీరు విషయంలో జరుగుతున్న చర్చ. ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుంది. గత ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలు సహా ఇంకొన్నిటిని కూడా జోడించి ప్రజలకు చేరువ చేస్తోంది.

వీటిని పర్యవేక్షించాలని మంత్రులు అదే విధంగా ఇన్చార్జి మంత్రులకు సీఎం చంద్రబాబు చెబుతున్నారు. ఈ క్రమంలో ప్రజలను కలుస్తున్న నాయకులు వారి అభిప్రాయాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు, పథకాలు.. ఏ మేరకు ప్రజలకు చేరువవుతున్నాయి. ఏ మేరకు వారు లబ్ధి పొందుతున్నారు. అనే విషయాలను తెలుసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు సరిపోతాయా లేక ప్రజలు నాడి ఎలా ఉంది వారు ఏమనుకుంటున్నారు అనే అంశాలను వారు ఆరాతీస్తున్నారు.

దీనిలో భాగంగా ఇటీవల విశాఖపట్నంలో పర్యటించిన కూటమి నాయకులకు చిత్రమైన అనుభవం ఎదురైంది. వైసిపి హయాంలో అమలు చేసిన చేదోడు పథకాన్ని తిరిగి ప్రవేశపెట్టాలని బీసీ సామాజిక వర్గానికి చెందిన మహిళలు కోరారు. మరికొందరు అప్పట్లో అమలైన కొన్ని పథకాల పేర్లు చెప్పి వాటిని అమలు చేయాలని ప్రస్తావించారు. అయితే క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితిని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకు వెళ్తామని నాయకులు చెప్పారు. అక్కడితో ఆ విషయం ముగిసింది. పార్టీ నాయకులకు సమాచారం అందింది. ప్రస్తుతం ప్రజలు నాడి, ఇప్పటివరకు అందుతున్న సంక్షేమ పథకాలు మెజారిటీ సామాజిక వర్గాలకు చేరువ‌ అవుతున్నప్పటికీ ఎక్కడో అసంతృప్తి నెలకొందని తేలింది.

దానిని భర్తీ చేయాల్సిన అవసరం ఉందని నాయకులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ విషయాన్ని ఇంకా సీఎం చంద్రబాబు దృష్టి వరకు తీసుకువెళ్లలేదని సమాచారం. మరి ఆయన ఏమంటారు నిజంగానే ప్రజలకు ఇస్తున్న సంక్షేమ పథకాలు సరిపోవట్లేదు అంటే మరిన్ని ఇచ్చేందుకు సిద్ధపడతారా లేక ప్రస్తుత ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఇస్తున్న పథకాలను కొనసాగిస్తారా అనేది చూడాల్సి ఉంది. ఏదేమైనా ప్రజలు మాత్రం మరిన్ని పథకాలు అమలు చేయాలని కోరుకుంటున్నారన్న విషయం మాత్రం పార్టీలో చర్చనీయాంశంగా మారింది.

Tags:    

Similar News