మూడవ వంతు పాలన ముగిసింది...గ్రౌండ్ రిపోర్టు ఏమి చెబుతోంది ?

ఏపీలో టీడీపీ కూటమి పాలన మూడవ వంతు ఫిబ్రవరి 12 తో ముగిసింది. 2024 జూన్ 12న కూటమి అధికారంలోకి వచ్చింది.;

Update: 2026-02-13 02:30 GMT

ఏపీలో టీడీపీ కూటమి పాలన మూడవ వంతు ఫిబ్రవరి 12 తో ముగిసింది. 2024 జూన్ 12న కూటమి అధికారంలోకి వచ్చింది. ఈ రోజుతో ఇరవై నెలలు గడిచిపోయాయి. మొత్తం అరవై నెలలకు ప్రజలు కూటమికి అధికారం ఇచ్చారు, అందులో మూడవ వంతు ఖర్చు అయినట్లే. ఏపీలో కానీ ఉమ్మడి ఏపీలో కానీ మూడు పార్టీలతో కూడిన పాలన అయితే ఇప్పటిదాకా ఎవరూ చూడలేదు, 2024లో కూటమిగా కాంగ్రెస్ టీఆర్ఎస్ కమ్యూనిస్టులు అంతా కలసి పోటీ చేశారు వైఎస్సార్ ప్రభుత్వంలో టీఆర్ఎస్ కి మంత్రి పదవులు దక్కినా కొన్నాళ్ళకే వారు బయటకు వచ్చారు. దాని కంటే ముందు చూస్తే కేబినెట్ లో మిత్రులకు స్థానాలు ఇవ్వడం అన్నది పెద్దగా జరిగింది లేదు. ఇక ఏపీలో 2014, 2019లో టీడీపీ వైసీపీ కేబినెట్లు ఒకే పార్టీ మంత్రులతోనే ఏర్పాటు అయ్యాయి.

మంచి పరిణామమే :

కూటమిలో మూడు పార్టీలు కలసి మెలసి ఉండడం పొరపొచ్చాలు లేకుండా రాష్ట్ర స్థాయిలో కీలక నేతలు అంతా ముందుకు సాగడం మంచి పరిణామం. అంతే కాదు 2029 లో కూడా కలసి పోటీ చేయాలని నిర్ణయించడం మరో ముఖ్య పరిణామం. ఇక చంద్రబాబు విశేష అనుభవం ఉన్న వారు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నారు. పవన్ సహా ఎక్కువ మంది కేబినెట్ లో తొలిసారి గెలిచిన వారే. లోకేష్ అయితే 2017 నుంచి 2019 దాకా రెండేళ్ళ పాటు మంత్రిగా పనిచేసిన అనుభవం కలిగి ఉన్నారు. అయినా కూడా మంత్రివర్గం పనితీరు బాగానే ఉంది అన్న ఫీడ్ బ్యాక్ ఉంది.

సూపర్ సిక్స్ హామీలు :

ఇక సూపర్ సిక్స్ హామీలను కూటమి ప్రభుత్వం దాదాపుగా నెరవేర్చింది అని చెప్పాలి. అది కూడా కేవలం 20 నెలల కంటే ముందుగానే. ఇంకా కొన్ని హామీలు ఉన్నాయంటే అవి ఆలోచించాల్సి ఉంది. కూటమి హామీల అమలు తీరు పట్ల ఎక్కువ శాతం జనాలు సంతృప్తిగానే ఉన్నారు. మరీ ముఖ్యంగా సామాజిక పెన్షన్లు కూటమికి మంచి పేరు తెచ్చిపెడుతున్నాయి, అలాగే ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇవ్వడం మీద సంతృప్తి వ్యక్తం అవుతోంది. అన్నా క్యాంటీన్లు కూటమి ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చే అంశాలలో మరొకటిగా చూడాల్సి ఉంది. అదే విధంగా ఉచిత బస్సు పట్ల మహిళా లోకంలో అయితే హర్షం వ్యక్తం అవుతోంది. అన్నదాతా సుఖీభవ కేంద్రంతో కలసి ఇచ్చే ఆర్ధిక సాయం కూడా ప్రయోజనకరంగా ఉంది అని అంటున్నారు.

అభివృద్ధి విషయంలో :

చంద్రబాబు పాలన అంటే అభివృద్ధికే ఎక్కువ మంది చూస్తారు పట్టణవాసులు, చదువరులు, మేధావులు తటస్థులు అంతా కూడా దీని మీద ఇప్పటిదాకా అయితే హ్యాపీగానే ఉన్నారు. ఏపీలో అభివృద్ధి ఓవర్ నైట్ జరుగుతుంది అన్న అత్యాశలు ఎవరికీ లేవు కానీ ఆ దిశగా కూటమి పెద్దల అడుగులు బలంగానే పడుతున్నాయన్నది మెజారిటీ సెక్షన్ల భావనగా ఉంది. అలాగే పెట్టుబడులు తీసుకుని రావడంలో జరుగుతున్న ప్రయత్నాల పట్ల కూడా జనామోదం బాగానే ఉంది. అమరావతిని ఏకైక రాజధానిగా శాశ్వత రాజధానిగా చేయాలన్న కూటమి ప్రభుత్వ పెద్ద ఆలోచనలకు రెండవ మాట లేకుండా ఏపీ జనాలు మద్దతుగానే నిలుస్తున్నారు. పైగా తొందరగా ఆ పనులు పూర్తి కావాలని కోరుకుంటున్నారు. పోలవరం ఈ టీర్మ్ లోనే పూర్తి అవుతుంది అన్న ఆశాభావం కూడా చాలా మందిలో ఉంది.

బాబుకే మార్కులు :

ఇక కూటమిలో ఎవరి పెర్ఫార్మెన్స్ ఎలా అన్నది చూస్తే అందరూ బాగానే కష్టపడుతున్నారు కానీ ఏడున్నర పదుల వయసులో అహరహం శ్రమిస్తున్న చంద్రబాబుకే ఎక్కువ మార్కులు పడుతున్నాయి. కూటమి సారధిగా సీఎం గా బాబుకి అత్యధిక శాతం జై కొడుతున్నారు. బాబు ఉన్నారు చాలు అన్నదే ఏపీ జనాల నమ్మకంగా కనిపిస్తోంది. అదే సమయంలో యువ మంత్రిగా నారా లోకేష్ పనితీరు మీద సంతృప్తి ఉంది. ఇక ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన శాఖలలో చూపిస్తున్న ప్రభావవంతమైన పనితీరుని సైతం అంతా మెచ్చుకుంటున్నారు.

ఇప్పటికి అయితే లేదు :

ఇరవై నెలలు ఒక ప్రభుత్వం సాగుతోంది అంటే అసంతృప్తి రేగడం సహజం. కానీ అదృష్టమో లేదా కూటమి పాలకుల రెక్కల కష్టమో తెలియదు కానీ ఇప్పటికి అయితే పెద్దగా అసంతృప్తి అన్నది లేదు, పైగా ఇంకా జనాలు కూటమి పాలన రానున్న రోజులలో మరింతగా బాగా సాగుతుందని మద్దతు ఇస్తూ ముందుకు సాగుతున్నారు. ఇది కూటమి ఏలికలకి గుడ్ న్యూస్. అదే సమయంలో వైసీపీ ప్రతిపక్షంగా ఈ ఇరవై నెలలలో పెద్దగా కార్యక్రమాలు చేయకపోవడం కూడా కూటమికి శ్రీరామ రక్ష గానే ఉంది. ఓవరాల్ గా చూస్తే మూడవ వంతు పాలనకు మంచి మార్కులే పడుతున్నాయి. కానీ మిగిలిన రెండు వంతులే అసలైన పరీక్షగా చూడాల్సి ఉంది ఎన్నికల ఏడాదిని పక్కన పెడితే కచ్చితంగా మిగిలినది 28 నెలలు మాత్రమే. దాంతో మరింత పట్టుదలగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగాల్సిన అవసరం అయితే ఉంది.

Tags:    

Similar News