ఏపీలో ఆ వర్గాలకు ఆప్షన్ కూటమే.. !
రాష్ట్రంలోని కొన్ని సామాజిక వర్గాలకు రాజకీయ ఆప్షన్ కీలకంగా మారింది. గత కొన్నాళ్లుగా రాజకీయాలకు సామాజిక వర్గాలకు మధ్య అనుబంధం పెరిగిపోయిన విషయం తెలిసిందే.;
రాష్ట్రంలోని కొన్ని సామాజిక వర్గాలకు రాజకీయ ఆప్షన్ కీలకంగా మారింది. గత కొన్నాళ్లుగా రాజకీయాలకు సామాజిక వర్గాలకు మధ్య అనుబంధం పెరిగిపోయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కొన్నికొన్ని సామా జిక వర్గాలు .. రాజకీయంగా వేర్పాటు వాదంతోనే వ్యవహరిస్తున్నాయి. ఉదాహరణకు రెడ్డి సామాజిక వర్గం గతంలో కాంగ్రెస్‌తో అనుబంధం పెంచుకుంది. వైఎస్ హయాం నుంచి జగన్ వరకు కూడా రెడ్డి వర్గం ఆ కుటుంబంతోనూ.. కాంగ్రెస్, వైసీపీతోనే కొనసాగింది.
ఇక, ఎన్టీఆర్ ఆత్మగౌరవ నినాదంతో టీడీపీని స్థాపించిన నాటి నుంచి కమ్మ సామాజిక వర్గం... దాదాపు ఆపార్టీతోనే ముందుకు సాగింది. మధ్యలో ఈ సామాజిక వర్గంలోని కొందరు మాత్రమే ప్రాంతాల వారీగా మారి.. కాంగ్రెస్‌కు మద్దతు తెలిపాయి. కానీ.. గత ఎన్నికలకు ముందు మళ్లీ.. కమ్మ సామాజిక వర్గం ఏకమైంది. పూర్తిగా టీడీపీకి దన్నుగా మారింది. ముఖ్యంగా చంద్రబాబు హయాంలో టీడీపీ వైపే మెజారిటీ కమ్మ సామాజిక వర్గం అండగా నిలిచింది.
మరోవైపు.. క్షత్రియ సామాజిక వర్గంలో రెండుభిన్నమైన అంశాలు కనిపించాయి. పారిశ్రామికంగా కమ్మ వర్సెస్ క్షత్రియ సామాజిక వర్గాల మధ్య పోటీ.. రాజకీయంగా కూడా కనిపించింది. క్షత్రియ సామాజిక వర్గం నుంచి కొందరు మాత్రమే రాజకీయంగా దూకుడుగా ఉన్నారు. మిగిలిన వారంతా వ్యాపారాలు, బిజినెస్‌లో నే ఉన్నారు. అయితే.. వీరిలో కొందరు టీడీపీ వైపు ఉండగా.. మరికొందరు బీజేపీ వైపు కొనసాగారు. 2019 ఎన్నికలకు ముందు వైసీపీపై ఆశతో వీరంతా ఏకమైనా.. మధ్యలో కీలక క్షత్రియ నాయకుడు అశోక్ గజపతిరాజును వేధించడం.. ప్రస్తుత ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజును వేధించడంతో ఆ వర్గం వైసీపీకి దూరమైంది.
ఇక, ఎస్సీ ఎస్టీ వర్గాలు.. ఆది నుంచి కాంగ్రెస్‌కు అండగా ఉన్నాయి. ఇదే ధోరణి వైసీపీకి కలిసి వచ్చింది. అయితే.. గత ఎన్నికల సమయంలో వీరిలో కొంత చీలిక కనిపించినా.. మెజారిటీవర్గం ఇప్పటికీ వైసీపీకి దన్నుగానే ఉండడం గమనార్హం. మరో ముఖ్యమైన సామాజికవర్గం కాపులు. వీరు.. ఆది నుంచి అటు-ఇటు అన్నట్టుగా వ్యవహరించారు. అయితే.. జనసేన పార్టీ ఆవిర్భావంతో వారంతా ఇప్పుడు పవన్ వెంటే నడుస్తున్నారు. ఇక, వచ్చే ఎన్నికల నాటికి కూడా.. ఇదే పరిస్థితి ఉంటుందా? అనే విషయంపై ప్రస్తుతం అనుమానాలు ఉన్నప్పటికీ.. మెజారిటీ సామాజిక వర్గాల ఆప్షన్ కూటమివైపే ఉందని అంటున్నారు పరిశీలకులు.