కొత్త ఎన్నికల కమిషనర్...వైసీపీకి బిగ్ ట్విస్ట్ ఇచ్చేలా ?
ఇక 2024 లో అసెంబ్లీ ఎన్నికలను ఏకపక్షంగా గెలుచుకున్న టీడీపీ కూటమి 2026 లో రెండవ ప్రథమార్ధంలో స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలని చూస్తోంది.;
ఏపీలో టీడీపీ కూటమి వర్సెస్ వైసీపీ అన్నట్లుగా రాజకీయ సమరం భీకరంగా సాగుతోంది. ఇక 2024 లో అసెంబ్లీ ఎన్నికలను ఏకపక్షంగా గెలుచుకున్న టీడీపీ కూటమి 2026 లో రెండవ ప్రథమార్ధంలో స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలని చూస్తోంది. అయితే రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవి ఖాళీగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం సిఫార్సుతో ఈ పదవిని గవర్నర్ నియమిస్తారు. నీలం సాహ్ని పదవీ కాలం పూర్తి కావడంతో కొత్త వారు రావాల్సి ఉంది. దీని కోసం కూటమి ఏ విధమైన నిర్ణయం తీసుకుంటుంది అన్న చర్చ అయితే రాజకీయంగా వాడిగా వేడిగా సాగుతోంది.
తెర ముందుకు పలు పేర్లు :
ఈ నేపథ్యంలో తెర ముందుకు అనేక పేర్లు వస్తున్నాయి. సాధారణంగా ఈ పదవిలోకి మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులను తీసుకుంటారు. అదే సమయంలో సీనియర్ ఐఏఎస్ అధికారులను కూడా తీసుకుంటారు అది ప్రభుత్వం ఇష్టంగా ఉంటుంది. ఈ క్రమంలో కూటమి ప్రభుత్వం మాత్రం మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శుల పేర్లను పరిశీలిస్తోంది. అలా ఇప్పటిదాకా కొందరు పేర్లు ప్రచారంలో ఉన్నా ఎక్కువగా నీరభ్ కుమార్ ప్రసాద్ పేరు వినిపిస్తూ వచ్చింది. అయితే ఇందులో మరో ట్విస్ట్ అన్నట్లుగా సడెన్ గా ఇంకో మాజీ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం పేరు కూడా జోరుగా ప్రచారం సాగుతోంది.
ఎల్వీ వైపు ఎందుకు :
ఎల్వీ సుబ్రమణ్యం సమర్ధవంతమైన అధికారిగా పేరు తెచ్చుకున్నారు. ఇక 2019 ఎన్నికల సందర్భంలో అయితే కేంద్ర ప్రభుత్వం ఆయనను ప్రత్యేకంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమించింది. అలా ఆయన నాయకత్వంలో ఎన్నికలు జరిగాయి. ఆ తర్వాత వైసీపీ ప్రభుత్వంలో ఆయననే కొన్నాళ్ళ పాటు కొనసాగించారు. కానీ అత్యంత అవమానకరమైన తీరులో ఆయనను ఈ పదవి నుంచి వైసీపీ తప్పించింది. కనీసం ఆయన నుంచి ఏ రకమైన వివరణ కోరకుండానే ఎల్వీని కీలకమైన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నుంచి తప్పించారు. దాంతో ఆయన చాలా ఆవేదన చెందారు. ఇక తన రిటైర్మెంట్ దాకా చూసి పదవీ విరమణ చేసి వెళ్ళారు. ఇలా వైసీపీ వల్ల ఇబ్బందులు పడిన ఐఏఎస్ అధికారిగా ఆయన విషయం ఉంది. దాంతో ఆయన పేరు కూటమి ఎక్కువగా పరిశీలిస్తోంది అని అంటున్నారు.
ఒక్క దెబ్బకు రెండు :
ఎల్వీ సుబ్రమణ్యం లాంటి నిజాయితీ నిబద్ధత కలిగిన అధికారికి ఎన్నికల సంఘం కమిషనర్ పదవి ఇస్తే అంతా మెచ్చుకుంటారు. ఐఏఎస్ అధికారుల గౌరవం నిలబెట్టిన ప్రభుత్వంగా టీడీపీ కూటమి పేరు జనంలో ఉంటుంది మరో వైపు చూస్తే వైసీపీ ఎల్వీకి డిమోషన్ ఇచ్చి పక్కకు పెడితే ఆయననే తెచ్చి కీలక పదవి ఇవ్వడం ద్వారా వైసీపీకి టిట్ ఫర్ టాట్ అన్నట్లుగా చేసినట్లు అవుతుందని కూటమి పెద్దలు ఆలోచిస్తున్నారు అని అంటున్నారు.
పొలిటికల్ గానే చూస్తే :
ఎల్వీ సుబ్రమణ్యం కి కీలక పదవి ఇవ్వడం రాజకీయంగా చూస్తే సరైన వ్యూహం అని అంటున్నారు. నిజానికి నీరభ్ కుమార్ ప్రసాద్ వంటి సీనియర్ కి ఈ పదవి ఇస్తే బాగానే ఉంటుంది. కానీ అన్ని విధాలుగా కూటమికి కలసి రావాలీ అంటే ఎల్వీనే సెలెక్ట్ చేయడం ది బెస్ట్ అని అంటున్నారుట. దాంతో ఎక్కువ మొగ్గు ఎల్వీ వైపే ఉందని అంటున్నారు. ఈ దెబ్బకు వైసీపీ ఇరుకున పడడం ఖాయమని అంటున్నారు. తొందరలోనే ఈ నియామకం గురించి కీలక నిర్ణయం కూటమి తీసుకోబోతున్న వేళ ఎల్వీ కనుక కొత్త కమిషనర్ అయితే లోకల్ ఫైట్ సరికొత్త మలుపులు తిరిగే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.