రైల్వే జోన్ ఘనత ఎవరిది...భుజాలు తడుముకోవాల్సిందే !
విశాఖ రైల్వే జోన్ కల ఎట్టకేలకు సాకారం అయింది. ఇది అర్ధ శతాబ్దం కల అన్నది తెలిసిందే.
విశాఖ రైల్వే జోన్ కల ఎట్టకేలకు సాకారం అయింది. ఇది అర్ధ శతాబ్దం కల అన్నది తెలిసిందే. 1970 ప్రాంతంలో విశాఖ లోక్ సభ సభ్యుడు తెన్నేటి విశ్వనాథం పార్లమెంట్ లో తొలిసారి విశాఖ రైల్వే జోన్ గురించి గళం విప్పారు. ఆ తరువాత అది ఇంతదాకా సాగుతూ వచ్చింది. మొత్తానికి జూన్ 1న అధికారికంగా విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ప్రారంభం అయింది. ఈ క్రెడిట్ మాది అంటే మాది అని కూటమి పార్టీలతో పాటు ప్రతిపక్ష వైసీపీ అలాగే వామపక్షాలు కాంగ్రెస్ కూడా అంటున్నాయి. మరి ఇంతకీ రైల్వే జోన్ ఘనత ఎవరిది అంటే అందరిదీ అని ఒక్క ముక్కలో జవాబు చెప్పాల్సి వస్తుంది. అంతే కాదు ఒక జీవిత కాలం లేట్ అయింది కూడా జనాల అభిప్రాయంగా ఉంది. మరో వైపు రైల్వే జోన్ రావడానికి రాజకీయ అనివార్యతలే కారణం అయ్యాయి తప్పించి పోరాటల వల్ల జరిగింది కొంత శాతం మాత్రమే అన్న నిష్టూరమైన విశ్లేషణ సైతం వినిపిస్తోంది.
బీజేపీ అనుకుంటే కనుక :
రైల్వే జోన్ కోసం మూడు దశాబ్దాలుగా పోరాటం చేశామని బీజేపీ నేతలు చెబుతున్నారు. అందువల్ల మా ఘనత జోన్ రావడం అని క్లెయిం చేసుకుంటున్నారు. నిజానికి చూస్తే ఈ మూడు దశాబ్దాలలో కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్నదే 18 ఏళ్ళు అంటే మెజారిటీ కాలం అన్న మాట. మరి ఇంతకాలం అధికారంలో ఉంటే పోరాడడం ఎందుకు ఏనాడో కల సాకారం కావాలి కదా అన్నది మేధావుల నుంచి వస్తున్న ప్రశ్న. వాజ్ పేయ్ ప్రధానిగా ఉన్నపుడే దేశంలో రైల్వే జోన్లు అధికం అయ్యాయి. ఆనాడు రైల్వే మంత్రులుగా ఉన్న వారు అంతా తమ సొంత రాష్ట్రాలకు జోన్లు తెచ్చుకున్నారు. ఆ సమయంలో ఏపీకి ఎందుకు రైల్వే జోన్ ఇవ్వలేదు అన్న ప్రశ్నకు కమలనాధులు జవాబు చెప్పాలి కదా అని అంటున్నారు. ఇక 2014 నుంచి మోడీ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలో ఉంది. విభజన చట్టంలో కూడా రైల్వే జోన్ పెట్టారు. కానీ బీజేపీ మాత్రం పుష్కర కాలం తాత్సారం చేసి ఈ రోజుకు జోన్ ఇచ్చిందంటే దాని వెనక రాజకీయ అనివార్యతలు ఉన్నాయన్నది మరి కొందరి మాటగా ఉంది.
టీడీపీ సైతం :
ఇక తెలుగుదేశం పార్టీ విషయానికి వస్తే 1999 నుంచి 2004 మధ్యలో వాజ్ పేయి ప్రభుత్వానికి ప్రాణ వాయువు లాంటి మద్దతుని అందించింది. ఆ సమయంలో రైల్వే జోన్ కోసం విశాఖలో ఉద్యమాలు జరిగాయి. కానీ కేంద్రం మీద టీడీపీ ఎందుకు ఒత్తిడి తీసుకుని రాలేదని కూడా ప్రజా సంఘాల నుంచి ప్రశ్నలు వస్తున్నాయి. అలాగే 2014 నుంచి 2018 దాకా నాలుగేళ్ళ పాటు కేంద్రంలో బీజేపీతో టీడీపీ కలసి ఉంది. ప్రభుత్వంలో మంత్రులు కూడా ఉన్నారు. మరి ఈ నాలుగేళ్ళ కాలంలో అయినా రైల్వే జోన్ ఎందుకు తేలేకపోయారు అని విపక్షాల నుంచి ప్రశ్నలు వస్తున్నాయి.
వైసీపీ విషయం తీసుకుంటే :
ఇక వైసీపీ 2019 నుంచి 2024 వరకూ ఏపీలో అధికారంలో ఉంది. 2019 ఎన్నికల ముందు విశాఖ వచ్చిన ప్రధాని మోడీ రైల్వే జోన్ ఇచ్చామని జీవోని సభలో ప్రదర్శించారు. ఆ తరువాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ఆ విషయం మీద ఎందుకు పోరాడలేదని ప్రశ్నిస్తున్నారు. తాము అధికారంలో ఉన్న అయిదేళ్ళ కాలంలో జోన్ ని వేగవంతంగా వచ్చేలా చేసి ఉంటే క్రెడిట్ తీసుకునే అవకాశం ఉండది కదా అని అంటున్నారు
విభజన తరువాత కానీ :
ఇక కాంగ్రెస్ కేంద్రంలో యూపీఏ ప్రభుత్వాన్ని రెండు సార్లు పదేళ్ళ పాటు నడిపింది. ఆ సమయంలో విశాఖ రైల్వే జోన్ అన్నది ఎందుకు ఇవ్వలేకపోయింది అని ప్రశ్నిస్తున్నారు విభజన జరిగితే తప్ప కాంగ్రెస్ కి గుర్తు రాలేదా అని కూడా అండుగుతున్నారు. వామపక్షాలు మొదటి యూపీఏ ప్రభుత్వంలో భాగస్వాములు. మరి వారు వీధి పోరాటాలతో పాటు కేంద్రంలో ఎందుకు ఒత్తిడి పెంచలేకపోయారు అన్నది కూడా మరో ప్రశ్న. ఏతా వాతా తేలేది ఏంటి అంటే రైల్వే జోన్ కోసం అందరూ పోరాటాలు చేశారు. ఉద్యమించారు, కానీ జోన్ వచ్చింది మాత్రం రాజకీయ అనివార్యతల వల్లనే అని విశ్లేషిస్తున్నారు. అది కూడా బీజేపీ ఇవ్వాలనుకుంది ఇచ్చింది అని గుర్తు చేస్తున్నారు.
పూర్తి జోన్ వచ్చినట్లేనా :
సరే ఇంతకీ పూర్తి జోన్ వచ్చిందా అంటే ఇంకా రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ రావాల్సి ఉందని అంటున్నారు. అలాగే వాల్తేరు డివిజన్ ని రెండు ముక్కలు చేసి ఆదాయం వచ్చే కేకే లైన్ ని రాయగడలో కలిపేశారు. దానిని తిరిగి విశాఖ డివిజన్ లో కలపాలని కూడా డిమాండ్ ఉంది. ఇవన్నీ జరిగిన తరువాతనే రైల్వే జోన్ వచ్చినట్లు అని గట్టిగా ఎవరైనా చెప్పుకోవాల్సి ఉంటుందని అంటున్నారు.