ఉత్తరాంధ్రలో గుడివాడ.. సెంట్రల్ ఆంధ్రాలో జోగి.. వైసీపీలో మరెవరికి పట్టదా?
ఏపీ రాజకీయాలను ఇప్పుడు రెండే అంశాలు తీవ్ర ప్రభావితం చేస్తున్నాయి. అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధానికి కారణమవుతున్నాయి.;
ఏపీ రాజకీయాలను ఇప్పుడు రెండే అంశాలు తీవ్ర ప్రభావితం చేస్తున్నాయి. అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధానికి కారణమవుతున్నాయి. అందులో ఒకటి విశాఖలో గూగుల్ భారీ పెట్టుబడి అయితే మరొకటి మునకలచెరువు నకిలీ మద్యం కేసు. ప్రస్తుతం ఈ రెండింటి చుట్టూ రాజకీయం తిరుగుతోంది. రూ.1.36 లక్షల కోట్ల భారీ పెట్టుబడితో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు కానుందని, దీనివల్ల లక్షా 80 వేల ఉద్యోగాలు రానున్నాయని ప్రభుత్వం చెబుతోంది. అదే సమయంలో అటు నకిలీ మద్యం కేసులో వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేష్ ను కార్నర్ చేస్తోంది. అయితే ఈ రెండు అంశాలపై వైసీపీ నుంచి పెద్ద సౌండ్ వినిపించడం లేదని అభిప్రాయం వ్యక్తమవుతోంది.
విశాఖ గూగుల్ సెంటర్ పై ప్రభుత్వం ఆర్భాటంగా ప్రచారం చేసుకుంటోంది. విశాఖ ముఖచిత్రం మారిపోవడమే కాకుండా, ఏపీ గ్రోత్ ఇంజిన్ గా విశాఖ తయారు అవుతుందని, వికసిత్ భారత్ లక్ష్యాలను చేరుకోవడానికి కూడా ఉపయోగపడుతుందని ప్రభుత్వం చెప్పుకుంటోంది. గత ప్రభుత్వంలో పరిశ్రమలను తరిమేశారని భారీ ఎత్తున విమర్శలు గుప్పించిన కూటమి నేతలు.. నేడు రాష్ట్రానికి కొత్త పరిశ్రమలు వెల్లువలా తరలివస్తున్నాయని చాటుతున్నారు. ఈ ప్రచారంతో వైసీపీ శ్రేణులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. ఐదేళ్ల వైసీపీ ప్రభుత్వంలో ఇంతటి భారీ పెట్టుబడలు వచ్చినట్లు చెప్పుకోలేక సతమతమవుతున్నారు.
ఇలాంటి పరిస్థితుల్లో తెరపైకి వచ్చిన మాజీ మంత్రి గుడివాడ అమరనాథ్.. ప్రభుత్వ మాటల దాడితో ఉక్కిరిబిక్కిరి అవుతున్న వైసీపీ శ్రేణులకు కాస్త ఊపిరి లూదారు. భారీ పెట్టుబడి రావడాన్ని వ్యతిరేకించలేని పరిస్థితుల్లో ఉన్న వైసీపీ.. ఇందులో కొన్ని కీలక అంశాలను లేవనెత్తి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని ప్రయత్నం చేసింది. ‘గూగుల్ డేటా సెంటర్’ వల్ల కేవలం 200 ఉద్యోగాలు మాత్రమే వస్తాయని, ప్రభుత్వం చెబుతున్నట్లు 1.80 లక్షల ఉద్యోగాలు ఎలా వస్తాయో చెప్పాలని మాజీ మంత్రి అమరనాథ్ ప్రశ్నించడం తీవ్ర చర్చకు దారితీసింది. అయితే ఆయన విమర్శలపై ప్రతిదాడి ప్రారంభించిన అధికారపక్షం ముప్పేట చుట్టుముట్టింది. ‘గుడ్డు’ మంత్రికి ఏం తెలుసంటా? అమరనాథ్ ను టార్గెట్ చేసింది.
అయితే ఈ సమయంలో అమరనాథ్ లేవనెత్తిన అంశాలపై మరికొందరు వైసీపీ నేతలు కూడా స్పందిస్తే ప్రభుత్వం వివరణ ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడేదని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. కానీ, వైసీపీ నుంచి ఏ ఒక్కరూ గూగుల్ విషయంలో మాట్లాడే సాహసం చేయకపోవడంతో అమరనాథ్ ఒంటరి అయినట్లు కనిపిస్తోందని విశ్లేషిస్తున్నారు. ఇదే పరిస్థితి సెంట్రల్ ఆంధ్రాలో మాజీ మంత్రి జోగి రమేష్ ఎదుర్కొంటున్నట్లు చెబుతున్నారు. నకిలీ మద్యం కేసులో జోగి రమేష్ చుట్టూ ఉచ్చు బిగించేలా ప్రభుత్వం పావులు కదుపుతున్నా, ఆయనకు మద్దతుగా ఏ వైసీపీ నేత మాట్లాడటం లేదని ఎత్తిచూపుతున్నారు.
ఇలాంటి సమయంలో పార్టీ సీనియర్లు కల్పించుకుని మాట్లాడితే బాగుండేదని వైసీపీ శ్రేణులు సూచిస్తున్నాయి. కానీ, వైసీపీలో నెంబర్ టు లీడర్ దగ్గర నుంచి మాజీ ఎమ్మెల్యేల వరకు ఏ ఒక్కరూ ప్రస్తుత రాజకీయ పరిణామాలపై స్పందించకపోవడం అంతుచిక్కడం లేదని అంటున్నారు. పార్టీ ఓడిపోయిన నుంచి ఇదే పరిస్థితి కొనసాగుతోందని అంటున్నారు. ఎవరు ఇబ్బందుల్లో పడితే వారే డిఫెండ్ చేసుకోవాల్సివస్తుందని, వారిని సేవ్ చేయాల్సిన పార్టీ సీనియర్లు చేష్టలుడిగి చూస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. దీనివల్ల టీడీపీ కూటమి నేతలదే పైచేయి అవుతోందని అంటున్నారు.