బాలయ్య నోట సైకోగాడు మాట వేళ.. బాబు పెద్దరికం ఏమైంది?
ఇలాంటి వేళలో.. జరిగే నష్టం కంటే.. సదరు నేతకు ఎక్కువ ప్రాధాన్యతను ఇవ్వటం ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకురావటమేకాదు.. అధినేత గౌరవ మర్యాదలకు నష్టం వాటిల్లేలా చేస్తుంది;
ఒకరి తీరు మొత్తం ప్రభుత్వానికే చెడ్డపేరు తెచ్చే ఘటనలు కొన్నిసార్లు జరుగుతుంటాయి.ఇలాంటి వేళలో.. జరిగే నష్టం కంటే.. సదరు నేతకు ఎక్కువ ప్రాధాన్యతను ఇవ్వటం ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకురావటమేకాదు.. అధినేత గౌరవ మర్యాదలకు నష్టం వాటిల్లేలా చేస్తుంది. ఈ విషయంలో జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న వేళలో.. పార్టీలోని కొందరు నేతలు చేసిన తప్పుడు పనులు పార్టీకి.. ప్రభుత్వానికి ఎంత డ్యామేజ్ చేశాయో తెలిసిందే. తాజాగా ఏపీలోని కూటమి సర్కారు నడుపుతున్న చంద్రబాబు రాజకీయ అనుభవాన్ని ఎవరూ ప్రశ్నించలేనిది. రెండు తెలుగు రాష్ట్రాల్లో అత్యంత సీనియర్ అధినేతగా చంద్రబాబు ట్రాక్ రికార్డు తిరుగులేనిది.
అలాంటి ఆయన సభలో ఉన్న వేళలో.. పార్టీ సీనియర్ నేత.. వ్యక్తిగతంగా బావమరిది కం వియ్యంకుడైన సినీ నటుడు బాలక్రిష్ణ ఇటీవల అసెంబ్లీలో ఆయన నోటి నుంచి వచ్చిన మాటలు రేపిన మంటలు.. తదనంతరం చోటు చేసుకున్న పరిణామాల్ని చూసినప్పుడు బాధ్యతగా వ్యవహరించటాన్ని బాలయ్యకు వేరే వారెవరూ నేర్పించాలా?అన్నది ఒక ప్రశ్న అయితే.. వెనుకా ముందు చూసుకోకుండా మాట్లాడిన బాలక్రిష్ణ మాటలకు సున్నితంగా అయినా చెక్ పెట్టాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి హోదాలో ఉన్నచంద్రబాబుకు లేదా? అన్నది మరో ప్రశ్న.
నిండు అసెంబ్లీలో వైసీపీ అధినేత.. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశిస్తూ సైకోగాడు అంటూ వ్యాఖ్యానించటం.. ఆ సందర్భంగా కళ్లజోడును తలపైకి జుట్టు మీదకు నెట్టి.. రెండుచేతుల్ని ప్యాంటు జేబుల్లోకి పెట్టి.. ముద్ద ముద్దగా మాట్లాడటం.. ఆ సందర్భంగా ఆయన గొంతు.. బాడీ లాంగ్వేజ్ అసెంబ్లీ గౌరవ మర్యాదలకు భంగం వాటిల్లేదన్న విషయాన్ని కాదనలేరు.
రాజకీయ ప్రత్యర్థిపై ఆయన చేసిన అనుచిత వ్యాఖ్యను ఇటీవల కాలంలో చోటు చేసుకున్న రాజకీయ అతికి నిదర్శనంగా భావిస్తూ సర్దిచెప్పుకోవచ్చు. సర్లే.. అని మరికొందరు ఊరుకోవచ్చు.కానీ.. జగన్ ను ఉద్దేశించి మాట్లాడటంతో సరి పెట్టని బాలక్రిష్ణ.. సభలో లేని.. సభకు సంబంధం లేని చిరంజీవి ప్రస్తావన తీసుకురావటం.. ఆయన మర్యాదకు భంగం వాటిల్లేలా మాట్లాడటం ద్వారా సాధించింది ఏమిటి? అన్నది మరో ప్రశ్న. ఇలా ఒక్కరి కారణంగా ప్రభుత్వ ఇమేజ్.. తన గౌరవ మర్యాదలకు.. తనకున్న పెద్దమనిషి బ్రాండ్ ను దెబ్బ తినేలా వ్యవహరిస్తుంటే.. చంద్రబాబు ఎందుకు జోక్యం చేసుకోలేదు. బాలక్రిష్ణను కంట్రోల్ చేసే విషయంలో ఆయన ఎందుకు విఫలమయ్యారు? అన్నది ప్రశ్నగా మారింది.
బాలక్రిష్ణ అతిని సభానాయకుడిగా ఉన్న చంద్రబాబు జోక్యం చేసుకొని సరిదిద్ది ఉంటే అక్కడితో విషయం ఆగేది. ఒకవేళ.. కొందరి రాజకీయ ప్రయోజనం కోసం ముందుకు వెళ్లినా.. బాబు జోక్యం వారి వాదనకు చెక్ చెప్పేలా ఉండేది. కానీ.. అందుకు భిన్నంగా బాబు మౌనంగా ఉండటం ఆయనతీరును ప్రశ్నించేలా చేస్తోంది. నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్న బాలక్రిష్ణను నియంత్రించే విషయంలో చంద్రబాబు వైఫ్యలం ఆయనకున్న మర్యాదను డ్యామేజ్ చేసేలా మారింది.
రాజకీయాల్లో వ్యక్తులు అప్పుడప్పుడు మాత్రమే కీలకం అవుతారు. అత్యధిక సందర్భాల్లో అందుకు భిన్నమైన పరిస్థితులు ఉంటాయన్నది మర్చిపోకూడదు. ఇప్పటికైనా చంద్రబాబు కాస్తంత జాగ్రత్తతో వ్యవహరించాలి. లేదంటే.. అసెంబ్లీలో మర్యాద కోసం.. ఆత్మాభిమానం కోసం పోరాటం చేసిన ఆయన.. ఇప్పుడు ఆయన సభానాయకుడిగా ఉన్న అసెంబ్లీలో వేరే వారి ఆత్మాభిమానం దెబ్బతినేలా పరిణామాలు చోటు చేసుకోవటం ఆయన పెద్దరికాన్ని ప్రశ్నించేలా చేస్తుందన్నది మర్చిపోకూడదు.